విద్యుత్ శాఖ పనితీరుపై ధ్వజమెత్తిన జిల్లా పరిషత్ సభ్యులు
ట్రాన్స్ఫార్మర్లు మార్చడం లేదని, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు
ప్రజా ప్రతినిధులను పట్టించుకోవడంలేదని ఆవేదన
పెండింగ్ బిల్లుల మంజూరుకై సభ్యుల పట్టు
చిత్తూరు, మే 13 (ఆంధ్రప్రభ బ్యూరో): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళ వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పి ఛైర్మన్ అధ్యక్షతన 1 నుండి 7 (ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం విద్యా వైద్యం మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ఆర్థిక మరియు పనుల స్థాయి సంఘాలు సంబంధించిన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం లో జెడ్ పి సి ఈ ఓ రవి కుమార్ నాయుడు, డిప్యూటీ సి ఈ ఓ జుబేదా బేగం ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ మీద జరిగిన చర్చలో సభ్యులు ఆ శాఖ పనితిరుపట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు మార్చడంలో భారీగా జాప్యం జరుగుతుందని, ప్రజాప్రతినిధులైన తాము డోజోక్యం చేసుకున్న అధికారులు పనులు చేయడం లేదన్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం డబ్బులు చెల్లించి సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు కనెక్షన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రామసముద్రం, పిటిఎం, చౌడేపల్లి, వడమల్లపేట, ఏర్పేడు, పెనుమూరు జడ్పిటిసి సభ్యులు విద్యుత్ అధికారుల పనితీరుపైన ఫిర్యాదులు చేశారు. కొందరు అధికారులు ఫోన్ చేసినా, తీయడం లేద,ని సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కలెక్షన్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పెనుమూరు మండలంలో జగనన్న కాలనీకి ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేదన్నారు. విద్యుత్ శాఖ అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ విభాగం సెట్ చేసిన సందర్భంగా పెండింగ్ బిల్లుల పైన సభ్యులు తీవ్రస్థాయిలో నిలదీశారు. గతంలో చేసి పనులకు ఇప్పటివరకు బిల్లులు రాలేదని, ఇలా అయితే పనులు ఎలా చేయాలని నిలదీశారు. నీరు చెట్టు వల్ల బిల్లులు రాలేదని, పైగా జిఎస్టి కట్టాలని నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గోకులాలకు, పంచాయతీరాజ్ విభాగం కింద చేపట్టిన రోడ్ల నిర్మాణానికి బిల్లును రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు బిల్లులు సత్వర మంజూరయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసి నిధులు తెప్పించాలని సమావేశం కోరింది. ఈ సందర్భంగా జెడ్పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు సకాలం లో వైద్య సేవలు అందించేందుకు పి హెచ్ సి లలో డాక్టర్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ప్రజలకు సత్వరమే వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉండాలన్నారు. ఉంటేనే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ దిశగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పనిచేయాలని సూచించారు. స్థాయి సంఘ సమావేశాలలో వివిధ అంశాలపై జరిగిన చర్చలో భాగంగా సభ్యులు చర్చించిన అంశాల పై సంబంధిత శాఖలకు చెందిన అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలిపారు. డిఆర్డిఏ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి నెల 5,60,785 కి పెన్షన్ ల పంపిణీ చేపడుతున్నామని ఏప్రిల్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు రూ.2,585 కోట్లు పంపిణీ చేశామని, 2024- 25 సంవత్సరానికి బ్యాంక్ లింకేజీ ద్వారా 29,426 మందికి రూ.2970 కోట్లు, స్త్రీ నిధి ద్వారా 67,535 స్వయం సహాయక సభ్యులకు రూ.427.92 కోట్లు పంపిణీ చేశామని డి ఆర్ డి ఏ అధికారులు సభకు వివరించారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మాణాలు చేపట్టిన 1,54,314 గృహాలకు గానూ 92,245 గృహ నిర్మాణాలు పూర్తి చేయడమైనదని, గృహ నిర్మాణాలకు రూ.2100.28 కోట్లు ఖర్చు చేశామని, 847 లే ఔట్లకు రూ.102 కోట్ల వ్యయం తో నీటి వసతి కల్పించామని గృహ నిర్మాణ శాఖ పి డి వివరించారు. 2024-25 వ విద్యా సంవత్సరానికి గానూ ఉమ్మడి జిల్లాలో 4,737 పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం లో భాగంగా 2,85,900 మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహార భోజనం అందిస్తున్నామని డి ఈ ఓ తెలిపారు. ఎన్ టి ఆర్ వైద్య సేవ ద్వారా ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు 35905 మందికి చికిత్స లు చేశామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ ద్వారా రూ.19 కోట్ల తో 3480 సి సి రోడ్ ల నిర్మాణ పనులను ప్రారంభించి 2913 పనులు పూర్తి చేశామని, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.18 కోట్లతో 23 పనులు మంజూరు చేశామని పంచయతీ రాజ్ ఎస్ ఇ సభకు వివరించారు. గ్రామీణ నీటి పారుదల శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో జల్ జీవన మిషన్, యం పి ల్యాడ్స్, జెడ్ పి పనులు మొత్తం 5880 పనులు మంజూరు చేసి రూ.17.15 కోట్లతో 4,213 పనులు పూర్తి చేశామని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు సభకు వివరించారు. జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగు నీటి సమస్యను అధిగమించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారులు భవనముల శాఖ ద్వారా జిల్లాలో గుంతలు పూడ్చే కార్యక్రమం కింద రూ. 20.96 కోట్ల తో 289 పనులు మంజూరు కాగా 284 పనులు పూర్తి చేయడం జరిగిందని, ఎం డి ఆర్ ప్లాన్ కింద 42 పనులు రూ.26.53 కోట్లతో మంజూరు కాగా పనులు పూర్తి చేయడం జరిగిందని ఆర్ అండ్ బి అధికారులు వివరించారు. వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా 2024 - 25 సంవత్సరానికి గాను మార్చి 25 నందు 2,867 వ్యక్తిగత వ్యవసాయ పనిముట్ల ను 5.5 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని,ఇందులో ఇప్పటి వరకు 2,377 పనిముట్ల కు 3.79 కోట్ల సబ్సిడీతో 2,377 మంది రైతులకు అంద జేయడం జరిగిందని వ్యవసాయ అధికారి సభలో వివరించారు. ఉద్యానవన శాఖ ద్వారా ఉద్యాన పంటల విస్తరణ పథకం కింద 40 శాతం రాయితీ తో మామిడి, దానిమ్మ, అరటి,బొప్పాయి,అవకోడా, తదితరుల పంటసాగు విస్తీర్ణం పెంచడానికి రాయితీ అందించడం జరుగుతున్నదని, సామూహిక వ్యక్తిగత పంటకు పంటలకు 50 శాతం రాయితీపై నీటి వసతి ని కల్పించడం జరుగుతుందని, మామిడి కాయల నాణ్యత పెంచడానికి కవర్లు అందజేస్తున్నామని ఉద్యాన శాఖ అధికారి వివరించారు. ఈ సమీక్షలో భాగంగా అన్ని శాఖలకు చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అధికారులు తప్పక హాజరు కావాలని చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖలకు చెందిన జిల్లా అధికారులు పిఆర్, ఆర్ డబ్ల్యు ఎస్ ఈ లు చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్,డ్వామా పిడి రవికుమార్, హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, డీఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణ, ఐసిడిఎస్ పిడి వెంకటేశ్వరి, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పో రై గంగ 1 జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొన్న చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ
గంగ 2 సమావేశానికి హాజరైన సభ్యులు, జిల్లా అధికారులు

