22, ఏప్రిల్ 2024, సోమవారం

మాటలే తూటాలుగా ఎన్నికల రణక్షేత్రంలో అగ్రనేతలు

వేడెక్కుతున్న ఉమ్మడి  చిత్తూరు జిల్లా రాజకీయం 

రాజకీయ ఆధిపత్యమే లక్ష్యం 

ఒకరి మీద మరొకరు పైచేయి సాధించాలన్న పట్టుదల 

సిఎం పదవి కోసం కిరణ్ సోనియా కాళ్ళు పట్టుకున్నారని పెద్దిరెడ్డి విమర్శ 

డిసిసి అధ్యక్షుడి పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్ళు పట్టుకున్నారన్న కిరణ్ 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

ఒకరు మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మరొకరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇరువురిదీ రాజకీయ కుటుంబాలే. మొదటి నుండి ఒక కుటుంబానికి, మరో కుటుంబానికి పడదు. రాజకీయంగా పై చేయి సాధించడమే ఇరువురి లక్ష్యం. ఈ  కుటుంబాల మధ్య రాజకీయ రణక్షేత్రం ప్రారంభం అయ్యింది. ఒకరిపై ఒకరు ఘాటైన ఆరోపణలు, విమర్శలు చూస్తున్నారు. తొలుత కిరణ్ కుమార్ రెడ్డి సూట్కేసు పట్టుకొని వచ్చారని, ఎన్నికల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళి సూట్కేసు పట్టుకొని వెళ్లిపోతారని పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలలో తాను తప్పక గెలుస్తానని పెద్దిరెడ్డి ఓడిపోయి పుంగనూరుకు  పోతారని కిరణ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవీ కోసం కిరణ్ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. డి సి సి అధ్యక్ష పదవీ కోసం రామచంద్రా రెడ్డి తన కాళ్ళు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరి అగ్రనేతల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది.చిరకాల రాజకీయ ప్రత్యర్థులు అయిన కిరణ్, రామచంద్రా రెడ్డిల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. స్వతహాగా కిరణ్, రామచంద్రా రెడ్డిలు విమర్శలు, ఆరోపణలకు దూరంగా ఉంటారు. అటువంటి నాయకులు ఎన్నికల రణక్షేత్రంలో మాటలే తూటాలుగా ఒకరి మీద మరొకరు విరచుకపడుతున్నారు. ఇరువురి నాయకుల ఆరోపణలు, విమర్షలు రాజకీయ వర్గాలలో ఆశక్తిని రేపుతున్నాయి.


పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు, ఆయన తమ్ముడు ద్వారకనాద రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేలుగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభకు వైసిపి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్ సభ బిజెపి అభ్యర్థిగా, ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య కాంగ్రెస్ కాలం నుంచి రాజకీయ వైరం ఉంది. 2009 కి పూర్వం కిరణ్ కుమార్ రెడ్డి మూడు సార్లు వాల్మీకి పురం  ఎమ్మెల్యేగా, రామచంద్రా రెడ్డి మూడు సార్లు పీలేరు ఎమ్మేల్యేగా గెలిచారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టు వ్యవహరించే వారు. నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత 2009 లో నల్లారి పీలేరు నుంచి పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో పెద్దిరెడ్డికి మంత్రి పదవి లభించగా కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రోశయ్య ఏడాది కాలం ముఖ్య మంత్రిగా అన్నారు. ఆయన  రాజీనామా చేయడంతో 2010 చివర్లో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించింది. 2014 లో రాష్ట్రం అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి 2014లో జేఎస్పీ అభ్యర్థిగా, 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టిడిపి అభ్యర్థిగా వైసిపి అభ్యర్థి చింతలరామచంద్రా రెడ్డితో తల పడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు లో హ్యాట్రిక్ సాధించి నాలుగవ సారి పోటీ చేస్తున్నారు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా చల్లా రామచంద్రా రెడ్డి పోటీలో అన్నారు. తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకనాద రెడ్డి రెండవ సారి వైసిపి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆయనపై టిడిపి అభ్యర్థి డి జయచంద్రా రెడ్డి పోటీలో అన్నారు. అయితే ఇక్కడ టిడిపి అభ్యర్థిని మార్చి ఈ స్థానం బిజెపికి కేటాయిస్తారని అంటున్నారు. కాగా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి మూడవ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషి చేస్తున్నారు. అయితే అనూహ్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి తికెట్టుపై ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఎలాగైనా గెలిచి కేంద్ర మంత్రి కావాలని కిరణ్ వ్యూహాలు రచిస్తున్నారు. దీనితో పెద్దిరెడ్డి, నల్లారి మధ్య ప్రత్యక్ష పోరు ప్రారంభం అయ్యింది. ఒకరిపై ఒకరు ఒంటి కాలిపై లేచి విమర్శలు సంధించు కుంటున్నారు

ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.  కిరణ్ కుమార్ రెడ్డి పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఉద్దేశించి చేసిన కొన్ని  వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారంగా మారాయి. కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. డిసిసి అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని  కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో ఎక్కడ ప్రమాణం చేయడానికి అయినా సిద్దం అన్నారు. తాను కాళ్లు పట్టుకున్నానని కిరణ్ అబద్ధాలు చెప్పారని మండిపడిన పెద్దిరెడ్డి తాను  కాంగ్రెస్‌లో సోనియాగాంధీ కాళ్లకే మొక్కలేదని అన్నారు. చిదంబరం కాళ్లు పట్టుకొని కిరణ్‌ సీఎం అయ్యారు అంటూ మళ్ళీ వివాదానికి ఆజ్యం పోశారు. దీనితో రాజకీయాలు వేడెక్కాయి. వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా, రానున్న ఎన్నికలలో  ఎవరి మీద ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఎవరిపై పట్టు సాధిస్తారు అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *