నగరి వైసీపీ అభ్యర్థిగా చిన్ని పేరు పరిశీలన
నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు క్లిష్ట పరిస్థితులు అధికమౌతున్నా యి. ఇక్కడ నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు వైఎస్ఆర్ పార్టీలో కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈనేపథ్యంలో ఆ పార్టీలో కొత్త అభ్యర్థి ఆలోచన తలెత్తింది. నగరి మాజీ మండలాధ్యక్షుడు ఎ.ఎం. మనోహర్ (చిన్ని) పేరు పరిశీలనలో వున్నట్టు తెలిసింది.
తొలినుంచి సొంత పార్టీలోనే రోజా అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత విషయం తెలిసిందే. ఈ విషయమై పలుమార్లు సాక్షాత్త్తు ముఖ్యమంత్రి చెప్పినా ఫలితం లేకుంది. శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు భాస్కర రెడ్డి, మాజీ మునిసిపల్ ఛైర్మన్ కెజె.కుమార్, రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ కెజె.శాంతికుమారి, మురళి రెడ్డి తదితరులు అసమ్మతి గళం వినిపిస్తున్న సంగతి విధితమే. నగరిలో మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన రోజా భర్త ఆర్.కె.సెల్వమణి పరిస్థితులను అధిగమించేందుకు తన వంతు ప్రయత్నాలు చూస్తున్నారు. ఇదిలావుండగా నగరిలో మంచి పట్టున్న బలిజ సామాజిక వర్గానికి చెందిన మనోహర్ పేరు తెరమీదకు తీసుకొచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో సిరిఫెడ్ ఛైర్మన్ గా పనిచేసిన ఎ.ఎం.రాధాకృష్ణ కు స్వయాన సోదరుడు. దీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఇన్ఛార్జిగా, వివిధ హోదాలలో రాధాకృష్ణ వ్యవహరించారు. రాజకీయ కుటుంబమైన మనోహర్ అయితే పార్టీకి గట్టి పట్టు వుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని కులాలను కలుపుకపోయే మనోహర్ తో కూడా ఆపార్టీ లోని ఒక వర్గం పావులు కడుపుతోంది. ఆయన్ను జగన్ మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళేందుకు సిద్ధమౌతున్నారు.