22, మే 2025, గురువారం

జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి

మామిడికి గిట్టుబాటు ధర కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది 

ముఖ్యమంత్రి దృష్టికి మామిడి రైతుల సమస్యలు

మామిడి ధరల నేతన్న పై సమావేశం

చిత్తూరు, మే 22 (ఆంధ్రప్రభ బ్యూరో) : జిల్లాలో మామిడి బోర్డ్ ఏర్పాటుకు కృషిచేస్తున్నామని చిత్తూరు పార్లమెంటు  సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు వెల్లడించారు. గురువారం జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండించే తోతాపురి మామిడి కి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో, ప్రాసెసింగ్ కంపెనీల యజమానులతో చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  చిత్తూరు పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు,నగరి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్,కె . మురళీ మోహన్, గాలి భాను ప్రకాష్, చిత్తూరు,తి రుపతి అన్నమయ్య జిల్లాల జాయింట్ కలెక్టర్లు జి .విద్యాధరి, శుభం బన్సల్ ఆదర్శ రాజేంద్రన్, చుడ చైర్పర్సన్ కటారి హేమలత లతో కలసి చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులుప్రసాదరావు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు అధికంగా ఉన్నదని ఇందులో ప్రధానంగా ప్రాసెసింగ్ కు అవసరమైన తోతాపురి రకం ఎక్కువగా పండించడం జరుగుతుందన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.  జిల్లాలో మామిడి బోర్డ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సంబంధిత శాఖలకు అందించడంతోపాటు కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. రైతులు ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు ఇద్దరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. యూరోపియన్ దేశాలలో మామిడి ఎగుమతికి సమస్య కలదని ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు తెలుపగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్య కలదన్నారు. యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసే మామిడి గుజ్జు, జ్యూసులపై దిగుమతి సుంకం తగ్గింపునకు మినిస్టర్ ఆఫ్ కామర్స్ వారికి కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కలిచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల కష్టాలు తెలిసిన వారని రైతుల కష్టం తీర్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటారన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డ్ ఏర్పాటుకు కృషి చేస్తున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.   ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ మామిడి గుజ్జు,జ్యూస్ లపై జిఎస్టి ఎత్తివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు యూరోపియన్ దేశాలలో వేస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మామిడి సీజన్ లో తోతాపురి రకానికి సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. తోతాపూరి మామిడి రకానికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రైతులతో పాటు ప్రాసెసింగ్ పరిశ్రమల వారు కూడా పరిశ్రమలు నిర్వహించేందుకు అనుగుణంగా ఇద్దరికీ సామరస్యంగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. అందరి సహకారంతో ముందుకు  వెళ్తామన్నారు.  చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ మాట్లాడుతూ తోతాపూరి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రాసెసింగ్ కంపెనీల యజమానులతో చర్చించి ముందుకు వెళ్దాం అన్నారు.  పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తోతాపూరి మామిడి  రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో మామిడిపై అధ్యాయనం చేసే దిశగా చర్యలు చేపట్టాలని, మామిడి సీజన్ వచ్చినప్పుడు మాట్లాడడం కాకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దూర దృష్టితో సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా కృషి.జరగాలన్నారు. నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ మామిడి రైతులు తోతాపూరి రకం తో పాటు ఇతర వెరైటీల సాగుపై దృష్టి పెట్టడం లేదని ఆ దిశగా రైతులు ఆలోచించాలన్నారు. పండించే పంటను ఎగుమతి చేసేందుకు ప్లాంట్ రేడియేషన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రైతు నాయకులు బాంగాటి గోపాల్ రెడ్డి హరికృష్ణ రెడ్డి పద్మనాభ నాయుడు ఆనంద నాయుడు దొరబాబు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి రకానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. మామిడి పంటను ప్రోత్సహించిన ప్రభుత్వం ఈ పంట మార్కెటింగ్ అంశంపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. ఉపాధి హామీ పథకం ను మామిడి రైతులకు అనుసంధానం చేయాలని కోరారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దాని అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగం పర్యవేక్షించాలన్నారు. మామిడి జ్యూస్ ను స్థానిక ఆలయాలలో అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ కంపెనీలలో  ఇప్పటికే ఎక్కువగా గుజ్జుకు నిల్వలో కలదని, మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందని ఇందుకు అనేక కారణాలు కలవని డొమెస్టిక్ మార్కెట్ లో వినియోగదారులు ఆలోచనపై ఈ అంశం ఆధారపడి ఉందని వినియోగదారులు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ పట్ల ఆకర్షితులు కావడం మామిడిలో షుగర్ లెవెల్స్ ఉన్నాయని ఉద్దేశంతో వీటి వాడకం తగ్గుతున్నదని ఈ అంశం ప్రాసెసింగ్ కంపెనీల వారిని ఆందోళనకు గురి చేస్తుందని చర్చ కార్యక్రమంలో తెలిపారు. దశల వారీగా కోతలు కోయడం ద్వారా ప్రాసెసింగ్ కంపెనీల వారు కూడా రైతులకు సరైన ధర అందించేందుకు అవకాశం కలగని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె .మోహన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు తిరుపతి, అన్నమయ్య జిల్లాల ఉద్యాన శాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి,ద శరథ రామి రెడ్డి, రవి చంద్ర బాబు, మామిడి రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

పో రై గంగ 3 సమావేశంలో ప్రసంగిస్తున్న జిల్లా కలెక్టర్ 

సమావేశానికి హాజరైన రైతు ప్రతినిధులు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *