2, ఏప్రిల్ 2024, మంగళవారం

ముఖ్య నేతలకు సుధీర్ రెడ్డి దూరం !

  ద్వితీయ శ్రేణి నేతల్లో ఆందోళన! 



శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి వాపును చూచి బలుపు అను కొని తనకు తనే అపకారం చేసుకొనే విధానాలు అమలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ  వ్యతిరేక గాలిలో ఎమ్మెల్యే అయి పోతామని గాలి మేడలు కట్టుకుంటున్నారంటున్నారు. నియోజకవర్గంలో ఓటు బ్యాంకు గల ముఖ్య నేతలను కూడ గట్టుకొని చిత్తూరులో టిడిపి అభ్యర్థి జగన్ మోహన్ లాగా  సత్సంబంధాలు కొన సాగించితే తప్ప  పోలింగ్ రోజు ఎన్నికల మేనేజ్ మెంట్ విజయవంతం కాదనే స్ప్రుహ సుధీర్ రెడ్డిలో గాని ఆయన కుటుంబ వ్యవహార సరళిలో గాని లేదని నియోజకవర్గంలోని పలువురు టిడిపి ద్వితీయ శ్రేణి నేతలు మధన పడుతున్నారని తెలిసింది. ఎన్నికలనగానే ఆయారాంలు గయారాంలు వుంటారు. ఇటీవల కాలంలో శ్రీ కాళహస్తి నియోజక వర్గంలో టిడిపిలో చేరికలు ఎక్కువగా వున్నా ఈ రోజు పసుపు కండువా కప్పుకొన్న వారు మరు రోజు వైసిపి కండువా కప్పుకుంటున్నారు. గమనార్హమైన అంశమేమంటే ఇంతకీ పార్టీల కండువాలు కప్పుకొనే వారి వెంబడి ఓటు బ్యాంకు లేక పోవడమే. అది టిడిపి చేసినా వైసిపి చేసినా కేవలం ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప పోలింగ్ రోజు ఓట్ల రాల్చడం పరిమితమే. పైగా టిడిపికి చెంది రెండు దిన పత్రికలు వున్నాయ్ కాబట్టి పైకి అంతా బాగానే కనిపిస్తోంది.ఈ ప్రభావం శ్రీ కాళహస్తిలోనే కాదు. రాష్ట్రంలో కూడా అపకారం కలిగించ వచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 


ఇదిలా వుండగా ఏ పార్టీ అభ్యర్థి అయినా ఎన్నికలనగానే గెలుపు గుర్రం ఎక్కాలంటే వివిధ వర్గాలను నేతలను కూడ గట్టుకొని పనిచేయ వలసి ఉంటుంది . కాని టిడిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి అంతా రివర్స్ లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఒక దఫా ఎమ్మెల్యే గా చేసి బలమైన కేడర్ తో పాటు సామాజిక వర్గం ఓటు బ్యాంకు గల యస్సీవీ నాయుడు ను పార్టీలో చేర్చుకొనేందుకు పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వాస్తవంలో సుధీర్ రెడ్డి కి అభ్యంతరం వుంటే అధినేత వద్ద తేల్చుకోకుండా తనకు తనే తన వాళ్ళు ఎవ్వరూ వెళ్ల వద్దని ఎక్కడో వుండి వాయిస్ మెసేజ్ పెట్టారు. తీరా అధినేత సూచన మేరకు తనే యస్సీవీ నాయుడు ఇంటికి వెళ్లి పార్టీలోనికి ఆహ్వానించ వలసి వచ్చింది. నియోజకవర్గంలో చాల మంది ఇది పిల్ల చేష్టగా భావించారు. తదుపరి శ్రీ కాళహస్తికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చినపుడు జరిగిన బహిరంగ సభలో తన కుటుంబ సభ్యులను తప్ప వేదిక మీదకు మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడును గాని తను తన తల్లి రాయబారం నడిపి టిడిపి లోనికి తీసుకు వచ్చిన మరొక మాజీ ఎమ్మెల్యే మునిరామయ్యను గాని ఆహ్వానించ లేదు. అప్పట్లో ఈ సంఘటనపై నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య సామాజిక వర్గానికి చెందిన వారు అగ్గిలో గుగ్గిలమైనారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన మరొక నేతకు వైసిపి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిన నేపథ్యంలో ఈ సంఘటన సంచలనమైనది. 


కాగా మాజీ ఎమ్మెల్యే యస్సీవీ నాయుడు ను కూడా వేదిక ఎక్కనీయక పోవడంతో ఆయన అనుచరులే కాకుండా ఆయన సామాజిక వర్గం మండి పడింది.ఈ సంఘటనతో సుధీర్ రెడ్డి యస్సీవీ నాయుడు మధ్య దూరం పెరిగిందంటున్నారు. ఒక వేళ తనతో టికెట్ కోసం యస్సీవీ నాయుడు పోటీ పడినా అంతిమంగా టికెట్ తనకే దక్కిన తర్వాత నైనా కూడా టిడిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి తన వైఖరి మార్చుకోలేదు. ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే బేధాభిప్రాయం వున్నా సర్దుబాటు చేసికొని గెలుపు గుర్రం ఎక్కే ఎత్తుగడలు చేపట్ట వలసి వుండగా తద్విరుద్దంగా సుధీర్ రెడ్డి తదుపరి కూడా వ్యవహరించారు. గత వారం రెండవ మారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీ కాళహస్తి లో రెండవ విడత బహిరంగ సభలో ప్రసంగించినపుడు కూడా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు యస్సీవీ నాయుడు మునిరామయ్యలకు వేదికపై నుండి మాట్లాడే అవకాశం ఇవ్వ లేదు.గెలుపుకు అనుకూలంగా ఓటు బ్యాంకు పెంచుకొనే ఏ పార్టీ అభ్యర్థి ఇలా వ్యవహరించరు. ఒక వేళ ప్రసంగించేందుకు వారు ఇష్ట పడక పోయినా బలవంతంగా వారి చేత మాట్లాడించి వారికి వున్న ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవాలి. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత అమలు చేసే పద్ధతులను సుధీర్ రెడ్డి ఇప్పుడే అవలంభిస్తున్నారు. అంతా రివర్స్ లో సాగుతోంది.. ఈ ప్రభావం మున్ముందు తీవ్రంగా వుంటుందేమో. 


తనకు టికెట్ వచ్చిన ఆనందోత్సాహంలో తన అనుయాయులు వెళ్లి జనసేన నేత ఇంటి ముందు టపాకాయలు పేల్చి అవమాన పరిచిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి ఒక మెట్టు దిగి తుదకు ఆ నేత వినుత ఇంటికి వెళ్లి అభ్యరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన సభలో ప్రసంగించే అవకాశం కల్పించారు. అదే విధంగా బిజెపి నేత కోలా ఆనంద్ కు మాట్లాడే అవకాశం కల్పించిన సుధీర్ రెడ్డి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు యస్సీవీ నాయుడు మునిరామయ్యలకు గతంలో జరిగిన సభలాగే అవకాశం ఇవ్వ లేదు. మాజీ ఎమ్మెల్యేలకు చెందిన సామాజిక వర్గమే కాకుండా అనుచరులు ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత ఏం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈ చర్య పార్టీకి అపకారం చేస్తుంది తప్ప ఉపకారం చేయదు. 


ఈ సంఘటన నేడు నియోజకవర్గంలోని మునిరామయ్య సామాజిక వర్గంతో పాటు అనుచరులల్లో చర్చనీయాంశంగా వుంది. అదేవిధంగా యస్సీవీ నాయుడు సామాజిక వర్గంలో పాటు అనుచరులు తీవ్ర మధనంతో వున్నారు. స్వతహాగా యస్సీవీ నాయుడు స్వభావం తెలిసిన వారు ఇంత జరిగినా మౌనంగా వుండటం ఆశ్చర్య పోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకే యస్సీవీ నాయుడు మౌనంగా వుంటున్నారని కొందరు టిడిపి నేతలు చెబుతున్నారు. వాస్తవంలో చంద్రబాబు నాయుడుతో యస్సీవీ నాయుడు వివరంగానే చర్చించినట్లు చెబుతున్నారు. ఇదంతా మీడియాలో రాలేదు. యస్సీవీ నాయుడు లీకులు వదలి లేదు. లేకుంటే వెనుకటి యస్సీవీ నాయుడు అయితే మరోలా వుండదేమోననే ప్రచారముంది. .శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో గెలుపు ఓటములు అంతిమంగా ఓటర్లు తేల్చనున్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి దాదాపు 39 వేల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు టిడిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి గతం కన్నా అదనంగా 30 వేల ఓట్లు తెచ్చుకొంటే గాని లోటు పూడ్చుకొని గెలుపు సాధ్యం కాదు.గతంలో ఎంతో మంచి పేరు పలుకు బడి వుండిన స్వర్గీయ గోపాల కృష్ణా రెడ్డికి 2014 ఎన్నికల్లోనే తన స్వంత మండలం శ్రీ కాళహస్తి మండలంలో మైనస్ ఓట్లు వచ్చాయి. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ. రేణిగుంట ఏర్పేడు మండలాల్లోనూ అంతే. కేవలం టవున్ తొట్ఠంబేడు మండలాల్లో వచ్చిన దాదాపు ఆరు వేల మెజారిటీతో అప్పట్లో గోపాల కృష్ణా రెడ్డి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసిపి అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం వైసిపి అభ్యర్థిపై ఎంత వ్యతిరేకత వుందో వ్యక్తిగత సాయంతో పాటు జగన్మోహన్ రెడ్డి పంచిన ఉచితాల ప్రభావం వుండనే వుంది. ఈ పూర్వ రంగంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి అందర్నీ కలుపుకొని పోయే విధానాలు అమలు చేయడం లేదని నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు.  ఆ మాట కొస్తే నియోజకవర్గ టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువ మందితో సుధీర్ రెడ్డికి మంచి సత్సంబంధాలు లేవని చాలా కాలంగా ప్రచారంలో వున్న విషయం విదితమే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *