ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచే టీ
నేడు ప్రపంచ టీ దినోత్సవం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
టీ అనేది స్నేహం, ఆతిథ్యం, సంభాషణలకు చిహ్నం. ఇద్దరు స్నేహితులు కలిసినా, ఇంటికి అతిధులు వచ్చినా, మనసు బాగా లేకపోయినా, ఏం తోచకపోయినా, తలనొప్పి వచ్చినా, మూడీగా ఉన్నా, చురుగ్గా పనిచేయలన్నా టీ తాగాల్సిందే. టీ మానవ జీవితంలో ఒక భాగంగా తయారయింది. ఉదయం లేచినప్పుడు నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో మనిషి టీ తాగుతూనే ఉంటారు. టీ లేని సమాజాన్ని ఊహించుకోలేము. సంతోషంగా ఉన్నా, విషాదంలో ఉన్న టీనే తాగాల్సిందే. టీ తాగడానికి ఒక నిర్దిష్ట సమయం, కారణం లేదు, కానీ సాధారణంగా ఉదయం, సాయంత్రం టీ తాగడం చాలామందికి అలవాటు. ఉదయం టీ తాగడం వల్ల రోజును ప్రారంభించేందుకు కావలసిన శక్తి లభిస్తుంది. మెదడును ఉత్తేజపరుస్తుంది. సాయంత్రం టీ తాగడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
అంతర్జాతీయ టీ దినోత్సవం అనే భావన మొట్టమొదట 2005లో టీ ఉత్పత్తి చేసే దేశాలైన భారతదేశం, శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్ మరియు కెన్యా వంటి దేశాలలోని కార్మిక సంఘాలు, చిన్న తేయాకు రైతులు, పౌర సమాజ సంస్థలు ప్రారంభించారు. ఈ దినోత్సవం ప్రధానంగా టీ పరిశ్రమలో ఉన్న కార్మికుల జీవన వేతనాలు, చిన్న తేయాకు ఉత్పత్తిదారులకు సరసమైన ధరలు వంటి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించింది. టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అంతర్జాతీయ అవగాహన పెంచడం దీని లక్ష్యం. 2019 డిసెంబర్ 21న, ఐక్యరాజ్యసమితి అధికారికంగా మే 21ని అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రకటించింది. ఇది టీ సాంస్కృతిక, ఆర్థిక, పర్యావరణ ప్రాముఖ్యతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించింది. టీ ఒక చాలా పురాతన, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పానీయం. ఇది కేవలం ఒక పానీయం కాదు, కానీ ఒక సంస్కృతి మరియు ఒక కళాత్మక రూపం కూడా. టీ యొక్క చరిత్ర వేలాది సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. చైనాలో ఔషధంగా మొదలై, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. టీ సంస్కృతిలో టీ తాగే విధానం, టీ వేడుకలు, టీ వ్యాపారం వంటి అంశాలు ఉన్నాయి. టీ రుచి చాలా ప్రత్యేకమైనది. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, యెల్లో టీ వంటి అనేక రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటికీ వేర్వేరు రుచులు ఉంటాయి. మసాలా చాయ్, అల్లం టీ, మరియు పుదీనా టీ వంటి టీ రకాలు కూడా ఉన్నాయి, అవి ప్రత్యేకమైన రుచులను కలిగి ఉంటాయి. టీలో యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టీలలో గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీ వంటి రకాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పసుపు టీ తాగితే అందులోని కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడంలో బాదం టీ బాగా పనిచేస్తుంది. మునగ ఆకుల టీ తాగితే బరువు తగ్గించుకోవచ్చు, రక్తపోటును, రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది. మల్లెపూల టీ తాగితే రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి తగ్గుతాయి. దాల్చిన చెక్క టీ తాగితే శరీరంలోని వ్యర్థాలను తొలగించి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. గ్రీన్ టీ అధిక రక్తపోటును, కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది. జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది, ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా, టీని తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోట్లాడటానికి సహాయపడతాయి. టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టీ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. టీ తాగడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది. శారీరక శ్రమ చేయగలుగుతారు. టీ రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి. బ్లాక్ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు. రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది. టీలో ఉండే ఫ్లోరైడ్ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుందని వైద్యులు చెపుతున్నారు.

