జి డి నెల్లూరులో బావా మరదళ్ళ సవాల్ !
వైసిపి అభ్యర్థిగా కృపాలక్ష్మీ
కాంగ్రెస్ అభ్యర్థిగా రమేష్ కుమార్
కృపాలక్ష్మిని ఓడించడానికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రమేష్
మేనమామ మీద పగతో మరదలు మీద పోటీ
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
రాజకీయాలలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటూఉంటాయి. అదే కోవలో గంగాధర నెల్లూరు నియోజక వర్గం (ఎస్సీ) వర్గంలో సొంత బావా మరదళ్ళు రెండు వేర్వేరు పార్టీల నుండి పోటీ చేస్తున్నారు. ఒకరిని ఒకరు ఓడించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మేనమామ కూతురు మీద సొంత సోదరి కుమారుడు సై అంటే సై అంటున్నారు. తొలుత సొంత మేనమామ మీదనే మేనల్లుడు పోటీ చేయాలనీ భావించారు. అయితే వైసిపి అధిష్టానం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి కాకుండా, అయన కుమార్తె కృపాలక్ష్మికి టిక్కెట్టు ఇచ్చింది. అయితే ఎం నేను మాత్రం పోటి చేసేది ఖాయమని రమేష్ తొలినుండి చెపుతున్నారు. మేనమామ మీద పెంచుకున్న వ్యతిరేకత కారణంగా అయన కుమార్తె మీద కూడా పోటీ చేస్తున్నారు. ఎన్నికలలో మేనమామను ఓడించాలని కంకణం కట్టుకున్న మేనల్లుడు, ఇప్పుడు మేనమామ కుమార్తె మీద పోటీపడుతున్నారు. మేనమామ కుమార్తెను ఓడించి, అయన మీద పగ సాధించడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
ఉప ముఖ్య మంత్రి కళత్తూరు నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి అభ్యర్ధిగా డాక్టర్ వి ఎం థామస్ రంగంలో ఉన్నారు. అయితే అనూహ్యంగా నారాయణ స్వామి మేనల్లుడు, పాదిరికుప్పం గ్రామానికి చెందిన దెయ్యాల రమేష్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా రంగప్రవేశం చేశారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఆయన పేరు ప్రకటించారు. రమేష్ బాబు ఎంఎస్సీ చదివారు. కొంత కాలం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి పి. ఏ. గా కూడా పనిచేశారు. రమేష్ మేనల్లుడు కావడంతో అన్ని వ్యవహాలను కొంత కాలం రమేష్ కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఇరువురికి మధ్య దూరం పెరిగింది. నారాయణస్వామి రమేష్ ను దూరం పెట్టారు. దీంతో కక్ష్య పెంచుకున్న రమేష్ వరుసగా నారాయనస్వమిని విమర్శించడం ప్రారంభించారు. స్వామి తోబుట్టువు కుటుంబానికి కూడా సహాయం చేయలేదని, తనకు అవకాశం వస్తే ఓడిస్తానని అంటున్నారు. నారాయణ స్వామి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ గా పనిచేస్తూ, మేనమామ కూతురుపైన పోటీకి సిద్దం అయ్యారు. తొలుత టిడిపి టికెట్టు కోసం కూడా ప్రయత్నం చేశారు. టిడిపి టికెట్టు థామస్ కు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్టు సాధించారు. రమేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా గణనీయంగా ఓట్లు చీల్చగలిగితే టిడిపికి లాభం చేకూరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా తాను గెలువక పోయినా, తెదేపాను గెలిపించడం ద్వారా పగ సాధించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా నియోజక వర్గంలో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమే అని కొందరు భావిస్తున్నారు. నియోజక వర్గం కొత్త ఏర్పడిన తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ టిడిపి అభ్యర్థి ఆర్ గాంధీపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి నారాయణ స్వామి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో నారాయణ స్వామి టిడిపి అభ్యర్ధి డాక్టర్ ఆనగంటి హరికృష్ణ మీద విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కు నామమాత్రపు ఓట్లు కూడా రాకపోవడం విశేషం. అయితే నారాయణ స్వామి కుటుంబం పట్ల ఉన్న వ్యతిరేకత తన గెలుపుకు దోహదపడుతుందని రమేష్ బాబు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బావా మరదలు పోటీ పడటం ఆసక్తి కలిగిస్తోంది. రమేష్ గెలువడం అటుంచి, వైసిపి ఓట్లు చీల్చితే తెలుగుదేశం లాభపడే అవకాశం ఉంది. తద్వారా నారాయణస్వామి కుటుంబం మీద పగ తిర్చుకొనే అవకాశం ఉంది. బావా, మరదళ్ళ పోటిలో ఎవరిదీ పైచేయి అవుతుందోనని ప్రజలు ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బావా, మరదళ్ళ పోటి కారణంగా తమకు కలిసి వస్తుందని టిడిపి నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఏది ఏమైనా గెలుపు తమదే అని, రమేష్ ప్రభావం ఎం ఉండదని నారాయణస్వామి వర్గీయులు ధీమాగా ఉన్నారు. రమేష్ పోటీని పరిగణలోకి తీసుకోవల్చిన అవసరం లేదంటున్నారు. వైసిపి ఇప్పటికే రెండు పర్యాయాలు ఇక్కడ విజయం నమోదు చేసింది. ఈ సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతామని అంటున్నారు.