22, మే 2025, గురువారం

కుంకి ఏనుగులతో అడవి ఏనుగుల అల్లరికి చెక్

జిల్లాకు చేరిన నాలుగు కుంకి ఏనుగులు 

పలమనేరులో బస ఏర్పాటు చేసిన అధికారులు

20ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంరక్షణ కేంద్రం

పవన్ కళ్యాణ్ ఆలోచనతో ప్రజలకు, పంటలకు రక్షణ  

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

చిత్తూరు, తిరుపతి  జిల్లాల్లో అడవి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో విస్తరించి ఉన్న అడవులే ఇందుకు కారణం. గుంపులు గుంపులుగా పంటల మీద, ప్రజల మీద దాడులు చేస్తున్నాయి. అప్పుడప్పుడు గ్రామాల మిద కూడా పడుతున్నాయి. దీంతో  ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పంటలకు నష్టం కూడా వాటిల్లుతోంది. రాష్ట్రంలో తరచూ ఎదురవుతున్న ఏనుగుల దాడుల సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది.  20 ఏళ్లుగా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చలు జరిపి ఏపీకి తీసుకువచ్చారు. కర్ణాటక రాష్ట్రం నుండీ తెచ్చిన 6కుంకీ ఏనుగుల్లో నాలుగు ఏనుగు లను పలమనేరు సమీపం మొసలిమడుగు వద్ద సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంరక్షణ కేంద్రంలో ఉంచారు.  వాటిని అన్నిరకాలుగా కంటికి రెప్పలా సంరక్షణ చేయడానికి పూర్తిగా తర్ఫీదు పొందిన సిబ్బందిని ఏర్పాటు చేశారు. వాటికి ప్రత్యేక స్విమ్మింగ్ పూల్, సరిపడా మేత, వాటిని ప్రతిరోజూ  తిప్పడానికి ట్రాక్ తదితర ఏర్పాట్లను ప్రభుత్వ ఆదేశాలు మేరకు సిద్ధం చేశారు. గ్రామస్తులపై,పంట పొలాలపై దాడిచేసే ఏనుగు లను ప్రత్యేక తర్ఫీదు పొందిన ఈ ఏనుగుల ద్వారా వాటిని నియంత్రించే ప్రక్రియకు సిద్దం చేయనున్నారు. రెండు నెలల పటు కర్ణాటక నుండి వచ్చిన మావటిలు జిల్లాకు చెందిన మావటిలకు కుంకి ఏనుగులను అదుపు చేయడం మీద శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి అయిన తరువాత కుంకి ఏనుగులను రంగంలోకి దించుతారు. 


కుంకీ అనే ప‌దం ప‌ర్షియ‌న్ భాష‌లోని కుమాక్ నుంచి వ‌చ్చిన‌ట్టు చెబుతారు. దీన‌ర్ధం స‌హాయం అని. బెంగాల్ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కూ ఈ ప‌దాన్నే ఎక్కువ‌గా వాడుతున్నారు. కుమ్కి, కూంకి లేదా కుంకి అంటే శిక్షణ పొందిన ఏనుగు అని అర్థం. అడవి ఏనుగులను ట్రాప్ చేయడం, దారి మళ్లించడంలో కుంకి ఏనుగులు సహకరిస్తాయి. దీంతో పాటు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి, వైద్య చికిత్స అందించడానికి ఇవి ఉపయోగ పడుతాయి. అడవి నుంచి తప్పిపోయి లేదా ఆహారం కోసం పంటలపైకి దాడులకు వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించే ప్రయత్నంలో కుంకీ ఏనుగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏనుగులను తరమికొట్టడంలో వాటితో పోరాడడంలో కుంకీలు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటాయి. ఇలాంటి శిక్షణ పొందిన ఏనుగులు ఇప్పటికే ఎన్నో అడవి ఏనుగులను అడ్డుకున్నాయి. సహజంగా ఆడ ఏనుగులు మందలుగా, మగ ఏనుగులు ఒంటరిగా సంచరిస్తుంటాయి. ఆడ ఏనుగులు ఎప్పుడూ తమ పిల్లలతోపాటూ ఒక పెద్ద మందలోనే కొనసాగుతుంటాయి. అందుకే ఒంటరిగి తిరిగే మగ ఏనుగులను బంధించి వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి కుంకీలుగా తీర్చిదిద్దుతారు. పలుమార్లు పంటలు ధ్వంసం చేయడంతో పాటు మనుషులకు హాని తలపెట్టిన మగ ఏనుగులనే ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఏనుగుల మంద పొలాలపై దాడి చేసినపుడు అటవీ అధికారులు కుంకీ ఏనుగులను తీసుకెళ్తారు. దీంతో వాటి వల్ల మందలోని పిల్లలకు నష్టం జరగకుండా ఏనుగుల మంద పారిపోతుంది. అయితే ఒంటరిగా దాడి చేసే మగ ఏనుగులు ఒక్కోసారి కుంకీలపై పోరాటానికి దిగుతాయి. రెండింటి మధ్య జరిగే పోరాటం గంటల పాటు జరుగుతుంది. ఈ మేరకు సుశిక్షితులైన మావాటీలు కుంకీలను ముందుగానే సిద్ధం చేస్తుంటారు.  కొన్ని సార్లు గాయ‌ప‌డ్డ అడ‌వి ఏనుగుల‌ను ర‌క్షించ‌డానికి, ఏదైనా ఉచ్చులో చిక్కిన అడ‌వి ఏనుగుల‌ను ర‌క్షించి.. వైద్య ప‌రీక్ష‌లు అందించ‌డానికి కూడా ఈ ఏనుగులను ఉపయోగిస్తారు. అడ‌వి ఏనుగుల‌ను బంధించ‌డానికి, శాంతింప చేయ‌డానికి, మంద‌ను మేప‌డానికి, సంఘ‌ర్ష‌ణాత్మ‌క ప‌రిస్థితుల్లో అడ‌విలోంచి వ‌చ్చిన ఏనుగుల‌ను తిరిగి అడ‌విలోకే పంప‌డానికీ కుంకీ ఏనుగుల‌ను ఒక అంకుశంలా వాడుతారు.   ఏనుగును మావటి అంకుశం ద్వారా కంట్రోల్ చేస్తాడు. అవి మావ‌టి ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొంది ఉంటాయి కాబ‌ట్టి అత‌డి అంకుశానికి అవి లోబ‌డి ప్ర‌వ‌ర్తిస్తాయి. అదే అడ‌వి ఏనుగులు అలాక్కాదు. అవి ఎవ‌రి మాట విన‌వు. ముల్లును ముల్లుతోనే తీయాలి. వ‌జ్రాన్ని వ‌జ్రంతోనే కోయాల‌న్న‌ట్టు అలాంటి ఏనుగుల‌ను సాటి ఏనుగుతోనే కంట్రోల్ చేయ‌డాన్నే కుంకీ ఏనుగు అంటారు. వీటికంటూ ప్ర‌త్యేక శిక్ష‌ణ ఉంటుంది. సాధారణంగా భార‌త‌దేశంలో ఏనుగుల‌ను ఆల‌యాల్లో దైవ సేవ‌ల కార్య‌క్ర‌మాల‌కే ఎక్కువ‌గా వినియోగిస్తారు. త‌ర్వాత స‌ర్క‌స్ లో ఎక్కువ‌గా వాడుతారు. కానీ కుంకీ ఏనుగుల రూటే స‌ప‌రేటు. వీటిని సైనికుల్లా తీర్చి దిద్దాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎదుర్కోబోయేది మ‌నుషుల‌ను కాదు సాటి ఏనుగుల‌ను. అస‌లే అడ‌వి ఏనుగులు మ‌ద‌మెక్కి ఉంటాయి. ఆ గ‌జ‌బ‌లాన్ని ఢీకొట్టాలంటే అందుకు త‌గిన విధంగా ఈ ఏనుగు సైతం అంతే ధీటుగా ఉండాలి. ఆ దిశ‌గా వీటిని తీర్చిదిద్దుతారు. అడ‌వి ఏనుగులు జ‌నావాసాల్లోకి, వారి పంట పొలాల్లోకి ప్రవేశించిన‌పుడు.. వాటిని త‌ర‌మికొట్ట‌డానికి కుంకీల‌ను వాడుతారు. అడ‌వి ఏనుగుల‌కు కుంకీ ఏనుగుకు మ‌ధ్య ప్ర‌త్య‌క్ష సంబంధాలు లేక పోయినా ఆ ఏగుల అరుపుల‌తో కూడిన‌ భాష‌ను ఈ ఏనుగు ఇట్టే ప‌సిగ‌ట్టి వాటికి త‌న మావ‌టి ఇచ్చే హెచ్చ‌రిక‌లను జారీ చేసి పొలాల్లోకి రాకుండా  చేస్తుంది. కొన్ని ఏనుగులు త‌మ మావ‌టి నుంచి వ‌చ్చే పాదాల ఆదేశాల‌ను అనుస‌రించి మొత్తం ఆప‌రేష‌న్లో నిశ్శ‌బ్ధంగానే ఉంటూ అడవి ఏనుగుల‌ను త‌రిమికొట్టేలా ట్రైనింగ్ ఇస్తారు. ఇలా శిక్షణ ఇచ్చిన ఏనుగులను అడవి ఏనుగులు పంట పొలాల మీద, గ్రామాలలో దాడులు చేస్తే వాటి మీద ప్రయోగిస్తారు. ఇవి చాకచక్యంగా వాటిని అడవిలోకి పంపిస్తాయి. ఫలితంగా పంట నష్టం భారీగా తగ్గే అవకాశం ఉంది. గ్రామాల మీద పడి బీభత్సం సృష్టించకుండా అదుపు చేయవచ్చును. పవన్ కళ్యాణ్ ఆలోచన కారణంగా చాలా కాలం తర్వాత చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిల నుంచి పంటలను, ప్రజలను కాపాడే అవకాశం లభించింది. 

గంగ 1 కుంకి ఏనుగులు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *