పారదర్శకంగా టిడిపి మండల ఎన్నికలు !
మెట్రో దిగిన ఎమ్మెల్యే థామస్
అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువ
చంద్రబాబు దృష్టికి వెళ్లిన ఆరోపణలు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహించాలని ఆదేశాలు
మండల సమావేశాల్లోనే అధ్యక్షుల ఎన్నిక
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజకవర్గ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎన్నిక విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఒక మెట్టు దిగినట్లు తెలుస్తోంది. మండల స్థాయి సమావేశాల నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎస్ఆర్ పురం మండలంలో అత్యవసరంగా నియోజకవర్గస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి మండల పార్టీ అధ్యక్షులను ప్రకటించాలని ఎమ్మెల్యే థామస్ భావించారు. దీనిని నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు రవి ప్రకాష్ నాయుడు వ్యతిరేకించి, పార్టీ సమావేశానికి హాజరు కాలేదు. ఇటీవల తిరుపతికి వచ్చిన ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్యను కలిసి పలువురు ఎమ్మెల్యే థామస్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని వర్ల రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో పార్టీ అధిష్టానం మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మండల పార్టీ అధ్యక్షులు ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే పార్టీ నియమ నిబంధనలను అనుసరించి అధ్యక్షుల ఎన్నిక జరగాలని కూడా సూచించినట్లు తెలిసింది. దీంతో ఏకపక్షంగా పార్టీ అధ్యక్షులను ప్రకటించాలనుకున్న ప్రతిపాదనలను విరమించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో టిడిపి మండల కమిటీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు స్పష్టం చేశారని తెలిసింది. శుక్రవారం తిరుపతిలో, శనివారం జి డి నెల్లూరులో పలువురు ఆశావహులు థామస్ ను కలిసి మండల పార్టీ ఎన్నికల గురించి కలిసి చర్చించారు. పార్టీ నిర్ణయించిన సమయంలో ఎన్నికలు జరపలేక పోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండల కమిటీ అధ్యక్ష పదవులకు డిమాండ్ పెరిగింది. మండలంలో తహసీల్దారు, ఎంపిడిఓ, ఎస్సై లతో మాట్లాడి కార్యకర్తలు సహాయం చేసే అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాలలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నామినేషన్ పై కాంట్రాక్టులు ఇప్పించడంలో అధ్యక్షుని మాటకు విలువ ఉంటుంది. దీనితో పదవిలో ఉన్న వారు కొనసాగాలని పట్టు పడుతున్నారు. కొత్తవారు ఎలాగైనా పదవిలోకి రావాలని పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీ ఆశావహుల నుంచి లబ్దిపొంది పదవి ఇప్పించే ప్రయత్నం చేశారు. పార్టీ నిబంధనల ప్రకారం మూడు అంతకంటే ఎక్కువ సార్లు పదవిలో ఉన్న వారు కూడా కుర్చీ దిగడానికి ఇస్టపడలేదు. పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు ఎనిమిది సార్లు, కార్వేటినగరం అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు మూడు సార్లు పదవిలో ఉన్నారు. వారు కూడా తిరిగి కొనసాగాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచారు. దీనితో మండల కమిటీల ఏర్పాటు ఎమ్మెల్యేకి తలనొప్పిగా తయారు అయ్యింది. పెనుమూరు, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఒకవర్గంపై మరొక వర్గం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈనెల 25న నాలుగు మండలాల నాయకులు తిరుపతికి వచ్చిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మన్ వర్ల రామయ్యను కలసి ఎన్నికలు ఏకపక్షంగా నిర్వహించేందుకు కుట్ర జరుగుతోందని ఉదాహరణంగా వివరించారు. ఈ నేపధ్యంలో పార్టీ పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడు ఎన్నికల నిర్వహణకు దూరంగా ఉన్నారు. దీనితో ఎన్నికల వాయిదా పడ్డాయి. మహానాడు మొదటి రోజు థామస్ వర్ల రామయ్య తో కలసి నియోజక వర్గం పరిస్తితులను వివరించారు. కొంత మంది పని కట్టుకుని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ నియమానుసారం ఎన్నికలు నిర్వహిస్తే వివాదాలు తలెత్తవని రామయ్య సలహా ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ విధానాలకు అనుగుణంగా మండల సమావేశాలు ఏర్పాటు చేసి, మెజారిటీ కార్యకర్తల మద్దతు ఉన్నవారిని ఎన్నుకోవాలని చెప్పారు. సామాజిక న్యాయం పాటించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని సూచించారు. కాగా చంద్రబాబు నాయుడు కూడా మహానాడు మొదటి రోజు జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. పోటీ లేక పోవడంతో రెండవ రోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను కమిటీ చైర్మన్ వర్ల రామయ్య సభలో ప్రకటించి ధృవీకరణ పత్రం అందించారు. ప్రతినిధుల సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి మండల స్థాయిలో కూడా ఈ విధానం పాటించాలని కొందరు థామస్ కు సూచించినట్టు తెలిసింది. ఏక పక్షంగా ఎన్నికలు జరిగితే అనవసర వివాదాలు తలెత్తుతాయని ఎమ్మెల్యే గ్రహించారు. దీనితో మండల కమిటీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలిసి. ఈ నేపధ్యంలో రెండు రోజులుగా తనను కలసిన ఆశావహులకు హితోపదేశం చేస్తున్నారు. పదవి కావాలని కోరుకునే వారు పోటీ దారులతో మాట్లాడి వారి మద్దతు సమకూర్చుకోవాలని లేదా పోటీకి సిద్ధం కావాలని చెపుతున్నారు. నియోజక వర్గంలో ఉన్న ఆరు మండలాలలో మూడు మండలాలు ఎస్సీ, బిసి వర్గాలకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. నియోజక వర్గంలో అధిక శాతం ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి కనీసం ఒక మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి రెండు మండలాలకు మించి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.
గంగ 1మహానాడులో మండల పార్టీ ఎన్నికల గురించి వర్ల రామయ్యతో చర్చిస్తున్న థామస్ (ఫైల్ ఫోటో)

