కుప్పంలో చంద్రబాబు ఓటమి తధ్యం
జిల్లాలో 14 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం
కుప్పం అభివృద్ధి వైసిపి హయంలోనే జరిగింది
రెవెన్యూ డివిజన్ చేశాం, మునిసిపాలిటీగా అప్ గ్రేడ్ చేశాం
10 వేల ఇళ్ళుమంజూరు చేశాం
ఈ సరి 150 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం
మళ్ళి జగనే ముఖ్యమంత్రి
ప్రభన్యూస్ బ్యురోతో చిత్తూరు ఎంపి రెడ్డెప్ప
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు
రానున్న ఎన్నికల్లో కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు, చిత్తూరు వైసిపి పార్లమెంట్ అభ్యర్థి ఎన్ రెడ్డప్ప జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలను, మూడు పార్లమెంటు స్థానాలను వైసిపి గెలుస్తుందన్నారు. ఈ ఎన్నికలలో 150 కి పైగా శాసనసభ స్థానాలను గెలిసి తిరిగి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడుతుందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపిలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, పేదలకు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు తమను తిరిగి గెలిపిస్తాయని వివరించారు. చిత్తూరులో సోమవారం పూతలపట్టు నియోజకవర్గ నాయకుడు తలపలపల్లి బాబు రెడ్డితో కలిసి 'ఆంధ్రప్రభ న్యూస్ బ్యూరో'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రెడ్డప్ప మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మంత్రి పెద్దిరెడ్డి 66 కోట్ల నిధులను ముఖ్యమంత్రికి చెప్పి, మంజూరు చేశారన్నారు. అలాగే కుప్పంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, కుప్పంను మున్సిపాలిటీగా చేశామన్నారు. పేద ప్రజలకు 10 వేల ఇళ్ళను మంజూరు చేశామని తేలిపారు. 14 ఏళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో ఒక ప్రభుత్వ కళాశాలలనుకూడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి, వాటినే అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని తెలిపారు. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన తాగనీటి పథకాన్ని 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే దానిని నిర్వహించలేక ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. కుప్పంకు విమానాశ్రయం వస్తుందని ఊరించారని, హంద్రీనీవా ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేయలేదన్నారు. తాము పూర్తి చేసి కుప్పంకు సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. అలాగే పాలారు ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆపేసారన్నారు. కుప్పం గంగమ్మ తల్లి గుడి అభివృద్ధికి రూ. 2.5 కోట్లను మంజూరు చేసామని, అలాగే మల్లప్ప కొండ, యామనూరు గుడిల అభివృద్ధి పనులు మంజూరు చేసామనీ వివరించారు. కుప్పంలో రోడ్లు వేశారని అంటున్నారని, కమీషన్ల కోసమే రోడ్లు వేశారన్నారు. కుప్పం నియోజకవర్గ ఇంచార్జిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించిన నాడే కుప్పంలో చంద్రబాబు పతనం ప్రారంభం అయ్యిందన్నారు. అందుకే చంద్రబాబు కుప్పంలో ఇప్పుడు ఇంటిని నిర్మాణం చేస్తున్నారని, అప్పుడప్పుడు వచ్చి నియోజకవర్గ ప్రజలను పలకరిస్తున్నారని ఎద్దేవా వేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల కుప్పం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వైసీపీకేమద్దతు పలుకుతున్నారని, అందుకే మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కాదని వైసిపికి పట్టం కట్టారని వివరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంతో తరచుగా పర్యటిస్తుండటంతో, ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి మంత్రి పెద్దిరెడ్డి పైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అభివృద్ధి ఫలాలు వలంటీర్ల ద్వారా ఇంటింటికి అందుతున్నాయని, రానున్న ఎన్నికలలో మళ్లీ వైసీపీ గెలవడం తద్యమన్నారు. ఎక్కడ గాని ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలుగుదేశం, జనసేనలు సృష్టిస్తున్నారని, ఆ వ్యతిరేకతలోనే వారు కొట్టుకుపోతారని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికలలో కుప్పం నియోజకవర్గ నుంచి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారని, ఇందుకు మానసికంగా సంసిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న సిద్ధం సభలకు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి మద్దతు ప్రకటిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రజలు జగన్ కు అండగా నిలబడుతున్నారని, రానున్న ఎన్నికల్లో 150 సీట్లు వస్తాయని ధీమాని వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్దిని ముఖ్యమంత్రి కాకుండా, ఏ శక్తి ఆపడం కుదరదన్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటమితో అయన రాజకీయ జీవితం ముగుస్తుందని రెడ్డెప్ప అభిప్రాయపడ్డారు.