కరువు కాటకాలతో నష్టపోతున్న జిల్లా రైతులు
నష్టపరిహారం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తున్న జిల్లా అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల గాని నష్టపరిహారం నిధులు
నష్టపరిహారం నిధుల కోసం జిల్లా రైతన్నల ఎదురుచూపులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లాలో సుమారుగా 3.60 లక్షల మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరం 59,136 హెక్టర్లలో వివిధ రకాల పంటలు సాగు కాగా, ప్రస్తుతం 86,269 యాక్టర్లను పంటలు సాగయ్యాయి. వీటికి తోడు రెండు లక్షల హెక్టార్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. సుమారు లక్ష మంది రైతులు ఉద్యానవన పంటల మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీటికి తోడు పూల పెంపకం, కూరగాయల పెంపకం కూడా కుప్పం ప్రాంతంలో విరివిగా జరుగుతోంది. చిత్తూరు జిల్లా కరువు కాటకాలకు పెట్టింది పేరు. తరచుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఫలితంగా జిల్లాలో రైతాంగం భారీగా నష్టపోతుంటారు. అలాగే ఉద్యానవన పంటలైన మామిడి, అరటి, బొప్పాయి పంటలు సాగవుతున్నాయి. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఈ పంటలు కూడా భారీగా దెబ్బతింటున్నాయి. వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు ఉపశమనం మాత్రం కలగడం లేదు. గతంలో పంటల బీమాను రైతుల తరఫున ప్రభుత్వమే భీమా కంపెనీలకు చెల్లించేది. కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేసింది. రైతులే తమ పంటకు బీమాను చెల్లించుకోవాలని నిర్దేశించింది. ఏ ఏ పంటకు ఎప్పుడు బీమాను, ఎంత చెల్లించాలో కూడా వ్యవసాయ ఉద్యానవన శాఖల ద్వారా రైతులకు సమాచారం అందజేసింది. అయితే బీమా సౌకర్యం చేయడం అలవాటు లేని రైతులు వాటిని గురించి పెద్దగా పట్టించుకోలేదు. జిల్లాలో మాత్రం తరచుగా రైతులు నష్టపోతున్నారు. గత సంవత్సరం కరువు కారణంగా చిత్తూరు జిల్లాలో 40,930 మంది రైతులు నష్టపోయారు. వీరికి సంబంధించిన 16,888 హెక్టర్లలో పంటలు ఎండిపోయాయి. కరువు కారణంగా వేరుశనగ రైతులకు 28.71 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు అందజేశారు. అలాగే 2024 సంవత్సరంలో అక్టోబర్ లో జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. వీటివల్ల 346 మంది రైతులకు సంబంధించి 150 హెక్టర్ లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టం 2. 6 కోట్ల రూపాయలుగా వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇందువల్ల జిల్లాలో 2,933 మంది రైతులకు సంబంధించి 988 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఈ నష్టం విలువ 2.48 కోట్ల రూపాయలుగా జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను అందజేశారు. మూడుసా ర్లు వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంట నష్టం గురించి నివేదికలు అందజేసిన, ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారంగా రూపాయి కూడా విడుదల కాలేదు. అలాగే భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఉద్యానవన పంటలైన మామిడి, అరటి, బొప్పాయి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించి కూడా నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యానవన శాఖ అధికారులు అందజేశారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా పశుసంపద కూడా నష్టపోయింది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ విషయమై కూడా నివేదికలు పంపారు. నివేదికల మీద నివేదికలు పంపుతున్న, జిల్లాకు నష్టపరిహారం మాత్రం అందడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చిత్తూరు జిల్లాలో మామిడి, అరటి, బొప్పాయి పంటలకు భారీగా నష్టం జరిగింది. జిల్లాలో పెనుమరు, యాదమరి, చిత్తూరు, గుడిపాల, పలమనేరు, తవణంపల్లి, ఐరాల మండలాల్లో మామిడి కి ఎక్కువ నష్టం జరిగింది. దీనితోపాటు బొప్పాయి, అరటి పంటలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం 404 మంది రైతులు నష్టపోయారు. సుమారుగా 200 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ విషయం కూడా ఉద్యానవన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదు. నిధులు విడుదలవుతుందన్న నమ్మకం కూడా రైతులలో కనిపించడం లేదు.
పో రై గంగ 2 ఇదురు గాలులు, అకాల వర్షానికి నేల రాలిన మామిడి
పో రై గంగ 2 ఇదురు గాలులు, అకాల వర్షానికి నేల రాలిన మామిడి

