5, మే 2025, సోమవారం

బదిలీలకు వికలాంగుల అవతారం ఎత్తుతున్న టీచర్లు

 సదరం క్యాంపులలో జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాలు 

మధ్యవర్తుల సహాయంతో నకిలీ ధ్రువీకరణ పత్రాల సృష్టి 

సదరం క్యాంప్ పత్రాలను దృవీకరిస్తున్న రుయా వైద్యులు 

పునః పరిశీలనకు నిమిత్తం ఉపాధ్యాయ సంఘాల డిమాండ్

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ



విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు బదిలీల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బదిలీల్లో వికలాంగులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండటంతో పలువురు ఉపాధ్యాయులు వికలాంగుల అవతారం ఎత్తుతున్నారు. నిన్న వరకు బాగా ఉన్న ఉపాధ్యాయులు తమకు ఆరోగ్యం బాగాలేదని, వికలాంగులమని ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తున్నారు. సాధారణ ప్రజలకు పింఛన్ల కోసం సర్టిఫికెట్లను జారీ చేయడానికి సదరం శిబిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ శిబిరాలలో ఉపాధ్యాయులు కూడా తమ వికలాంగులమని ధ్రువీకరణ పత్రాలను తెచ్చుకుని, వాటిని విద్యాశాఖ కార్యాలయంలో అందజేస్తున్నారు. సదరం క్యాంపులో ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు ఉపాధ్యాయులకు చెల్లుబాటు కావనీ, ఉపాధ్యాయులు మెడికల్ బోర్డు దగ్గర మాత్రమే ధ్రువీకరణ పత్రాలు తీసుకొని రావాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సదరం క్యాంపులలో తెచ్చిన వికలాంగ ధ్రువీకరణ పత్రాలను అనుమతించవద్దని ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం లోపు ఉపాధ్యాయుల బదిలీలు జరగనున్నాయి. ఇందు నిమిత్తం ఈనెల 25, 26, 27 తేదీల్లో వికలాంగ ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు ముందుగానే ఉపాధ్యాయులు తాము వికలాంగులం అంటూ సుమారుగా 569 మంది ధ్రువీకరణ పత్రాలను డీఈవో కార్యాలయంలో సమర్పించారు. ఉపాధ్యాయుల బదిలీలలో 40 నుండి 50 శాతం వరకు వికలాంగులు అయితే ఐదు పాయింట్లు, 50 నుంచి 70 శాతం వికలాంగులవుతే పది పాయింట్లు, 70 శాతం దాటితే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీంతో నివాసముండే ప్రాంతానికి దగ్గరలో బదిలీలను చేయించుకోవడానికి ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారు. సదరం క్యాంపులలో కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఆంగవైకల్యం లేకున్నా, తాము వికలాంగులమని ధ్రువీకరణ పత్రాలను తెచ్చుకుంటున్నారు. ఇందుకు 10 వేల నుంచి 20 వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. సదరం క్యాంపులలో ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకుని వెళ్లి, ఆ పత్రాలు వాస్తవమని ధ్రువీకరించుకొని వస్తున్నారు. వాస్తవంగా ఉపాధ్యాయుల బదిలీలకు మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రంలో గాని తిరుపతి రుయా ఆస్పత్రిలో కానీ కొన్ని వైద్య పరికరాలు అందుబాటులో లేవు. ఖచ్చితమైన వికలాంగ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రంలో, తిరుపతి రుయా ఆస్పత్రిలో కొంతమంది డాక్టర్లు అవినీతికి పాల్పడి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నారు. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా ఉన్న పాఠశాలలకు బదిలీలు చేపించుకుంటున్నారు. ఇందువల్ల నిజాయితీపరులైన పలువురు ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 569 మంది ఉపాధ్యాయులు తమకు అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆర్తో కింద 169, అంధులు 112, చెవుడు 51, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 43, గుండె సంబంధ వ్యాధులు కలవారు 64, న్యూరో విభాగంలో 47, కిడ్నీ బాగు లేనివారు 36, ఇతరులు 52 మంది తాము వికలాంగులమని ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. వాస్తవంగా వినికిడి శక్తిని నిర్ధారించే పరికరాలు జిల్లా కేంద్రంలోని రుయా ఆసుపత్రిలో లేవు. అయినా వినికిడి శక్తికి సంబంధించి కూడా ఈ డాక్టర్లు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నారు. ఇతర రకాలైన వికలాంగుల అవుతే వాటికి రుజువులు కంటికి కనిపిస్తాయి. చెవుడు అయితే ఎటువంటి ఆధారం కనిపించదు. ఇప్పటివరకు చెవిటి మిషన్ వాడని ఉపాధ్యాయులు కూడా తమకు వినిపించడం లేదంటూ నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి విద్యాశాఖ అధికారులకు అందజేస్తున్నారు. ఈ విషయంలో పునః పరిశీలన అవసరమని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. వికలాంగుల కింద ధ్రువీకరణ పత్రాలు అందజేసిన వారందరిని గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి పునః పరిశీలన చేయాలని కోరుతున్నారు. అలా చేయని పక్షంలో నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు విషయంలో పునః పరిశీలనకు పంపాల్సిన అవసరం ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *