24, ఏప్రిల్ 2024, బుధవారం

జిల్లాలో నాలుగు వేలకు పైగా వలంటీర్లు రాజీనామా

పెద్దమంత్రి ఆదేశానుసారమే జిల్లాలో వలంటీర్ల రాజీనామాలు

వలంటీర్లే  ప్రచార సారధులుగా  వైసిపి ప్రచారం

వైసిపి నేతల వత్తిడి మేరకే వలంటీర్ల రాజీనామాలు 

రాజీనామా చేసి ముమ్మరంగా వైసిపి ప్రచారం 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

జిల్లాలోనీ  వలంటీర్లు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవలో తరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మండలాల్లో భారీ ఎత్తున వాలంటీర్లు మూకుమ్మడిగా  రాజీనామాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక పెద్ద మంత్రి ఆదేశానుసారం జిల్లాలో వాలంటీర్లు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఆయన ఆదేశం ప్రకారం నియోజకవర్గ, మండల  వైసిపి నాయకులు మండలాల వారిగా వలంటీర్లు చేత రాజీనామాలు చేపిస్తున్నారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లు అధికార వైసిపి అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. ఎవరైనా వలంటీర్లు రాజీనామా చేయడానికి విముఖత వ్యక్తం చేస్తే, నాయనో, భయానో వారి చేతకూడా రాజీనామాలు చేపియిస్తున్నారు. మేమే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు రాజీనామా చేయమంటున్నాం చేయండి అని ఖరాఖండిగా చెపుతున్నారు. మళ్ళి తామే అధికరలోకి వస్తామని, అప్పుడు మీ ఉద్యోగాలు మీకే ఉంటాయని నమ్మబలుకుతున్నారు. ఒక వేళ రాజీనామాకు ఒప్పుకోకుంటే, మళ్ళి ప్రభుత్వం వస్తే, మార్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరు అధికారులు కూడా వైసిపికి అనుకూలంగా ఉంటూ, వలంటీర్లను రాజీనామాలకు ఒప్పిస్తున్నారు. పైకి అంతా స్వచ్చందంగా జరుగుతున్నట్లు అనిపిస్తున్నా, బలవంతంగా వలంటీర్లు చేత రాజీనామాలు చేపిస్తున్నారు.


 చిత్తూరు జిల్లాలో 8883 మంది వాలంటీర్లను ప్రభుత్వం భర్తీ చేయగా ఇందులో సగం మంది ఇప్పటికే రాజీనామా చేసినట్లు సమాచారం. అనధికార సమాచారం మేరకు జిల్లాలో నాలుగు వేలకు పైగా వాలంటీర్లు రాజీనామాలు  చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి చేత కూడా రాజీనామాలు చేపించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రాజీనామాలను నిలువరించడానికి కూటమి అభ్యర్థుల ఎత్తుగడలు జిల్లాలో ఫలించడం లేదు.  వలంటీర్ల విషయమై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వలంటీర్లు అందర్నీ కొనసాగిస్తామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వలంటీర్ల గౌరవ వేతనాన్ని 5000 నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయినా వాలంటీర్ల రాజీనామాలు ఆగడం లేదు. మండలంలో వాలంటీర్లందరులు మూకమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామాలు చేసి అధికార వైసిపి పార్టీ ప్రచారంలో పాల్గొంటామని ,అభ్యర్థులను గెలిపించుకుంటామని బహిరంగంగా చెబుతున్నారు. ఐరాల మండలంలో బుధవారం వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. సదం మండలంలో 184 మంది వలంటీర్లు మూకుమ్మడిగా ఒకే రోజు  రాజనామా చేశారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలో కూడా 50 మందికి పైగా వలంటీర్లు రాజీనామా చేశారు. పాకాల మండలంలో 74 మంది, వి. కోటలో 14 మంది రాజీనామాలు చేశారు. పూతలపట్టు మండలంలో 50 మందికి పైగా  వలంటీర్లు రాజీనామా బాట పట్టారు. పాకాలలో కూడా  ఒకే రోజు 74 మంది రాజీనామా చేశారు. వి. కోట మండలం, కుంభార్లపల్లి గ్రామ సచివాలయ వలంటరీలు 14 మంది ఎంపీడీవో ఆఫీస్ లో రాజీనామా పత్రం సమర్పించారు. వలంటరీలు ఎలక్షన్లో పాల్గొనకూడదు అని నియమాలు రావడంతో అందుకోసం మేము రాజీనామా చేస్తున్నామని తెలిపారు. మేము నాలుగు సంవత్సరాలుగా వలంటరీగా పని చేసి ఎనలేని సేవ ప్రజలకు అందించామని, దీనికి కారణము మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మేము ముఖ్యమంత్రిగా చూడాలనీ అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వలంటరీలను ఎలక్షన్ దీంట్లో పాల్గొనకూడదు అని చెప్పడంతో మేము 14 మంది రాజీనామా చేసాము. మా ధ్యేయము ఇక్కడ మళ్లీ ఎమ్మెల్యేగా వెంకటే గౌడ గెలిపించుకో వాలి దానికోసమే మేము వాలంటరీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు.  పలు మండలాల్లో వలంటీర్ల రాజీనామా పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు వలంటీర్ల వ్యవస్థను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని నిరసిస్తూ వలంటీర్లు రాజీనామాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రాజనామాలు చేసిన తరువాత వలంటీర్లు అధికార పార్టీ సేవలో తరించనున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందుకోసమే అధికార పార్టీ నాయకులు వలంటీర్ల మీద వత్తిడి తీసుకొని వచ్చి వారి చేత రాజీనామాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క వలంటీర్ కు నెలకు 5000 రూపాయలు వంతున ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుంది. ఇందుకు డబుల్ గా పదివేల నుంచి పాతిక వేల రూపాయల వరకు వైయస్సార్ పార్టీ నాయకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. మళ్ళి ప్రభుత్వం వస్తే, తిరిగి వలంటీరీ ఉద్యోగాలు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నట్లు తెలిసింది. రానున్న ఎన్నికలలో రాజీనామా చేస్తున్న వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒకటవ తారీఖున వలంటీర్ల చేత పింఛన్ల పంపిణీ నిలుపుదల చేశారు. వలంటీర్లు రాజీనామాలు చేస్తుండటం కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఇటీవల 33 మంది వలంటీర్లను జిల్లా కలెక్టర్ తొలగించారు. చిత్తూరు మున్సిపాలిటీలో 18, పలమనేరులో 12 మందిని, గుడిపాల మండలంలో ముగ్గురు వాలంటీర్లను తొలగించారు. వలంటీర్ల మీద కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు పరిష్కరించడం జిల్లా యంత్రాంగానికి తలకి మించిన భారమే అవుతోంది. చిత్తూరు జిల్లాలో 8883 మంది వలంటీర్లను ప్రభుత్వం భర్తీ చేసింది. వీరిలో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా వలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంతే కాదు ఆయన మానసిక పుత్రికగా కూడా అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ వలంటీర్లు వ్యవస్థ వైసిపికి బాగా ఉపయోగపడుతోంది. ఎన్నికల వేళ వాలంటీర్లు ద్వారా ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని టీడీపీ జనసేన, బీజేపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఫిర్యాదు రావడంతో స్పందించిన ఎన్నికల కమిషన్‌ వలంటీర్లు సేవలు వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రభావం పింఛన్‌ పంపిణీపై పడింది. మొదటి నుంచి కూడా ఈ వలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. చాలా మంది వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే ఈ బాధ్యతలు అప్పగించారని మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. సీఎం జగన్‌తోపాటు చాలా మంది మంత్రులు వైసీపీ పెద్దలు కూడా దీన్ని ధ్రువీకరించారు. వలంటీర్లలో చాలా మంది వైసీపీ సానుభూతిపరులేనంటూ చాలా మీటింగ్స్‌లో చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ఈ వ్యవస్థపై అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. వలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని మొదటి నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. అదే టైంలో కొందరు వలంటీర్లు నేరుగా వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో మీటింగ్‌లలో పాల్గొనడంతో వారిపై కంప్లైంట్‌లు మరింత ఎక్కువ పెరిగాయి. ఈసీ కూడా వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఫొటోలతో ఫిర్యాదు చేయాలని చెప్పింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులురావడంతో వారిలో చాలా మందిని సస్పెండ్ చేసింది. తమను అనుమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వలంటీర్లు చాలా ప్రాంతాల్లో రాజీనామా చేసినట్లు అనిపిస్తున్నా, దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *