మండల పార్టీ అధ్యక్ష పదవులకు పోటాపోటీ !
మండల పార్టీ అధ్యక్ష పదవుల కోసం బిసిల పట్టు
ప్రస్తుత అధ్యక్షులతోపాటు పోటీలో కొత్త నాయకులు
తలనొప్పిగా మారిన మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక
ఆచితూచి అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే థామస్
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుల ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రస్తుతం ఉన్న మండల పార్టీ అధ్యక్షులు తమను కొనసాగించాలని కోరుతున్నారు. వారిని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మరో వర్గం ముందుకు వస్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఇందులో నాలుగు మండలాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు ఒక్కొక్క మండలం దక్కే అవకాశం ఉంది. మండల పార్టీ అధ్యక్ష పదవులకు పోటీ ఎక్కువ ఉండడంతో శాసనసభ్యులు థామస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందర్నీ కలుపుకొని, అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రం టిడిపిలో పార్టీ పదవుల నియామక ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నెల 15 వ తేదీ లోపల పంచాయతీ, మండల, పార్లమెంటు కమిటీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 27, 28, 29 తేదీలలో కడపలో జరిగే మహానాడులో పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటారు. జూన్ 15 లోపల జాతీయ, రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంస్థల అధ్యక్షులను నియమిస్తారు. ఈ నేపధ్యంలో గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో పార్టీ పదవుల వేట జోరందుకుంది. నియోజక వర్గంలో ఉన్న ఆరు మండలాలలో అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. అందుకు అనుగుణంగా గ్రామ కమిటీల ఏర్పాటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మండల కమిటీలలో 50 శాతం ఎస్సీ, బిసిలకు అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. అలాగే బీసీలకు 33 శాతం ఉండాలని నిర్దేశించింది. కాబట్టి నియోజక వర్గంలోని ఆరు మండలాలలో మూడు చోట్ల ఎస్సీ, బిసి లకు అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తోంది . గతంలో పాలసముద్రం, జి డి నెల్లూరు ఎస్సీలకు, కార్వేటినగరం బిసి నేతకు ఇచ్చారు. పెనుమూరు, ఎస్ ఆర్ పురం కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వగా వెదురుకుప్పం రెడ్డికి కేటాయించారు. అయితే ఈ సారి బిసిలకు రెండు మండలాలు కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎస్ ఆర్ పురం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుండయ్య భార్య శాంతిని నియమించారు. పాలసముద్రం మండల అధ్యక్షుడు రాజేంద్రకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారని భావిస్తున్నారు. పెనుమూరు మండలానికి చెందిన బి ఆర్ నాయుడు టిటిడి చైర్మన్ గా, డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉన్నారు. కావున ఎస్సీ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి ఒక్కో మండలం ఇస్తే చాలని అంటున్నారు. రెండు మండలాలు బిసి లకు, ఒక మండలం రాజులకు ఇస్తే సామాజిక న్యాయం చేసినట్టు ఉంటుందని పార్టీలో కొందరు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పెనుమూరు మండలం అధ్యక్ష పదవికి ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, సుబ్రమణ్యం నాయుడు ప్రకాష్ నాయుడు, కృష్ణమూర్తి నాయుడు పోటీ పడుతున్నారు. సతీష్ రెడ్డి, మనోహర్ రెడ్డి ( బాబు రెడ్డి ), షణ్ముఘ వర్మ ( బిసి), తలారి నాగరాజ, తలారి రెడ్డప్ప ( ఎస్సీ) నేతలు పదవి ఆశిస్తున్నారు. వెదురుకుప్పం మండల అధ్యక్షునిగా మునిచంద్రా రెడ్డి, మోహన్ మురళీ ( ఎస్సీ), కిషన్ చంద్ ( బిసి) మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొన్నది.
ఎస్ ఆర్ పురం మండలంలో జయశంకర్ నాయుడు, రాజశేఖర నాయుడు, పైనేని మురళి నాయుడు పోటీ పడుతున్నారు. పాలసముద్రం మండల అధ్యక్ష పదవి కోసం శివ నాయుడు, రామకృష్ణ రాజు, చిన్న స్వామి రాజు ప్రయత్నం చేస్తున్నారు. జి డి నెల్లూరు మండల అధ్యక్షుడుగా ఎస్సీ నేతలు స్వామి దాసు, దేవ సుందరం మధ్య పోటీ ఉంటుంది.
కార్వేటినగరం మండల అధ్యక్షునిగా తిరిగి చెంగల్రాయ యాదవ్ ఎన్నిక అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాగా మరి కొందరు నాయకులకు పార్లమెంటు, రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు, అనుబంధ సంస్థలలో ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. పదవులు ఆశించే వారు ఎమ్మెల్యే థామస్ చుట్టూ పైరవీలు సాగిస్తున్నారు. ఆయన ఎవరికి హామీ ఇవ్వడం లేదని తెలిసింది. పార్టీ తరఫున పరిశీలకులను నియమించి, మండలంలో సమర్థులకు అవకాశం కల్పిస్తారని సమాచారం.

