వైసిపిలో చేరిన పూతలపట్టు టిడిపి మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి
పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, దళిత నేత లలిత కుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఆమె తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతోపాటు ఆమె భర్త థామస్, మరి కొంతమంది నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
లలిత కుమారి 1995 స్థానిక సంస్థల ఎన్నికలలో నలగాంపల్లి ఎంపీటీసీగా గెలుపొంది, బంగారుపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2001 ఎన్నికలలో బంగారుపాలెం జడ్పిటిసి మెంబర్ గా పోటీ చేసి, 27 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2002 నుంచి రెండు సంవత్సరాలు పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్మన్ గా పనిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికలలో పలమనేరు నుంచి శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పలమనేరు నియోజకవర్గం జనరల్ కేటగిరీకి వెళ్లగా, కొత్తగా ఏర్పడిన పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ అయింది. ఆమె పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోకి రావడంతో 2009, 2014, 2019 ఎన్నికలలో వరుసగా మూడుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలలో ఆమెకు టికెట్ ఇవ్వడంలో హై డ్రామా చోటు చేసుకుంది. తొలుత టికెట్టును వైసీపీకి చెందిన తవణంపల్లి నాయకుడు పూర్ణకు కేటాయించారు. దీంతో పెద్ద ఎత్తున లలిత కుమారి, నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఒక దశలో లలిత కుమారి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే సృజనా చౌదరి కలగజేసుకుని, ఆమె తెదేపా నుండి పోటీ చేయడానికి నచ్చ చెప్పారు. ఆ ఎన్నికల్లో కూడా ఆమె స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. మూడు పర్యాయాలు పూతలపట్టు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనకు తెలుగుదేశం పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని లలిత కుమారి భావించారు. నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని సహించలేకపోయారు. వారిని కట్టడి చేయడంలో అధిష్టానం చర్యలు తీసుకోకపోవడంతో గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. ఆమెను పిలిచి అధిష్టానం మాట్లాడ లేదు. పూతలపట్టు నియోజకవర్గానికి సుమారు నాలుగు సంవత్సరాల పాటు నియోజకవర్గ ఇన్చార్జి కూడా లేకుండా పార్టీ కార్యక్రమాలు జరిగాయి. నాలుగు సంవత్సరాల తర్వాత పాత్రికేయుడుగా పని చేస్తున్న మురళీమోహన్ ను ఇన్చార్జిగా నియమించారు. ఆయనకే టిడిపి టికెట్ ఇచ్చి, ఎన్నికల బరిలోకి దించింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనుసరించిన వైఖరికి నిరసనగా ఆమె 35 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అనుబంధాన్ని తేమ్చుకున్నారు. జిల్లా మంత్రి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డిలు ఆమెను సాధారంగా ఆమెను వైసిపిలోకి ఆహ్వానించారు. ఆమెకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బుధవారం లలిత కుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా లలిత కుమారి 'ఆంధ్రప్రభ ప్రతినిధి'తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తాను అనేక అవమానాల పాలయ్యానని, కష్టాలు పడ్డానని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నా, తనను ప్రతిపక్షంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని నాలుగు పర్యాయాలు ఎన్నికలలో పోటీ చేసినా, పార్టీ తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిలు తనకు సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని, వారి హామీ మేరకు వైసీపీలో చేరినట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ విజయం కోసం తన వంతు కృషి చేస్తామన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీని పటిష్టత పటిష్టం చేయడంతో పాటు పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమాను లలిత కుమారి వ్యక్తం చేశారు.