పుంగనూరు నుండి ముగ్గురు 'రామచంద్రుల' పోటీ
వైసిపి నుండి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
టిడిపి నుండి చల్లా రామచంద్రా రెడ్డి
బి సి వై నుండి బోడె రామచంద్ర యాదవ్
పుంగనూరు కోటకు రాజు ఏ రామచంద్రుడో !
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
పుంగనూరు నియోజకవర్గ ఎన్నికలలో ఈ పర్యాయం ముగ్గుల రామచంద్రులు, మూడు పార్టీల నుండి పోటీచేస్తున్నారు. ఒకే పేరు కలిగిన ముగ్గురు వ్యక్తులు ఒకే నియోజకవర్గంలో నుంచి, మూడు పార్టీల తరఫున పోటీ చేయడం ఆశక్తికరంగా మారింది. ఇందులో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఒకరు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా 3 పర్యాయాలు పుంగనూరు నియోజకవర్గం నుండి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టి, మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో పీలేరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసిన ఓడిపోయిన చల్లా రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన బోడె రామచంద్ర యాదవ్ ఈ పర్యాయం సొంతంగా భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి పోటీ చేస్తున్నారు. ముగ్గురు రామచంద్రులు పుంగనూరు నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీ పడుతున్నారు
వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పీలేరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు, పుంగనూరు నుంచి మరో మూడు పర్యాయాలు గెలిచారు. 1999 నుంచి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొండుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాలలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో పుంగనూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గనులు,, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలు కూడా జగన్ రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన 1974లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో చదువుతూ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 1985,1994 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999 తరువాత వరస విజయాలతో విజయకేతనం ఎగురవేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, సర్వం తనై జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.
టిడిపి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి పీలేరు నుండి 1983, 1985 ఎన్నికలలో టిడిపి తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన కుటుంబం రొంపిచర్ల మండలానికే పరిమితమైంది. ఎంపీపీగా, జడ్పిటిసిగా పదవులను నిర్వహించారు. చల్లా బాబు టిటిడి బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. 1985 ఎన్నికలలో పీలేరు నియోజకవర్గం నుంచి చండా రామచంద్రారెడ్డి తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి చేతులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయారు. 1989లో జరిగిన ఎన్నికలలో చల్ల రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడించి, మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. రాజకీయ కుటుంబానికి చెందిన చల్లా బాబును 2019 ఎన్నికల తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అప్పటినుంచి ఆయన నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీలేరు రాక సందర్భంగా పోలీసులకు టిడిపి కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఈ కేసుకు సంబంధించి వెయ్యి మందికి పైగా పోలీసులు కేసులను నమోదు చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఉన్నారు. ఈ కేసుతో నే రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన చల్లా బాబు, అనంతరం స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం తెదేపా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
పుంగనూరు కు చెందిన బోడె రామచంద్ర యాదవ్ గత ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయనకు 16 వేల ఓట్లు వచ్చాయి. అనంతరం ఆయన జనసేన పార్టీకి దూరమయ్యారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. టిడిపి నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సొంతంగా భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆయన పార్టీ అభ్యర్థుల పోటీ చేశారు. ప్రస్తుతం ఆ పార్టీ అధినేతగా ఆయన పుంగనూరు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా అందోళనలు చేయడంతో ఒక సరి యాదవ్ మీద దాడి జరిగింది. దీంతో బాబా రాందేవ్ సహకారంతో రామచంద్ర యాదవ్ భారత హోమ్ మినిస్టర్ అమిత్ షాకు పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఎందుకు భారత ప్రభుత్వం యాదవ్ కు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చింది. ఆయన బి సి వై పార్టీ తరఫున నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు.
ఇలా మూడు పార్టీలకు చెందిన ముగ్గురు రామచంద్రులు ఈ పర్యాయం పుంగనూరు నియోజకవర్గంలో నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో నుంచి ఇప్పటికీ వరుసగా మూడుసార్లు విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగో పర్యాయం కూడా విజయం సాధించడానికి పకడ్బందిగా పావులు కలుపుతున్నారు. ఆయన రాజకీయంగా, ఆర్థికంగా తిరుగులేని నేత. మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో పీలేరు నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన చల్లా రామచంద్రారెడ్డి మరోసారి పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డితో తలపడుతున్నారు. గత ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన బోడె రామచంద్ర యాదవ్ కూడా ఈ పర్యాయం తన సొంత పార్టీ తరఫున పుంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు. ముగ్గురు రామచంద్రులు పుంగనూరు నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్నారు. వీరిలో ఏ రామచంద్రుడు పుంగనూరు కోటకు రాజ అవుతారో వేచి చుదల్చిందే.