30, ఏప్రిల్ 2024, మంగళవారం

చిత్తూరు పార్లమెంటులో తిరుగులేని తెలుగుదేశం

పది సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టిడిపి విజయం 

మూడు సార్లు ఎం పి గా హ్యాట్రిక్ కొట్టిన రామకృష్ణా రెడ్డి 

రెండు సార్లు ఎం పి ఐన సినీ నటుడు శివప్రసాద్ 

పక్కా ప్రణాళికతో విజయం వైపు దగ్గుమళ్ళ  ప్రసాదరావు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


చిత్తూరు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తిరుగులేని వరుస విజయాలను నమోదు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుంచి పదిసార్లు పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏడు పర్యాయాలు టిడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి చిత్తూరు పార్లమెంట్ పెట్టని కోటలాగా నిలుస్తోంది.


చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత చిత్తూరు పార్లమెంటుకు పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడుసార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యింది. 1989, 1991 ఎన్నికలలో మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత 2019 ఎన్నికలలో పుంగనూరుకు చెందిన రెడ్డప్ప వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. మిగిలిన ఏడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ వరుస విజయాలను సాధించింది. 1984 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చిత్తూరుకు చెందిన ఎన్ పి ఝాన్సీ లక్ష్మి విజయం సాధించారు. 1996, 1998, 1999 ఎన్నికలలో పుంగనూరు శాసనసభ్యుడిగా ఉండిన నూతనకాల్వ రామకృష్ణారెడ్డి వరుసగా మూడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. అనంతరం 2004 ఎన్నికలలో పారిశ్రామికవేత్త ఆది కేశవులు ఎంపీగా ఎన్నికగా, 2009, 2014 ఎన్నికలలో సత్యవేడు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సినీ నటుడు ఎన్ శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా రెండు సార్లు ఎన్నికయ్యారు.


తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేయడంతో చిత్తూరు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తున్నారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇరు పార్టీలకు సరి సమానంగా ఓట్లు వచ్చినా, కుప్పంలో వస్తున్న మెజార్టీ కారణంగా ప్రతి సారి టిడిపి అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. ఈ పర్యాయం వైసిపి అభ్యర్థిగా ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు రెడ్డప్ప మరోసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు పోటీలో ఉన్నారు. ఆర్థికంగా పరిపుష్టి కలిగిన, సమస్యల మీద అవగాహన ఉన్న, విద్యావేత్త దగ్గుమల్ల ప్రసాదరావును చంద్రబాబు నాయుడు ఆచితూచి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆయన చిత్తూరు కేంద్రంగా పార్లమెంటు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఎన్నికలను నిర్వహిస్తున్నారు. విస్తృతంగా ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎన్నికల ప్రణాళిక ప్రజలను ఆకట్టుకుంటుంది. ఆలోచించే విధంగా ఉంది. విద్యావేత్త కావడంతో సరైన అవగాహనతో జిల్లా అభివృద్ధికి దగ్గుమల్ల దోహదం చేయగలరని నియోజకవర్గ ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పార్లమెంట్ లో ఈ పర్యాయం కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *