13, ఏప్రిల్ 2024, శనివారం

కుటుంబ వారసుల ఖిల్లా - ఉమ్మడి చిత్తూరు జిల్లా

ఒకే కుటుంబం నుండి ఇద్దరు, ముగ్గురు పోటీ
తండ్రీ, తనయులు - అన్నా, తమ్ముళ్ళు పోటీ
అన్న బిజేపి తరఫున, తమ్ముడి టిడిపి తరపున 
వారసులతో కలిసి చేస్తున్న పోటిపై ఆశక్తికర చర్చ 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

రానున్న ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఓకే కుటుంబం నుంచి పోటీ చేసి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొన్ని కుటుంబాల్లో అన్నా, తమ్ముళ్లు మరికొన్ని కుటుంబాల్లో తండ్రి, తనయులు  ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం నుండి మాత్రం అన్నా, తమ్ముడు, తనయుడు పోటి చేస్తున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా చిత్తూరు జిల్లాలోని వారసులతో కలిసి ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. ఈ  వారసుల పోటీ చిత్తూరు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ఓకే కుటుంబం నుంచి ముగ్గురు కూడా చిత్తూరు జిల్లాలో పోటీ చేస్తున్నారు. అన్న బిజెపి అభ్యర్థిగా పోటి చేస్తుండగా, తమ్ముడు టిడిపి అభ్యర్థిగా పోటి చేస్తున్నారు.  పోటీ చేస్తున్న కుటుంబ సభ్యులలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్న విషయం మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి.


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం కుప్పం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతుండగా, ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక పర్యాయం చంద్రగిరి నుంచి, 8 పర్యాయాలు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పర్యాయం విజయం సాధించి మరో సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్  శాసనమండలి నభ్యుడిగా  చంద్రబాబు ప్రభుత్వంలో ఐ.టి. శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేష్ మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తండ్రి, తనయులపోటీ రాష్ట్రంలోనే ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పర్యాయం రాజంపేట పార్లమెంటు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం నుండి తెదేపా అభ్యర్థిగా పోటి చేస్తున్నారు.  కిరణ్ కుమార్ రెడ్డి గతంలో వాయల్పాడు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి కూడా మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు పర్యాయాలు పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ప్రభుత్వ విప్ గా, శాసనసభాపతిగా, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ తరఫున పీలేరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ తరఫున కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుండి  2014లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2019 ఎన్నికలలో కూడా ఓటమిని చవిచూశారు. ముచ్చటగా మూడవ పర్యాయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా  పీలేరు నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్న బిజెపి పార్టీ నుండి పోటీ చేస్తుండగా. తమ్ముడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం చర్చనియంశంగా మారింది.

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుండి ముగ్గురు ఈ పర్యాయం కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో 3 పర్యాయాలు పీలేరు నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల విభజన అనంతరం మరో మూడు సార్లు పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. మళ్లీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన పుంగనూరు నుండి నాలుగో పర్యాయం గెలవడానికి పగడ్బందీగా పావులు కదుపుతున్నారు. ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గత ఎన్నికలలో రాజంపేట పార్లమెంటు నుండి వైసిపి తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రి మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మిథున్ రెడ్డి పార్లమెంటులో ప్యానల్ స్పీకర్ గా కూడా పనిచేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  తమ్ముడు ద్వారకనాథరెడ్డి ఈ పర్యాయం తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి వైసిపి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో కూడా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనన్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ,ఒకరు ఎంపీగా పోటీ చేయడం విశేషం.

చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పర్యాయం ఒంగోలు నుండి వైసిపి తరపున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి తొలుత చంద్రగిరి జడ్పిటిసి సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, రెండు పర్యాయాలు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తుడా చైర్మన్ గా, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా పని చేస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇస్టుడుగా కొనసాగుతున్నారు. వైసీపీ అనుబంధ విభాగాలను,  సర్వేల టీంలను చెవిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ పర్యాయం చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అయన ప్రస్తుతం తుడా చైర్మన్ గా పనిచేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ వారసుడుగా ఆయన చంద్రగిరిలో  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


అలాగే తిరుపతి శాసనసభ్యుడు టిటిడి పాలక మండల చైర్మన్ కుమారుడు, తిరుపతి కార్పోరేషన్ వైస్ చైర్మన్ భూమన అభినయ తిరుపతి అసెంబ్లీకి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి రాజకీయ వారసుడుగా అయినా మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి తండ్రి వారసురాలుగా ఈ పర్యాయం వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. జిల్లాలో వారసులుగా చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డి, తిరుపతి నుంచి అభినయ రెడ్డి, గంగాధర నెల్లూరు నుంచి కృపాలక్ష్మిలు మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు. జిల్లాలో మిగిలిన అభ్యర్థులందరూ గతంలో పలుమార్లు పోటీ చేసి విజయం సాధించిన వాళ్లే. కుటుంబ నేపథ్యంలో పోటీ చేస్తున్న తండ్రి, తనయులు,  అన్నదమ్ములల్లో రానున్న ఎన్నికలలో ఎంతమంది విజయం సాధిస్తారు వేసి చూడాల్సిందే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *