ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల ఓటమేలక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి
ఉమ్మడి చిత్తూరులో రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులు, పైఎత్తులు
కుప్పంలో చంద్రబాబును, రాజంపేటలో కిరణ్ ను ఓడించాలని పెద్దిరెడ్డి లక్ష్యం
కుప్పంలో లక్ష ఓట్ల మేజరిటితో గెలువాలని చంద్రబాబు
రాజంపేట పార్లమెంటులో సత్తా చాటాలని కిరణ్ కుమార్
ఎత్తులు, పైఎత్తులతో రసవత్తరంగా ఉమ్మడి చిత్తూరు రాజకీయం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిని ఓడించాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య యూనివర్సిటీ నుంచి విభేదాలు ఉన్నాయి. అప్పటినుంచి ఇద్దరు ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. అలాగే మరో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. రాజకీయంగా దెబ్బతీయాలని ఇరువురూ ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు ఉమ్మడి శత్రువు పుంగనూరు శాసనసభ్యుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావడం విశేషం.
మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్నారు. అప్పటినుంచి ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఎదిగారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరిపై నొకరు ఆదిపత్యం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఎనిమిదవ పర్యాయం కూడా విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఆధిష్టించడానికి పావులు కదుపుతున్నారు. అయితే కుప్పం నియోజకవర్గ నుంచి చంద్రబాబు నాయుడు గెలవకుండా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం, గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో జడ్పిటిసి, మండల పరిషత్ అధ్యక్షులు పదవులను వైసిపి గెలిసింది. మొదటిసారిగా కుప్పం కోట మీద వైసిపి జెండా ఎగురవేసింది. అలాగే మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటమిని రుచి చూపించింది. కుప్పం నియోజకవర్గ స్థానిక సంస్థలలో, మునిసిపాలిటీలో విజయం సాధించిన తాము రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడును ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదేపదే ప్రకటిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వన్నెకులక్షత్రియ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భరత్ ను ఎమ్మెల్యేగా చంద్రబాబు మీద పోటీలో దించారు. భరత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ గెలిస్తే మంత్రి పదవితో సత్కరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూతలపట్టు సమావేశంలో కూడా ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీలో చేరిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం రెడ్డిని కూడా వైసీపీలో చేర్చుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరచుగా కుప్పంలో పర్యటిస్తూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడించాలని ప్రయత్నాలు చేస్తుండగా, చంద్రబాబు నాయుడు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందాలని వ్యూహరచన చేశారు. ఇందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. చంద్రబాబు కూడా తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ, టిడిపి శ్రేణులను ఉత్తేజ పరుస్తున్నారు. యువగళం పాదయాత్ర కూడా నారా లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటిని కూడా నిర్మించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా లక్ష ఓట్ల మెజారిటీ సాధించి తిరిగి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.
జిల్లాలో నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాలకు రాజకీయ వైరం కొనసాగుతోంది. మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లారి అమర్నాథరెడ్డి కాంగ్రెస్ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక పర్యాయం పీలేరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విప్ గా, శాసనసభాపతిగా పనిచేశారు. రాశేఖర్ రెడ్డి మరణం తర్వాత అనుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైకాంద్రకు ఆయన అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన చేయాలని భావించినా, ఆయన గట్టిగా అడ్డుకున్నారు. రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తీర్మాణాన్ని ఆమోదించారు. చివరకు రాష్ట్ర విభజన జరగడంతో అందుకు నిరసనగా ముఖ్యమంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. ఆయన కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరినా, క్రియాశీలకంగా పనిచేయలేదు. ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేస్తూ, రానున్న ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎంపీగా విజయం సాధిస్తే, కేంద్ర మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే రాజంపేట నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఇప్పటికీ రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్నారు. అలాగే పార్లమెంట్ లో ప్యానల్ స్పీకర్ గా ఉన్నారు. ఇరు వర్గాలు రాజంపేట పార్లమెంటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజంపేట నుంచి మూడవ పర్యాయం గెలిచి హ్యట్రిక్ సాధించాలని మిధున్ రెడ్డి భావిస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోవడానికి బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కృషి చేస్తున్నాయి. వైసిపి తరపున ఇరువురు మాజీ ముఖ్యమంత్రిలను ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇరువురు మాజీ ముఖ్యమంత్రులు ఎలాగైనా గెలువాలనే గట్టిపట్టుదలతో పనిచేస్తున్నారు. జిల్లాలో ఎవరి పంతం నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.
మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు