8వ సారి గెలిచి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు
లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా తెదేపా వ్యూహం
నియోజకవర్గ ఇంచార్జిగా కలిచెర్ల శ్రీకాంత్
చంద్రబాబు ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి
స్థానిక సంస్థల విజయోత్సాహంతో వైసిపి
చంద్రబాబుపై పోటిగా బిసి అభ్యర్థి భరత్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. ఇంతవరకు జరిగిన తొమ్మిది సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ విజయం సాధించలేదు. 1983, 1985 ఎన్నికలలో రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1989 నుంచి ఏడు పర్యాయాలు వరుసగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రతిహస్తంగా విజయం సాధిస్తున్నారు. రానున్న ఎన్నికలలో ఎనిమిదవ సారి కూడా విజయం సాధించి, తనదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు.
నియోజకవర్గాల వ్యవస్థీకరణ తర్వాత కుప్పం మునిసిపాలిటీ, కుప్పం మండలం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలు కుప్పం నియోజకవర్గంలో ఉంటున్నాయి. వి. కోటను పలమనేరు నియోజకవర్గంలో చేర్చారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో పోటీ చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. పోటీ చేసినా ఓడిపోతామని తెలిసే పోటి చేసే వాళ్ళు. చంద్రబాబు మీద పోటీ చేశామన్న గౌరవం అన్నా దక్కుతుందనే భావంతో పలువురు పోటి చేశారు. ఓడిపోయినా, ప్రభుత్వం వస్తే నామినేట్ పదవి వస్తుందని ఆశ పడే వాళ్ళు. చిత్తూరు మాజీ MLA గోపీనాథ్ కూడా ఒకప్పుడు కుప్పంలో పోటి చేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో MLC అయ్యారు. అక్కడ పోటి చేయడానికి అభ్యర్థులు లేకున్నా ఎవరినో ఒకరిని బ్రతిమాలి రంగంలోకి దించేవాళ్లు. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు విజయం లాంచనమే. చంద్రబాబు నాయుడు ప్రచారానికి కానీ, నామినేషన్ వేయడానికి కూడా కుప్పం నియోజకవర్గానికి అడుగుపెట్టకనే గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అయితే కాలక్రమంలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గతంలో మూడు పర్యాయాలు నియోజకవర్గంలో నుంచి గెలిచిన జడ్పిటిసి అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతున్నారు. కుప్పంలో పాగా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు జరిగాయి. కుప్పం నియోజకవర్గంలో గెలిచిన వారికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. ఆ రకంగానే ఎం. రెడ్డమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, గోవింద శ్రీనివాసులు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గ మీద దృష్టిని సారించారు. చంద్రబాబు నాయుడుకు చిరకాల రాజకీయ శత్రువైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంను ఒక రకంగా దత్తత తీసుకున్నారని చెప్పవచ్చు. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమి ధ్యేయంగా మంత్రి utsvaపనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జడ్పిటిసి, ఎంపీటీసీ, మండల పరిషత్, సర్పంచ్, వార్డు మెంబర్లు, కుప్పం మున్సిపాలిటీ, కౌన్సిలర్లు సభ్యులు అత్యధికం వైసిపి వాళ్ళు గెలుచుకున్నారు. అయిదు మండల పరిషత్తు అధ్యక్ష పదవులను, ZPTC పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే కుప్పం మునిసిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇలా చంద్రబాబు కోట మీద YCP జండాను ఎగురవేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలతో రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడును ఓడించాలని వైసిపి పకడ్బందీగా పావులు కలుపుతోంది. నియోజకవర్గానికి చెందిన బీసీ నేత, వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను తమ అభ్యర్థిగా చాలా కాలం కిందటే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అయన కుప్పంలో గెలిస్తే, మంత్రి పదవీ ఇస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తిరిగి పార్టీని పటిష్టం చేయడానికి భరత్ కు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారు. ఆయనను జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భరత్ ఈ పర్యాయం శాసనసభ ఎన్నికలలో గెలవడానికి కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థిని ఏడాదికి ముందే ప్రకటించడంతో కుప్పం నియోజకవర్గంలో ప్రచారం ఎప్పుడో ప్రారంభమైంది. ఒక దశలో చంద్రబాబుకు కష్టం అని అనిపించినా, ఆయన అరెస్టు, జనసేన పొత్తు తరువాత పరిస్థితిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది.
ఒకనాడు కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అనే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా కుప్పం ఉండేది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక క్రమంగా వైసిపి పుంజుకుంటోంది. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. అధికార బలంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను అణగదొక్కడానికి వైసిపి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు పర్యటనలను సైతం అడ్డుకున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తల మీద ఎడాపెడా కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పరాజయం తెలుగుదేశం పార్టీకి గొడ్డలి పెట్టులా తయారైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సారి ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలన్న ధ్యేయంతో చంద్రబాబు నాయుడు నియోజకవర్గ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ కలిచర్ల శ్రీకాంత్ ను నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. ఏడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకు రాలేదు. ఇప్పుడు YCP దెబ్బతో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రను కుప్పం నుంచే ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అతిరథ మహారధులు పాల్గొని బల ప్రదర్శన చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో మూడు నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించి కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నడూ రాజకీయాలలో ఏలు పెట్టని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా కుప్పం నియోజకవర్గంలో అడిగిడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఎన్నడూ రాజకీయాలు మాట్లాడని నారా భువనేశ్వరి మైక్ పట్టుకొని రాజకీయ ఉపన్యాసం చేశారు. ఇలా రానున్న ఎన్నికలలో చంద్రబాబును గెలిపించుకోవడానికి ఆ పార్టీ నాయకులు సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. ఇది వరకు కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా పరిషత్తు చైర్మన్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం రెడ్డికి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే అయన వైసిపి గూటికి చేరారు. ఇది వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన బి ఆర్ సురేష్ బాబు కూడా పార్టీలో చేరారు. ఆయన మాజీ MLA దొరస్వామి నాయుడు కుమారుడు. ఇలా ఎనిమిదవ సారి కూడా విజయం సాధించడానికి చంద్రబాబు పద్బందిగా వ్యూహ రచన చేసి, అమలు చేస్తున్నారు. ఎనిమిదవసరి విజయం సాధించి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు క్రుతనిర్చయంతో ఉన్నారు. అయితే, చంద్రబాబు ఓడించి, తొలి సరిగా కుప్పం కోట మీద వైసిపి జండాను ఎగురవేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయ ప్రత్యర్ధులైన చంద్రబాబు, రామచంద్రా రెడ్డిలలో ఎవరిదీ పై చేయి అవుతుందో వేచి చూద్దాం.