22, మే 2025, గురువారం

జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఆగిన టిడిపి ఎన్నికలు

 ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని అధిష్టానం ఆదేశాలు 

గడువు తేదీ నాటికీ పూర్తికాని ఎన్నికల ప్రక్రియ 

కొన్ని మండలాల్లో గ్రూపుల  గొడవ, ఫిర్యాదుల వెల్లువ  

తమనే కొనసాగించాల ప్రస్తుత అధ్యక్షుల పట్టు 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో టిడిపి మండల కమిటీ ఎన్నికలకు అధిష్టానం బ్రేక్ వేసింది. దీంతో మండల పార్టీ అధ్యక్ష  ఎన్నికలు ఆగిపోయాయి. ఆశావహుల ఒత్తిళ్ళు, వర్గ పోరు వల్ల అనుకున్న సమయానికి కమిటీల ఏర్పాటు చేయలేక పోయారు. మూడు పర్యాయాలు లేక ఆరు సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగిన వారిని తిరిగి కొనసాగించకూడదని టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టి తమను కొనసాగించాలని కొంతమంది మండల పార్టీ అధ్యక్షులు పట్టుబడుతున్నారు. దీర్ఘకాలికంగా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారి మీద స్థానికంగా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కొందరి మీద ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు  అందాయి. ఎన్నికల నేపధ్యంలో కొన్ని మండలాల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకరి మీద మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం కొంతమంది ఉన్నత స్థాయిలో పైరవీల చేస్తుండగా, మరి కొంతమంది భారీ మొత్తాలలో డబ్బులు ముట్ట చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడు థామస్ సకాలంలో స్పందించి గ్రామ, మండల కమిటీ ఎన్నికలను నిర్వహించలేదు. దీంతో మహానాడు వరకు ఎన్నికల ప్రక్రియ ఆపేయాలని అధిస్థానం ఆదేశించినట్టు తెలిసింది. 

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 వ తేదీ లోపల మండల కమిటీలు వేయవలసి ఉంది. అంతలోపలే గ్రామ కమిటీల ఏర్పాటు చేయాలి. దీని కోసం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్, పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడు కలసి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే  సమన్వయ లోపం వల్ల ఇంత వరకు ఒక సమావేశం కూడా నిర్వహించలేదు. ఇప్పుడున్న మండల కమిటీల అధ్యక్షులు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించిన తమను కొనసాగించాలని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు పట్టు పడుతున్నారు. అయితే మూడు సార్లు లేదా ఆరేళ్లు ఒకే పదవిలో ఉన్న వారిని పక్కన పెట్టాలని అధిస్థానం నిర్ణయించింది. అయినా  కొందరు తామే కొనసాగాలని పట్టుపడుతున్నారు. పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు ఇప్పటికి ఎనిమిది సార్లు మండల అధ్యక్షుడుగా పనిచేశారు. ఆయన పట్ల పలువురు వ్యతిరేకంగా ఉన్నారు. కార్వేటినగరం మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, ఎస్ ఆర్ పురం అధ్యక్షుడు జయశంకర్ నాయుడు మూడు సార్లు పదవిలో ఉన్నారు. అయినా ఈ ముగ్గురూ తాము కొనసాగాలని లేదా తాము చెప్పిన వారిని అధ్యక్షునిగా చేయాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. మిగిలిన చోట్ల పాలు రకాల ఒత్తిళ్ళు ఎదురవుతున్నాయి. దీనితో ఎమ్మెల్యే కొంత వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, ఆయన వర్గీయులు ఎమ్మెల్యే ఏకపక్షంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు చేసారు. దీనితో మహానాడు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని అధిస్థానం ఆదేశించినట్టు తెలిసింది.  జూన్ మొదటి వారంలో మండల సర్వ సభ్య సమావేశాలు ఏర్పాటు చేసి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది. గతంలో లాగే అదనంగా మరొక పరిశీలకుడిని నియమించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాగా నియోజక వర్గంలో ఉన్న ఆరు మండలాలలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. పెనుమూరులో ఆశావహులు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు ఎక్కువ సార్లు పదవిలో ఉన్నందున ఆయనకు తిరిగి అవకాశం కల్పించ వద్దని మెజారిటీ నాయకులు కోరుతున్నారు. ఆయనపై పలు ఆరోపణలతో ఫిర్యాదులు చేశారు. మాజీ ఎంపిపి హరిబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైన నాయకులు ఆరు పేర్లతో ఒక ఆశావహుల జాబితా తయారు చేశారు. ఇందులో మాజీ సర్పంచి ఎన్ సుబ్రమణ్యం నాయుడు, ఎల్ ప్రకాశ్ నాయుడు,  ఎస్ సతీష్ రెడ్డి, గుంటుపల్లి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపిపి షణ్ముఘ వర్మ ( బిసి) టి నాగరాజ ( ఎస్సీ) ఉన్నారు. రుద్రయ్య మినహా తమలో ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని అంటున్నారు. వెదురుకుప్పం మండలంలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ మునిచంద్రా రెడ్డి, నియోజక వర్గం యూత్ కోఆర్డినేటర్ కిషన్ చంద్ ( బిసి),మాజీ మండల కమిటీ అధ్యక్షుడు మోహన్ మురళీ ( ఎస్సీ) నువ్వా నేనా అంటున్నారు. కార్వేటినగరం ప్రస్తుత అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్ మూడు సార్లు ఉన్నారు. దీనితో వాసుదేవ రెడ్డి, జనార్దన్ రాజు, తిరుమల నాథ్, రవికుమార్ రంగంలోకి దిగారు. ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు కూడా మూడు సార్లు పదవిలో ఉన్నందున పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఇక్కడ మునివర్ధన్ నాయుడు పైనేని మురళి నాయుడు, రాజశేఖర్ నాయుడు పోటీ పడుతున్నారు. పాలసముద్రం మండల అధ్యక్షుడు  రాజేంద్ర తిరిగి కొనసాగాలని కోరుకుంటున్నారు. మార్చి 21 న జి డి నెల్లూరు సమావేశంలో చంద్రబాబు నాయుడు ఆయనను ప్రశంచించారు. అయితే శివా నాయుడుని అధ్యక్షునిగా చేయాలని ఒక వర్గం పట్టు బడుతోంది. మాజీ ఎంపిపి ఇందిర కూడా పదవి ఆశిస్తున్నారు. జి డి నెల్లూరు మండల అధ్యక్షుడు సామి దాసు తిరిగి కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే మాజీ అధ్యక్షుడు దేవ సుందరం పోటీకి సిద్ధ పడుతున్నారు. ఈ నేపధ్యంలో జూన్ మొదటి వారంలో ఎమ్మెల్యే, పరిశీలకుల నేతృత్వంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని అధిస్థానం భావిస్తోంది. అప్పటి వరకు ఈ సందిగ్ధం కొనసాగుతుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *