31, మార్చి 2024, ఆదివారం

వాలంటీర్లకు కూటమి పార్టీలు క్షమాపణలు చెప్పాలి

రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. 
ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ మీద  అధ్యయనం చేస్తున్నాయి
వాలంటీర్లతో ప్రజల ముంగిటకే ప్రభుత్వం సాధ్యం అయ్యింది 
డిగ్రీ, పీజీలు చేసిన కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.
కూటమి పార్టీల విమర్శలు వారి ఆత్మస్థైర్యాన్ని దేబ్బతిస్తున్నాయి 
రాజీనామాలు చేయడానికి సిద్దపడుతున్నారు.
ఆంధ్రప్రభ ప్రతినిధితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి 



(ఆంధ్రప్రభ చిత్తూరు బ్యూరో)


రాజకీయాలకతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను కూటమి పార్టీలు లక్ష్యంగా  చేసుకొని విమర్శలు చేయడం తగదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ పార్లమెంటు సభ్యుడు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి ఆక్షేపించారు. తెల్లవారక ముందే అవ్వ, తాతలకు పింఛను డబ్బులను పంపిణీ చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థను రాజకీయం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి, జనసేన, బిజేపి పార్టీలు వాలంటీర్ల వ్యవస్థను చిన్న బుచ్చే విధంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారని, వారు వాలంటీర్లకు  క్షమాపణలు చెప్పాలని జ్ఞానేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు.


ఆదివారం చిత్తూరులో 'ఆంధ్రప్రభ ప్రతినిధి'తో మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో చాలా చక్కగా పనిచేస్తుందని కితావిచ్చారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి వాలంటీర్ల వ్యవస్థను అధ్యయనం చేస్తుండడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటే, సొంత రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వాలంటీర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. 5000 రూపాయలకే డిగ్రీలు, పేజీలు చేసిన యువత నిస్వార్ధంగా, రాజకీయాలకతీతంగా తమ సేవలను అందిస్తున్నారని వాలంటీర్లను అభినందించారు. ఇటీవల కూటమి పార్టీలు చేస్తున్న విమర్శలు తట్టుకోలేక పలుచోట్ల వాలంటీర్లు రాజీనామా చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, వారిని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేయడం తగదన్నారు. 

వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా నిరుపేదలనుగా గుర్తించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని,  ఇళ్ళను మంజూరు చేస్తున్నారని వివరించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పరిపాలన ప్రజల ముందుకు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇదివరకటిలా మండల కార్యాలయాలు చుట్టూ ప్రజలు జరగాల్సిన అవసరం లేదన్నారు. ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా గ్రామంలోని సచివాలయంలో దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత రెవెన్యూలో అవినీతి రహిత పాలన జరుగుతోందని తెలిపారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు,  నీరు - మీరు కారణంగా అవినీతి పెచ్చు మీరిందన్నారు. ఆ అవినీతి కారణంగానే తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని చవిచూసిందన్నారు. ఏదైనా ప్రభుత్వ పథకం మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల ఇంటి చుట్టూ తిరిగి, వారిని తృప్తి పరస్తినే, వారు  సంతకం చేస్తారన్నారు. అలాగే నీరు - మీరు కార్యక్రమంలో భారీగా అవినీతి  జరిగిందని ఆరోపించారు. ఏలాంటి అవకతవకలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయ వద్దని జ్ఞానేందర్ రెడ్డి కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మభూమి కమిటీల,  నీరు - మీరులో  జరిగిన అవినీతి అక్రమాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ కాకిని చేసి విమర్శనాస్రాల సంధించడం సబబు కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మేలు చేశారని, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారని వివరించారు. రాష్ట్రం మొత్తం ఆయనకు అండగా నిలుస్తుందన్నారు. రానున్న ఎన్నికలలో అఖండ మెజారిటీతో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేశారు

సిద్ధం సభను విజయవంతం చేయండి

ఈనెల మూడవ తేదీన పూతలపట్టు మండలంలో జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్దం సభను విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు, పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజక వర్గాలకు కలిపి పూతలపట్టు సమీపంలోని పాలకూరు వద్ద సిద్దం సభ జరుగుతుందన్నారు. రాజకీయాలకతీతంగా ప్రభుత్వం నుంచి మేలు పొందిన వారందరూ ఈ సభలో పాల్గొని, విజయవంతం చేయాల్సిందిగా కోరారు. మండల పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సిద్ధం సభను దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పనిచేసి, ఈ సభ ద్వారా తమ సత్తా నిరూపిస్తామని జ్ఞానేందర్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *