వైసిపిలో చేరిన టిడిపి నేత అనీషా రెడ్డి
మారుతున్న పుంగనూరు రాజకీయం !
స్టీల్ లేడీ అనీషా రెడ్డి అంటూ స్వాగతించిన జగన్
వైసిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానం
పుంగనూరులో విసృతంగా ప్రచారం చేయనున్న అనీషా రెడ్డి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
పుంగనూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు నూతనకాల్వ అనీషా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డిలు గురువారం వైసీపీ పార్టీలో చేరడంతో పుంగనూరు నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గత ఎన్నికలలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఓడించడానికి కృషి చేసిన అనీషా రెడ్డి ఈ ఎన్నికలలో మంత్రి పెద్దిరెడ్డి గెలుపు కోసం విసృతంగా ప్రచారం చేయనున్నారు. తొలి నుండి నూతనకాల్వ కుటుంబానికి పుంగనూరు నియ్యోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అది గమనించిన చంద్రబాబు గత ఎన్నికల్లో పుంగనూరు టిడిపి అభ్యర్థిగా అనీషారెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. ఎన్నికల తరువాత అనీషా రెడ్డి పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండటంతో వైసిపి నాయకులు ఆమె మీద దృష్టిని సారించారు. గత రెండున్నర సంవత్సరాల నుండి చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. అనీషా రెడ్డి వైసిపిలో చేరడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ మరింత బలోపేతం అయ్యిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని భావిస్తున్నారు.
నామినేషన్ వేయడానికి పులివెందులకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని అయన నివాసంలో కలిశారు. అనీషా రెడ్డిని చూడగానే స్టీల్ లేడీ అనీషా రెడ్డి కంమింగ్ అంటూ సంతోషంగా ఆహ్వానించారు. అనీషా రెడ్డి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందచేశారు. ముఖ్యమంత్రి వైసిపి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోకి రావడం కొంత ఆలస్యం అయ్యిందన్నారు. అయిన వైసిపిలో మంచి రాజకీయ భవిషత్తు ఉందని ఆకాంక్షించారు. ఎటువంటి సందేహం వద్దనీ, ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో వైసిపి అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా కోరారు. వారిని రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి దగ్గరుండి తీసుకెళ్లి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి నూతనకాల్వ అమర్నాథ్ రెడ్డికి మరదలైన అనీషారెడ్డి, సోదరుడు శ్రీనాథ్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీ వదిలి వైసీపీలో చేరడం జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజులుగా ఈ విషయమై చర్చ జరుగుతున్న, వారు గురువారం లాంఛనంగా వైసీపీలో చేరారు. అనీషా రెడ్డి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుంగనూరు నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేశారు. ఆమె మంత్రి రామచంద్ర రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఆమె పోరాటపటిమను అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆగ్రస్థాయి నేతలందరూ అభినందించారు. అయితే ఊహించిన విధంగా కొంతకాలానికి ఆమెను నియోజకవర్గ ఇన్చార్జిగా తప్పించి, పులిచెర్ల మండలానికి చెందిన చల్లా రామచంద్రారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె టిడిపి అధినేత చంద్రబాబుతో మాట్లాడుతూ తనను నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నుంచి ఎందుకు తప్పిస్తున్నాతో చెప్పాల్సిందిగా కోరారు. తా ను ఏదైనా తప్పు గానీ, పొరపాటుగానీ చేశానా అని ప్రశ్నించారు. అయితే అలాంటిది ఏమీ లేదని, చాలా చక్కగా పనిచేశా వని అభినందిస్తూ, కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా మార్పు చేయాల్సి వచ్చిందని చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఆనాటి నుండి ఆమె చిత్తూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టిడిపి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన అనీశా రెడ్డి ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశించారు. ఆమె పార్టీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని కూడా కలిశారు. వారి పర్యటనలో పాల్గొన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును అదిష్టానం పరిశీలించలేదు. పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డిని ప్రకటించినప్పుడు కానీ, బి ఫారం అందజేసినప్పుడు గానీ సూచనప్రాయంగా కూడా అనీషా రెడ్డికి తెలియజేయలేదు. నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన నాటి నుంచి చల్లా రామచంద్రారెడ్డి కూడా అనీషా రెడ్డిని కలిసి తన సహకారాన్ని అర్థించలేదు. దీంతో అసంతృప్తికి గురైన అనీషా రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిలు మదనపల్లిలోని ఆమె ఇంటికి విచ్చేసి ఆమెతో సుమారు గంట పాటుగా చర్చలు జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం వచ్చానని, జగన్మోహన్ రెడ్డి మాటగా చెబుతున్నం అంటూ వివరించారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అంటూ హామీ ఇచ్చారు. గౌరవ మర్యాదలకు తక్కువ కాకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో అనీ శా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డిలు టిడిపి పార్టీని వదిలి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం పులివెందులలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో లాంచనంగా వైసీపీలో చేరిన అనీషా రెడ్డి మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విజయం కోసం విసృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. తాను వైసిపిలో చేరడంతో నియోజకవర్గంలోని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపిలో చేరనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలలో అత్యంత భారీ మెజారిటితో పున్గానురులో పెద్దిరెడ్డి విజయం సాధిస్తారని అనీషా రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

