16, ఏప్రిల్ 2024, మంగళవారం

చిత్తూరులో ఇరు పార్టీల హోరాహోరి పోరాటం

పట్టు సాధించాలని టిడిపి 
పట్టు నిలుపుకోవాలని వైసిపి 
ప్రచార హోరును పెంచిన పార్టీలు 
ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు అసెంబ్లీ ఎన్నికలలో పట్టును నిలుపుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, పట్టును సాధించడానికి తెలుగుదేశం పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఇరు పార్టీలు ప్రచార హోరును పెంచారు. ఉదయం నుండి రాత్రి వరకు రోజు పార్టీల నేతలు ప్రచార పర్వంలో బిజీగా ఉంటున్నారు. ఈ పర్యాయం చిత్తూరు అసెంబ్లీ ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిస్తాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు ఎండలు సైతం లెక్కసెయకుండా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇద్దరు ఉద్దండులు గెలుపు కోసం పోటి పడుతుండటంతో, చ్చిట్టురు కీలక నియోజకవర్గంగా మారింది. అందరి చూపు  రాష్ట్రస్థాయిలో చిత్తూరు మీద పడ్డాయి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది పర్యాయాలు చిత్తూరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు పర్యాయాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. నాలుగు పర్యాయాలు కాంగ్రెస్, పార్టీ ఒక పర్యాయం ఇండిపెండెంట్ మరొక పర్యాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి నుండి చిత్తూరు నియోజకవర్గ ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ పి ఝాన్సీ లక్ష్మి విజయం సాధించారు. తర్వాత 1985లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ గోపీనాథన్ గెలుపొందారు, 1989, 1994, 1999 ఎన్నికలలో వరుసగా సీకే బాబు సాధించి, హ్యాట్రిక్ కొట్టారు. ఇందులో 1989లో ఆయన ఇండిపెండెంట్ గా, విజయం సాధించినా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగాని కొనసాగారు. 2004 ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఏఎస్ మనోహర్ విజయం సాధించగా, 2009 ఎన్నికలలో తిరిగి సీకే బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా డీకే సత్య ప్రభ విజయం సాధించగా, 2019 ఎన్నికలలో జంగాలపల్లి శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.

తొలుత చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు మున్సిపాలిటీ, చిత్తూరు రూరల్ మండలం, గుడిపాల, యాదమరి తవణంపల్లి మండలాలు ఉండేవి. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత చిత్తూరు మున్సిపాలిటీ, చిత్తూరు రూరల్, గుడిపాల మండలాలు మాత్రం చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి. యాదమరి,  తవణంపల్లి మండలాలను పూతలపట్టులో చేర్చారు. రాష్ట్ర విభజన తర్వాత చిత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత లేకుండా పోయారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండిన సీకే బాబు కాంగ్రెస్ పార్టీ వీడి వైసీపీలో చేరారు. అనంతరం ఆయన బిజెపిలో చేరి కొంతకాలం తర్వాత టిడిపిలో చేరారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీకే బాబు ప్రస్తుతం టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ విజయానికి చేస్తున్నారు. అలాగే ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, మరోసారి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఎస్ మనోహర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి, టిడిపి విజయానికి ప్రచారం చేస్తున్నారు. తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికలలో మూడుసార్లు మాత్రమే టిడిపి గెలుపొందడంతో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని టిడిపి భావించింది. గుడిపాల మండలానికి చెందిన బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ నాయుడును తెరమీదకి తీసుకుని వచ్చి, తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన పాత, కొత్త నాయకులను కలుపుకొని ఈ పర్యాయం చిత్తూరుపై పట్టు సాధించాలని గట్టి పట్టుదలతో కృషి చేస్తున్నారు.

గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన జంగాలపల్లి శ్రీనివాసులకు చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ వైసిపి అధిష్టానం నిరాకరించింది. ఆయనను రాజ్యసభకు పంపుతామని చెప్పిన మాట నిలుపుకోలేదు. చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఆర్టీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న విజయానంద రెడ్డిని ప్రకటించింది. దీంతో అలక చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరి, తిరుపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో మొదటినుంచి విజయానంద రెడ్డి రాజకీయంగా పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు నుంచే వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులకు పన్ను చెల్లించకుండా మొత్తం తానే చెల్లించారు. అలాగే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ఫీజులు కూడా ఆయన చెల్లిస్తున్నారు. చిత్తూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమతులకు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 53,000 కుటుంబాలకు మహిళలకు చీర, జాకెట్లు, పురుషులకు ప్యాంట్, షర్టులను అందజేశారు. అలాగే ఇతర ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే చిత్తూరులో వైసీపీకి చెందిన కొందరు నేతలు అంటి ముట్టనట్లు ఉండడం వైసీపీకి కొంత నష్టం కలగజేయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులు దానధర్మాలలో ముందున్నారు. రంజన్ తోఫా, సంక్రాంతికి నిత్యవసర వస్తువులు, తోపుడు బండ్లను ఉచితంగా అందజేయడం, దీపావళికి టపాకాయలు పంచడం, రంజాన్, బక్రీద్ వంటి కార్యక్రమాలకు ముస్లింలు ఆర్థిక సహాయం చేయడం, క్రిస్మస్ రోజున క్రైస్తవులకు ఆదుకోవడం వంటి కార్యక్రమాలలో కూడా పోటీ పడుతున్నారు. ఇరువురు నేతలు డబ్బును మంచినీళ్లు లాగా ఖర్చు చేస్తూ, రానున్న ఎన్నికలలో విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తున్నారు. మొత్తం మీద వైసిపి పార్టీ తన పట్టును నియోజకవర్గంలో నిలుపుకుంటుందో, తెలుగుదేశం పార్టీ పట్టును సాధిస్తుందో వేసి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *