3, ఏప్రిల్ 2024, బుధవారం

పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారు


చంద్రబాబు పేరు చెప్పితే ఒక పథకం అయినా గుర్తుకు వస్తుందా 

మీ బ్యాంకు అకౌంట్ లో రూపాయి అయినా చంద్రబాబు వేశారా

2014 లో ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ వస్తున్న బాబు బృందం

మీ కుటుంబానికి మేలు చేసిన వారికి అండగా నిలువండి.

చంద్రబాబు ఇంటికి కిలో బంగారు, బెంజి కారు ఇస్తానని చెపుతున్నారు.

చబద్రబాబు మాట నమ్మి ఓటు వేస్తే పాపం చేసినట్లే

పూతలపట్టు మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు

అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకుంటున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పూతలపట్టు సమీపంలో బుధవారం సాయంకాలం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ జగన్ ప్రభుత్వం వస్తేనే ఇంటింటికి వాలంటీర్లు వచ్చి పింఛన్లు పంపిణీ
చేస్తారని తెలిపారు. చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ప్రసాద్ చేత ఎన్నికల సంఘానికి లేఖ రాయించి, వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయడానికి  ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టడంతో ఈనాడు అవ్వ తాతలు పెన్షన్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పర్యాయాలు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్పితే గుర్తుకు వచ్చే పథకం ఒకటి అన్నా ఉందా అని అడిగారు. 2014 ఎన్నికలలో దత్త పుత్రుడు, మోడీతో కలిసి వచ్చి పలు హామీలను ఇచ్చారని, అందులో ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. ఏ ఒక్క కుటుంబానికి కూడా రూపాయి  లబ్ధి చేకూర్చలేదన్నారు. మళ్లీ దత్తపుత్రుడు, మోడీతో కలిపి చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలోకి దిగారని, వారిని నమ్మవద్దని సూచించారు. గతంలో హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఎన్నికల బరిలోకి వస్తున్న చంద్రబాబుకు ఓటు వేయడం పాపంగా వర్ణించారు. రానున్న ఎన్నికలలో ఓటర్లకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. విశ్వసనీయత  - మోసం, నిజం - అబద్ధం, ఇంటింటా ప్రగతి - తిరోగమనం, మంచి - చెడు, వెలుగు - చీకటి, ధర్మం - అధర్మం చెరో వైపున ఉన్నాయని వివరించారు. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. మంచికి చెడుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజల పక్షాన ఒంటరిగా యుద్ధం చేస్తున్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ లు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన పార్టీలతో కలిసి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని వివరించారు. ఆ పార్టీలు కుట్రలు, కుతంత్రాలతో ఈ మహాసంగ్రామంలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల మహాసంగ్రామంలో ప్రభుత్వానికి తమ మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు. పేదలు, పిల్లలు, అక్క చెల్లెలు, మైనారిటీలు, అవ్వ తాతలు అందరూ తనకు మద్దతుగా నిలబడాల్సిందిగా కోరారు. ధర్మాన్ని గెలిపించడానికి, విలువలు, విశ్వసనీయతతో కూడిన తనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు. పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న ఈ పోరాటంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలను, 25 కు 25 ఎంపీ స్థానాలను గెలిపించి డబుల్ సెంచరీ కొట్టడానికి సాయం చేయాల్సిందిగా కోరారు. రానున్న ఎన్నికలలో ఓటు విలువ తెలుసుకొని ఓటు వేయాలన్నారు. దాని ప్రభావం ఐదు సంవత్సరాలు, 1825 రోజులు మీ మీద ఉంటుందని, మీ తల రాత దాని మీదనే ఆధారపడి ఉందన్నారు. మంచి చెడులను ఆలోచించుకొని, మీ ఇంటి అభివృద్ధి, పిల్లల సంక్షేమం ఎవరి వల్ల జరిగిందో ఇంట్లో అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని ఓట్లు వేయాలని కోరారు. ఇంటి పక్కన వాళ్లతో కూడా సంప్రదించాలని సూచించారు. గత పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశారని, మరో ఐదు సంవత్సరాలు తమ పాలన చూశారన్నారు. ఏనాడైనా చంద్రబాబు పాలనలో రూపాయి అయినా మీ అకౌంట్లో జమ అయిందా అని ప్రశ్నించారు. ఈనాడు నేరుగా వివక్షతకు తావు లేకుండా, అవినీతి లేకుండా మీ అకౌంట్లో జమ అవుతున్న డబ్బులను గురించి కూడా ఆలోచించాలని సూచించారు. మీ సాధికారతకు, అభివృద్ధికి ఎవరు సాయపడుతున్నారో ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ పాలనలో గ్రామ గ్రామాన సచివాలయాలు,  రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, నాడు నేడు కింద పాఠశాలల రూప రేఖలు మార్చి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామన్నారు. 1వ తేదీనే ఆదివారమైన సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్లు తలుపు తట్టి చిరునవ్వుతో పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కా చెల్లెమ్మల రక్షణకు దిశ యాప్ ను రూపొందించామని, సచివాలయంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్య సురక్ష పథకం కింద చికిత్సలు చేసి, మందులు కూడా అందజేస్తున్నామని, 5 లక్షల  రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచమని చెప్పారు. మహిళల పేరుతో ఇళ్ల పట్టాలని అందజేసి, జగనన్న  కాలనీల నిర్మాణం జరుగుతోందని వివరించారు. 130 సార్లు బటన్ నొక్కి 270  వేల కోట్ల రూపాయలను నేరుగా అకౌంట్లో జమ చేశామని గుర్తు చేశారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అమలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. వైయస్సార్ పింఛన్ బోరోసా,  రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, అమ్మవడి, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, డ్వాక్రా రుణమాఫీ,  సున్నా వడ్డీ పథకం, రజకులు, చేనేత, నాయి బ్రాహ్మణులకు చేయూత, పట్టాల పంపిణీ విషయాలను గుర్తు చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. రైతు, డ్వాక్రా రుణాలను కూడా మాపీ చేయని చంద్రబాబు ఇప్పుడు ఇంటికి కిలో బంగారు,  బెంజ్ కారు ఇస్తామని సూపర్ సిక్స్ అంటూ మీ ముందుకు వస్తున్నారని, చంద్రబాబుకు ఓట్లు వేయడం పాపంగా వర్ణించారు. చంద్రబాబు పేరు చెప్పితే ఏమైనా పథకాలు, మేళ్లు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. 

ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి,  గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్షి, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటే గౌడలను సభకు పరిచయం చేశారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అందరినీ గెలిపించాలని కోరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను కుప్పంలో గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *