30, మే 2025, శుక్రవారం

పొలిట్ బ్యూరోలో, జాతీయ కార్యవర్గంలో జిల్లాకు స్థానం దక్కేనా ?



చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గంలో ఈ పర్యాయం చిత్తూరు జిల్లాకు సముచిత స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు ఈ పర్యాయం పొలిట్ బ్యూరో స్థానం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే జాతీయ కార్యవర్గంలో కూడా చిత్తూరు జిల్లాకు స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఇందుకు పలువు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో వైసిపి నేతలను కట్టడి చేయగలచేవ కలిగిన నేతల కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీని కట్టడి చేస్తూ, తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయగల సత్తా కలిగిననాయకులను ఎంచుకొని పొలిట్ బ్యూరోలో,  అలాగే జాతీయ కార్యవర్గ కార్యవర్గంలో స్థానం కల్పిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు.



తెలుగు దేశం మూడు రోజుల పసుపు ముగిసింది . కడపలో జరిగిన మహానాడులో నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. కడప జగన్ అడ్డా కాదని రుజువు చేశారు. వరుస విజయాలు సాధిస్తేనే అభివృద్ది సాధ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తిరిగి గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీని కోసం పటిష్ఠమైన కమిటీలను ఏర్పాటు చేయడానికి కసరత్తులు ప్రారంభించారు. జూన్ 15 లోపల జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఈ నేపధ్యంలో చిత్తూరు జిల్లా నుంచి ఒకరికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పిస్తారని భావిస్తున్నారు. అలాగే జాతీయ కమిటీలో మరొకరికి చోటు ఉంటుందని ఊహిస్తున్నారు. వైసిపి రాజకీయ వ్యవహారాల కమిటీ ( పొలిట్ బ్యూరో)లో మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్ కె రోజా ఉన్నారు. జిల్లాలో రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గంతో పాటు జి డి నెల్లూరు, పూతలపట్టు అసెంబ్లీ నియోజక వర్గాలను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. కాబట్టి రెడ్డి, ఎస్సీ, బిసి సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు జాతీయ కమిటీలో స్థానం కల్పిస్తే మంచిదని కొందరు భావిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పలమనేరు  ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి పొలిట్ బ్యూరోలో అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. రాష్ట్ర తెలుగు యువత అద్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఈ సారి మంత్రి పదవి ఆశించారు. అన్ని విధాల అనుభవం, సామర్ధ్యం ఉన్నందున అతనికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డికి  పొలిట్ బ్యూరో లేదా జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఊహిస్తున్నారు. విద్యా వేత్త, సైకాలజిస్ట్, కాలమిస్టు, శిక్షకుడు అయిన ఆయన సేవలను పార్టీకి ఉపయోగం అని భావిస్తున్నారు. ఆయనకు మంచి  రాజకీయ అనుభవం కూడా ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ కు ఈ సారి ప్రమోషన్ ఉంటుందని భావిస్తున్నారు. ఆయన వివిధ స్థాయిల్లో పార్టీకి సేవలు అందించారు. ప్రస్తుతం వైసిపి నేతలను మీడియాలో ఎండ గడుతున్నారు. గతంలో కోశాధికారిగా ఉన్న కుప్పంకు చెందిన మునిరత్నం ( బిసి)ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అయినా ఆయనకు ఈ సారి పార్టీలో కీలక స్థానం ఇస్తారని అంటున్నారు. మరో బిసి నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులుకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని భావిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కు కూడా కమిటీలో చోటు ఉంటుందని ఊహిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యేలు సి కె బాబు, ఎ ఎస్ మనోహర్ లకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారా లేక పార్టీ పదవులు అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది. పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాద రావు రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ సభ్యులుగా ఉన్నారు. జి డి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ మోహన్ కు ఇతర పదవి ఏదీ లేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురిలో ఒకరికి పార్టీలో కీలక బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *