11, ఏప్రిల్ 2024, గురువారం

వ్యవసాయానికి 2 గంటల కట్

 చెప్పింది 9 , ఇస్తున్నది 7 గంటలు

వేళా పాలా లేకుండా విద్యుత్‌ కట్‌

పల్లె పట్నం అనే తేడా లేదు..

ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి

రాత్రిపూట దోమల మోత

పంటలను కాపాడుకోలేక రైతుల అగచాట్లు

 


(ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు)

 

వ్యవసాయానికి నిరంతరాయంగా పగటిపూట గంటలు నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం చేతులెత్తేసింది. వ్యవసాయరంగానికి 7 గంటలకు కుదించారు. అది కూడా పగటి పూట నిరంతరంగా ఇవ్వడం లేదు. దీనికితోడు ఇప్పుడు ఎక్కడ చూసినా కరెంటు కోతలతో జన అల్లాడుతున్నారు. వ్యవసాయానికి కాదు కదా.. ఇంట్లో ఫ్యాను తిరిగేదానికి కూడా కరెంటు ఉండక జనం ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. అర్ధరాత్రి, మిట్టమధ్యాహ్నం సైతం కరెంటు కోతలతో అధికారులు జనాన్ని ఠారెత్తిస్తున్నారు.  విద్యుత్తు శాఖ మంత్రి సొంత జిల్లాలో కూడా  విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. ఇవన్నీ చూస్తుంటే.. కరెంటు విషయంలో ప్రభుత్వానివన్నీ ఉత్త కోతలే అని సామాన్య జనం అంటున్నారు.

 

గతంలో పల్లె, పట్నం అంతటా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేది. అలా కోతలు లేని కరెంటుకు అలవాటు పడ్డ జనాన్ని జగన్‌ సర్కార్‌ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎడా పెడా వేళాపాలా లేని కోతలు విధిస్తోంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాత్రి పగలు కోత విధించడంతో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దానికి తోడు దోమలతో కంటి మీద కునుకు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక రైతుల పరిస్థితి అయితే వర్ణణాతీం. సుర్రుమనే సూర్యుడు ఓ పక్క... చేతికాడికొచ్చిన పంటను కాపాడుకోవాలనే ప్రయత్నం మరోపక్క.. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్‌తో రైతులు పొలం వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తిరుపతి, తిరుపతి రూరల్, పుత్తూరు, చిత్తూరు, చిత్తూరు రురల్, మదనపల్లి, పీలేరు  విద్యుత్‌ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. గృహ, పరిశ్రమ, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 18,58,550 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 2,98,234 ఉన్నాయి. జిల్లాలో గత  ఏప్రిల్‌ నెల నుండి ఫిబ్రవరి నెల వరకు 5859.12  మిలియన్‌ యూనిట్లు వాడకం జరిగింది. వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరెంట్‌ ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో అన్న పరిస్థితి నెలకొంది. వేకువ జాము నుంచి పొలం వద్ద పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్‌  సరఫరాలో విడతల వారీగా గంట నుంచి మూడు గంటల పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కరెంట్‌ ఎప్పుడు వస్తుంది అని రైతులు సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే... కొన్ని చోట్ల లోడ్‌ రిలీఫ్‌ అని చెబుతుండగా, మరికొన్ని చోట్ల విజయవాడ నుంచే కట్‌ చేస్తున్నట్లు చెబుతున్నారని రైతులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల లైన్ ట్రిప్ అవుతుందని అంటున్నారు. జిల్లాలో1,77,075 హెక్టార్లలో వివివిధ రకాల పంటలు ఉన్నాయి. మామిడి పంట పిందె దశలో ఉంది. ఇప్పుడు ఎక్కువ నీటిని ఇవ్వాలి. కాయలు కోతకు వచ్చేంత వరకు  నీరు అవసరం. వీటికి ఇప్పుడు నీటి తడులు అవసరం. ఎండలు విపరీతంగా ఉండడంతో పంట చేతికి రావాలంటే నీరు అందించాల్సి ఉంది. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తామని ప్రటించారు. దానిని 7 గంటలకు కుదించారు.  ఏకధాటిగా 3 నుంచి 4 గంటలు కూడా అందని పరిస్థితి. గతంలో ఉదయం 5 నుండి 10 వరకు, మల్లి మధ్యాహ్నం 2 నుండి 6 వరకు ఇచ్చేవారు. ఇంకో షిఫ్ట్ కింద ఉదయం ఉదయం 6 నుండి 1 వరకు, మళ్ళి  మధ్యాహ్నం 2 నుండి 6 వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ఉదయం 4 నుండి 9 వరకు, మళ్ళి సాయంత్రం 4 నుండి 6 వరకు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 15 - 20 నిమిషాల లేటుగా వస్తుంది, ౩౦ నిమిషాలకు ముందుగా కట్ చేస్తున్నారు. మధ్యలో 15 -20 నిమిషాల కట్. ఇలా 9 గంటల హామీ గాలిలో కలిసి పోయి, 7 గంటలు అయ్యింది. ఇందులో కోతలు పోను నిఖరంగా అయిదారు గంటలు మాత్రమే రైతులకు కరెంట్ ఇస్తున్నారు.  కరెంట్‌ పోతే గంటకొస్తాదో, రెండు గంటలకు వస్తాదో తెలియక రైతులు నిద్రాహారలు మానుకుని పొలం వద్దే కరెంట్‌ కోసం పడిగాపులు కాస్తున్నారు. మలమల మాడ్చే ఎండలో చెమటలు కక్కుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కూడా భారీగా విద్యుత్తు కోతలు ఉండటాన్ని ప్రజలు వింతగా మాట్లాడుతున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *