అస్తవ్యస్తంగా జిల్లా సమీక్ష మండలి సమావేశం
వేదిక మీద టిడిపి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్
సమావేశపు మందిరంలో టిడిపి కార్యకర్తలు, అర్జిదారులు
విలేకరులకు అజెండా ప్రతులు కూడా కరువే
చిత్తూరు బ్యూరో, ఆంధ్రపభ.
చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం అస్తవ్యస్తంగా జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, ఆర్జీదారులు కూడా పాల్గొన్నారు. వేదిక మీద పుంగనూరు నియోజకవర్గంలో నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చల్లా రామచంద్రారెడ్డి ఆశీనులయ్యారు. ఇది చూసిన జిల్లా అధికారులు, పత్రికా విలేకరులు అవాక్కయ్యారు. ఇది పార్టీ కార్యక్రమమా? ప్రభుత్వ కార్యక్రమమా ? అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సమీక్ష మండలి సమావేశంలో జిల్లాలోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, సహకార రంగానికి చెందిన చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగుతుంది. సభ్యులు అడిగే ప్రశ్నలకు జిల్లా అధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎవరు పాల్గొనడానికి అవకాశం లేదు. కేవలం ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పత్రికా విలేకరులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనాలి. అందుకు భిన్నంగా మంగళవారం జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి వేదిక మీద కూర్చున్నారు. చిత్తూరు, పూతలపట్టు శాసనసభ్యులతో పాటు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అనుచరులు కూడా సమావేశ మందిరంలో కురుచున్నారు. అలాగే వారి పీఆర్వోలు, వ్యక్తిగత సిబ్బందికూడా అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా సమావేశంలో ప్రభుత్వ విభాగాల అధిపతులు మాత్రం పాల్గొంటారు. అయితే అందుకు భిన్నంగా ఒక్కొక్క విభాగం నుంచి ఐదారు మంది సిబ్బంది ఈ సమావేశానికి హాజరయ్యారు. చివరకు విలేకరులు కూర్చోవడానికి సీట్లు కూడా లేకుండా పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందితో సమావేశము గది నిండిపోయింది. సాధారణంగా విలేకరులకు ముందు వరుసలో సీట్లను కేటాయిస్తారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆఖరి వరుసలో విలేకరులకు సీట్లను కేటాయించారు. తగినంత తగినన్ని సీట్లు కూడా లేకపోవడంతో పలువురు విలేకరులు సమావేశం ముగిసే వరకు నిల్చుకునే ఉండాల్సి వచ్చింది. సాధారణంగా సమీక్షా సమావేశంలో పత్రిక విలేకరులకు అజెండా కాపీలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. మంగళవారం జరిగిన డిఆర్సి సమావేశంలో అజెండా ప్రతులను ఇవ్వలేదు. అదేమంటే జిల్లా కలెక్టర్ పొదుపు చేయమంటున్నారని, ప్రజాప్రతినిధులకు మాత్రమే అజెండా కాపీలు అందజేస్తున్నామని జిల్లా అధికారులు అంటున్నారు. విలేకరులకు ఎజెండా ప్రతులు ఇస్తే, ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందో !
పో రై గంగ 7 జిల్లా సమీక్షా కమిటీ సమావేశపు వేదిక మీద చల్లా రామచాచంద్రా రెడ్డి

