ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్
25 వరకు నామినేషన్లు, 26న స్కూటీని
ఉపసంహరణకు గడువు 29, తుది జాబితా ప్రకటన
మే 13 నా పోలింగ్, జూన్ 4నా ఓట్ల లెక్కింపు
జిల్లాలో 425 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
చిత్తూరు, ఏప్రిల్ 18, (ప్రభ న్యూస్త్తూ బ్యూరో) చిత్తూరు జిల్లాలోని ఒక పార్లమెంటు, ఏడు శాసనసభ నియోజకవర్గాలకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం ఉదయం చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటుకు, పుంగనూరు, నగిరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు పార్లమెంటుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నామినేషన్లు స్వీకరిస్తారని, చిత్తూరు అసెంబ్లీకి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆ నియోజకవర్గ కేంద్రంలోని నామినేషన్లను స్వీకరించనున్నట్లు వివరించారు. నామినేషన్లను ఈనెల 25వ తేదీ వరకు దాఖలు చేయవచ్చన్నారు. నామినేషన్ల స్కూటీని 26వ తేదీ జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ చివరి రోజుగా తెలిపారు. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం జరుగుతుందన్నారు. మే 13 వ తారీఖున పోలింగ్ జరుగుతుందని, ఓట్ల లెక్కింపు జూన్ 4వ తారీఖున జరుగుతుందని, ఎన్నికల ప్రక్రియ ముగింపు ఆరవ తేదీతో పూర్తవుతుందని వివరించారు. నామినేషన్ సమయంలో లోక్ సభ అభ్యర్థి రూ. 25000, శాసనసభ అభ్యర్థి రూ. 10000 ధరావతు చెల్లించాలని, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుందన్నారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని, నామినేషన్ దాఖలకు 13 రకాల ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. లోకసభ స్థానానికి పోటీచేసే అభ్యర్ధులు ఫాం- 2ఎ. శాసనసభ అభ్యర్థి ఫాం-2బి లో దరఖాస్తు చేయాలన్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 11 నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారనీ, ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించరనీ తెలిపారు. అభ్యర్ధులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు అన్నారు. ఆయా పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధి కారి (ఆర్వో)కి, ఏఆర్వోకి మాత్రమే ఇవ్వాలనీ స్పష్టం చేశారు. అభ్యర్థి తన నామినేషన్ పత్రాలు నేరుగా కానీ తన ప్రతిపాదకుడు (ప్రపోజర్) ద్వారా కానీ సమర్పించవచ్చునని చెప్పారు. నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలనీ కోరారు. రెండు కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేయడం కుదరదన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలకే అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థి సహా అయిదుగురినే ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తారనీ, అన్ని నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్కు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సువిధ యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసినా, వాటి పత్రాలను ఆర్వోకి భౌతికంగా ఇవ్వాలి తెలిపారు. ఫారం-26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలనీ, దాని స్టాంప్ పేపర్ విలువ రూ.100 లేదా అంత కంటే ఎక్కువ ఉండాలన్నారు. ఈ-స్టాంప్ కూడా వినియోగించవచ్చునని పేర్కొన్నారు. అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నాటి నుంచి అతని వ్యయాన్ని లెక్కిస్తారనీ చెప్పారు.
చిత్తూరు జిల్లాలో 1771 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఇవి 1266 కేంద్రాలలో ఉన్నాయన్నారు. ఇందులో 425 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. నగిరి నియోజకవర్గం లో 231 పోలింగ్ కేంద్రాలు, గంగాధర నెల్లూరులో 256, చిత్తూరులో 226, పూతలపట్లు 262, పలమనేరులో 288, కుప్పంలో 243, పుంగనూరులో 265 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఇందులో నగరి నియోజకవర్గంలో 50 పోలింగ్ కేంద్రాలు, గంగాధర నెల్లూరులో 34, చిత్తూరులో 42, పూతలపట్టులో 53, పలమనేరు లో 88, కుప్పంలో 58, పుంగనూరులో 100 పోలింగ్ బూతులను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. అక్కడ పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, చిత్తూర్ ఆర్డీవో పుల్లయ్య పాల్గొన్నారు.