పూతలపట్టులో పట్టు సాధించేది ఎవరు ?
వైసిపి అభ్యర్థిగా డా. సునీల్ కుమార్
టిడిపి అభ్యర్థిగా మురళీ మోహన్
కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం ఎస్ బాబు
తప్పని త్రిముఖ పోటి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటివరకు వైసిపి, తెలుగుదేశం మధ్య పోటీ ఉండగా బుధవారం రాత్రి పూతలపట్టు వైసిపి ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబును కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో పూతలపట్టులో ముక్కోణపు పోటీ తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ పాత్రికేయుడు కలికిరి మురళీమోహన్ రంగంలో ఉన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెస్ బాబు రంగ ప్రవేశం చేయడంతో పూతలపట్టు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
పూతలపట్టు నియోజకవర్గం 2009లో ఏర్పాటయ్యింది. ఐరాల, పూతలపట్టు, తవణంపల్లి, బంగారు పాల్యం, యాదమరి మండలాలను కలిపి పూతలపట్టు నియోజకవర్గం గా ఏర్పాటు చేశారు. పూతలపట్టు నియోజకవర్గానికి ఇప్పటివరకు మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికలలో డాక్టర్ రవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో డాక్టర్ సునీల్ కుమార్, 2019 ఎన్నికల్లో ఎమ్మెస్ బాబు వైసిపి అభ్యర్థులుగా విజయ కేతనం ఎగురవేశారు. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు. ఈ మూడు ఎన్నికల్లో గతంలో పలమనేరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన లలిత కుమారి పోటీ చేయగా, ఆమె ఓటమి పాలయ్యారు.
పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు మీద నియోజకవర్గంలోని ఒక వర్గం తిరుగుబాటు బావుటా ఎగరేవేసింది. ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనకు టికెట్లు ఇస్తే రానున్న ఎన్నికలలో తాము పార్టీ కోసం పనిచేయమని బహాటంగా పత్రికలకు ఎక్కారు. దీంతో అధిష్టానం ఎమ్మెస్ బాబును పక్కనపెట్టి, 2014లో పూతలపట్టు ఎమ్మెల్యేగా గెలుపొందిన సునీల్ కుమార్ కు మరో మరో అవకాశం ఇచ్చింది. సునీల్ కుమార్ అందర్నీ కలుపుకొని పార్టీ విజయం కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు అండగా మండల పార్టీ అధ్యక్షులు, ఎం పి పి లు, జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు ఉన్నారు. అలాగే ఇటీవల తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి కూడా వైసీపీలో చేరారు. ఆమె కూడా వివిపి అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు వైసీపీ విజయం సాధించడంతో, మూడో పర్యాయ కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్యర్యంలో నాయకులు సమైఖ్యంగా సునీల్ కుమార్ గెలుపు కోసం పనిచేస్తున్నారు.
పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూసింది. మూడు పర్యాయాలు పలమనేరు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి పోటీ చేసినా, ఫలితం లేకపోయింది. 2019 ఎన్నికల తర్వాత లలిత కుమారి పార్టీకి రాజీనామా చేసి, క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. సుమారు నాలుగు సంవత్సరాలు పాటు పూతలపట్టుకు టిడిపి ఇన్చార్జ్ లేకుండానే సాగింది. దీంతో తెలుగుదేశం పార్టీ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తిరుపతిలో పాత్రికేయుడుగా పనిచేస్తున్న కలికిరి మురళీమోహన్ ను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించింది. ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన తర్వాత పూతలపట్టులో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మురళీమోహన్ ను టిడిపి అభ్యర్థిగా ప్రకటించి, ఆయన గెలుపుకు కృషి చేయాల్సిందిగా కోరారు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ కోసం పలువురు పోటీపడినా, చివరకు కలికిరి మురళీమోహన్ ని వరించింది. ఆయన నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ, ఈ పర్యాయం ఎలాగైనా పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగరేవేయాలని పనిచేస్తున్నారు. ఆయన అండగా మండల పార్టీ నాయకులకు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు.
మరోసారి పూతలపట్టు ఎమ్మెల్యే టికెట్ ను వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరాకరించడంతో ఎమ్మెస్ బాబు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. నియోజకవర్గంలో ఇద్దరూ రెడ్లు చెప్పిన విధంగానే పనిచేశానని, వారికి లేని వ్యతిరేకత తనకు తనకు ఎలా ఉంటుందని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఏనాడైనా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారా? తప్పొప్పులు ఎత్తి చూపారా అంటూ ముఖ్యమంత్రినే నిలతీశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెస్ బాబు కొంత కాలం సైలెంటుగా ఉన్నారు. అనంతరం రెండు రోజుల కిందట కడపలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రెండురోజులు కూడా గడవకముందే ఆయనను పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెస్ బాబుకు నియోజకవర్గంలో సొంత వర్గం ఉంది. మండల స్థాయి నాయకులు కొందరు తోడుగా ఉన్నారు. ఆయన ద్వారా మేలు పొందిన వారు ఇప్పటికీ ఆయన వెంట ఉన్నారు.
దీంతో పూతలపట్టు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనివార్యమని తెలుస్తోంది. పూతలపట్టు నియోజకవర్గం మీద మూడవసారి కూడా వైసీపీ జెండాను ఎగురవేయాలని వైసిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మూడుసార్లు ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. 2014 ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి నియోజకవర్గంలో తమ సత్తా చూపాలని ప్రయత్నం చేస్తుంది. త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో వేసి చూడాల్సిందే.