5, ఏప్రిల్ 2024, శుక్రవారం

జిల్లాలో కొనసాగుతున్న వలంటీర్ల రాజీనామాలు

సదంలో 184, పాకాలలో 74, వి. కోటలో 14, చిత్తూరులో 50 మంది రాజీనామాలు 

పుతలపట్టులో 50 మంది రాజీనామాకు సిద్దం 

కూటమి పార్టీలు కించపరుస్తున్నాయని  ఆవేదన 

అధికారపార్టీ ప్రచారానికే అని కూటమి పార్టీల విమర్శ 


చిత్తూరు జిల్లాలో  వలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజు సదం మండలంలో 184 మంది వలంటీర్లు మూకుమ్మడిగా రాజనామా చేశారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలో కూడా 50 మందికి పైగా వలంటీర్లు రాజీనామా చేశారు. పాకాల మండలంలో 74 మంది, వి. కోటలో 14 మంది రాజీనామాలు చేశారు. పూతలపట్టు మండలంలో రాజీనామా చేయడానికి 50 మంది వలంటీర్లు సిద్దంగా ఉన్నారు. పలు మండలాల్లో వలంటీర్ల రాజీనామా పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు వలంటీర్ల వ్యవస్థను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని నిరసిస్తూ వలంటీర్లు రాజీనామాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రాజనామాలు చేసిన తరువాత వలంటీర్లు అధికార పార్టీ సేవలో తరించనున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందుకోసమే అధికార పార్టీ నాయకులు వలంటీర్ల మీద వత్తిడి తీసుకొని వచ్చి వారి చేత రాజీనామాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క వలంటీర్ కు నెలకు 5000 రూపాయలు వంతున ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుంది. ఇందుకు డబుల్ గా పదివేల నుంచి పాతిక వేల రూపాయల వరకు వైయస్సార్ పార్టీ నాయకులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. మళ్ళి ప్రభుత్వం వస్తే, తిరిగి వలంటీరీ ఉద్యోగాలు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నట్లు తెలిసింది. రానున్న ఎన్నికలలో రాజీనామా చేస్తున్న వలంటీర్లు ముఖ్య భూమికను పోషించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒకటవ తారీఖున వలంటీర్ల చేత పింఛన్ల పంపిణీ నిలుపుదల చేశారు. దీంతో మూడు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. వలంటీర్లు గతంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తుండగా, ప్రస్తుతం పింఛనుదారులను గ్రామ సచివాలయానికి రప్పించి ఓకే చోటనే ఇస్తున్నారు. పించన్ల పంపిణికి  తమను దూరంగా ఉంచడంతో ఆవేదనతో రాజీనామా చేస్తున్నట్లు వలంటీర్లు చెబుతున్నారు. వలంటీర్లు రాజీనామాలు చేస్తుండటం కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఇటీవల 33 మంది వలంటీర్లను జిల్లా కలెక్టర్ తొలగించారు. చిత్తూరు మున్సిపాలిటీలో 18, పలమనేరులో 12 మందిని, గుడిపాల మండలంలో ముగ్గురు వాలంటీర్లను తొలగించారు. వలంటీర్ల మీద కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు పరిష్కరించడం జిల్లా యంత్రాంగానికి తలకి మించిన భారమే అవుతోంది చిత్తూరు జిల్లాలో 8883 మంది వలంటీర్లను ప్రభుత్వం భర్తీ చేసింది. వీరిలో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా వలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంతే కాదు ఆయన మానసిక పుత్రికగా కూడా అభివర్ణిస్తుంటారు. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ వలంటీర్లు వ్యవస్థపై వివాదాలు దుమారాన్ని రేపుతున్నాయి. గ్రామ, వార్డుల్లో 50కుటుంబాల‌కు ఒకరు చొప్పున పెద్ద నెట్‌వర్క్‌ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ నేరుగా ఇళ్లకు చేర్చేందుకు వలంటీర్లును ఉపయోగిస్తోంది. అవ్వాతాతలకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ప్రతీ నెలా ఒకటో తేదీన అందించింది. ఎన్నికల వేళ వాలంటీర్లు ద్వారా ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని టీడీపీ జనసేన, బీజేపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఫిర్యాదు రావడంతో స్పందించిన ఎన్నికల కమిషన్‌ వలంటీర్లు సేవలు వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ప్రభావం పింఛన్‌ పంపిణీపై పడింది. మొదటి నుంచి కూడా ఈ వలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. చాలా మంది వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే ఈ బాధ్యతలు అప్పగించారని మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. సీఎం జగన్‌తోపాటు చాలా మంది మంత్రులు వైసీపీ పెద్దలు కూడా దీన్ని ధ్రువీకరించారు. వలంటీర్లలో చాలా మంది వైసీపీ సానుభూతిపరులేనంటూ చాలా మీటింగ్స్‌లో చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ఈ వ్యవస్థపై అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. వలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని మొదటి నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. అదే టైంలో కొందరు వలంటీర్లు నేరుగా వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో మీటింగ్‌లలో పాల్గొనడంతో వారిపై కంప్లైంట్‌లు మరింత ఎక్కువ పెరిగాయి. ఈసీ కూడా వలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఫొటోలతో ఫిర్యాదు చేయాలని చెప్పింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులురావడంతో వారిలో చాలా మందిని సస్పెండ్ చేసింది. ఇప్పుడు పింఛన్ల పంపిణీ వారితో చేయిస్తే ఓటర్లను ప్రలోభ పెట్టే ఛాన్స్ ఉందని కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ వారితో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. తమను అనుమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వలంటీర్లు చాలా ప్రాంతాల్లో రాజీనామా చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే కుతూహలం ఉన్న వ్యక్తులు వలంటీర్‌ పోస్టులకు రాజీనామా చేస్తున్నారనేప్రచారం ఉంది. సదం మండలంలో మాత్రమే 184 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఈ మండలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత మండలం కావడం విశేషం. మంత్రి సొంత మండలంలో ప్రారంభం అయిన ఈ రాజీనామాల పర్వం జిల్లా అంతా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వాళ్లంతా వైసీపీ అభ్యర్ధుల వెంట ఎన్నికల ప్రచారంలో తిరుగనున్నారు. పాకాలలో కూడా  ఒకే రోజు 74 మంది రాజీనామా చేశారు. వి. కోట మండలం, కుంభార్లపల్లి గ్రామ సచివాలయ వలంటరీలు 14 మంది ఎంపీడీవో ఆఫీస్ లో రాజీనామా పత్రం సమర్పించారు. వలంటరీలు ఎలక్షన్లో పాల్గొనకూడదు అని నియమాలు రావడంతో అందుకోసం మేము రాజీనామా చేస్తున్నామని తెలిపారు. మేము నాలుగు సంవత్సరాలుగా వలంటరీగా పని చేసి ఎనలేని సేవ ప్రజలకు అందించామని, దీనికి కారణము మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మేము ముఖ్యమంత్రిగా చూడాలనీ అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వలంటరీలను ఎలక్షన్ దీంట్లో పాల్గొనకూడదు అని చెప్పడంతో మేము 14 మంది రాజీనామా చేసాము. మా ధ్యేయము ఇక్కడ మళ్లీ ఎమ్మెల్యేగా వెంకటే గౌడ గెలిపించుకో వాలి దానికోసమే మేము వాలంటరీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. వలంటీర్‌ వ్యవస్థను కాదని ప్రభుత్వ ఉద్యోగులతోనే పింఛన్లుపంపిణీ చేయాలనే సరికి గందరగోళం నెలకొంది. దీనికి అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఈ పరిస్థితి ఎవరికి వాళ్లే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. 50 కుటుంబాలకు ఐదేళ్లుగా  సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న వలంటీర్లు ఓట్లను ఈజీగా ప్రభావితం చేయగలరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకే వారిని మచ్చిక చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు వలంటీర్లుకు ప్రత్యేక తాయిలాలు ఇస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ప్రతీ వైసీపీ అభ్యర్ధి నెలకు రూ.10,000 ఇవ్వాలని అధిష్టానం నుంచి అదేశాలందాయని అంటున్నారు. వారితో ప్రత్యేక సమావేశాలు పెట్టి విందులు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఈ వ్యవస్థ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలనే ప్రయత్నం చేసినట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *