గిరిజనుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
జిల్లాలో 20 గిరిజన గ్రామాలను ఎంపిక చేయాలని ఆదేశాలు
21 నుంచి మూడు రోజులు ఐఏఎస్ అధికారులు గిరిజన తండాల్లో నిద్ర
వారి సమస్యలు తెలుసుకుని అభివృద్ధికి ప్రణాళికలు
చిత్తూరు బ్యూరో ఆంధ్రప్రభ
ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజాప్రతినిధులు మారుతున్నారు. గిరిజనుల తలరాతలు మారడం లేదు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నేటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చట్టాలు రూపొందించినా, నిరక్షరాస్యత, అవగాహన లోపంతో అవి సక్రమంగా అమలు కావడం లేదు. భారత రాజ్యాంగం వారికి విద్య, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని, గిరిజనుల్లో మరింత వెనుకబడిన తెగలను ప్రత్యేక సమస్యాత్మక గిరిజన తెగలుగా గుర్తించాలని నిర్దేశించింది. ఈ మేరకు జిల్లాలో ఎరుకల, యానాది, సుగాలి, నక్కల తదితర కొండ తెగలను వెనుకబడిన కూలాలుగా గుర్తించారు. కానీ వారికి విద్య, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు మాత్రం అంతంతమాత్రమే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. చిత్తూరు జిల్లాలో 20 గిరిజన గ్రామాలను ఎంపిక చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిని కోరింది. ఈ గ్రామాలలో ఈనెల 21వ తారీకు నుంచి మూడు రోజులపాటు అఖిలభారత అధికారులు పల్లె నిద్ర చేస్తారు. మూడు రోజులపాటు వారితో గడిపి వారి సమస్యలను తెలుసుకుంటారు. రెండు రాత్రులు వారితోనే నిద్ర చేస్తారు. వారి సమస్యలు తెలుసుకుని, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు.
చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఎరుకల, యానాది, సుగాలి, నక్కల అనే గిరిజన తెగలు నివసిస్తున్నాయి. యానాదులు జిల్లాలోని అన్నిమండలాల్లో ఉన్నారు. వీరు ఎలుకలు, ఉడుతలు, పాములు వంటి వాటిని పట్టడంలో నిష్ణాతులు. ఎరుకల, యానాది, సుగాలి, నక్కల గిరిజనులు కూడా జిల్లాలో నివసిస్తున్నారు. వీరు కండరాల నొప్పులు, వాపుల చికిత్స కోసం సాంప్రదాయకంగా ఉపయోగించే ఔషధ మొక్కల గురించి అవగాహన కలిగి ఉన్నారు.యానాదులు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తారు. వీరు వేట, సేకరణ, వ్యవసాయం వంటి వృత్తులను ఆచరిస్తారు. చెంచులు శేషాచలం కొండల ప్రాంతంలో నివసిస్తారు. వీరు సాంప్రదాయకంగా ఔషధ మొక్కలను ఉపయోగించి కండరాల నొప్పులు, వాపులకు చికిత్స చేస్తారు. నక్కల తెగ వారు ఔషధ మొక్కలను ఉపయోగించి సాంప్రదాయ వైద్యం చేస్తారు. గిరిజన తెగల జీవనంను పరిశిలేస్తే, గిరిజన తెగలు అటవీ ఉత్పత్తులను వారి జీవన అవసరాలకు ఉపయోగిస్తారు. అటవీ ఉత్పత్తులు, వేర్లు, దుంపలు, ఆకులు, పండ్లు, మూలికలు వంటివి వారి ఆహారం, మందులు, ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. వేట, సేకరణ, వ్యవసాయం, పశువుల పెంపకం వంటి వృత్తులను అనుసరిస్తారు. మహిళలు ఎక్కువగా వ్యవసాయ పనులను చేస్తారు, వాటిలో నేలను సిద్ధం చేయడం, విత్తనాలు విత్తడం, పెరుగుతున్న మొక్కలను చూసుకోవడం మరియు ధాన్యాన్ని కోయడం వంటివి ఉంటాయి. గిరిజన తెగలు తమ సంప్రదాయాలను, నమ్మకాలను కాపాడుకుంటారు. వాటిని తదుపరి తరాలకు వారసత్వ సంపదగా బదిలీ చేస్తారు. గిరిజన సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. గిరిజన పిల్లలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజన కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన రాజ్యాంగ చట్టాలు కొంతమందికి తెలియక ఇంకా వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థానిక సంస్థలు, పెసా చట్టం, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ, రుణవడ్డీ, వ్యాపార నిబంధననలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు అత్యాచార నిరోధక చట్టం రూపొందించినా అవగాహన లేక అమలుకు దూరమవుతున్నాయి. గిరిజన ఉప ప్రణాళిక విధానం సక్రమంగా అమలు కావడం లేదు. గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధితోపాటు వివిధ రకాల దోపిడీ నుంచి కాపాడుకునేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా, ఆ నిధులు వారికి వినియోగించకుండా గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. గిరిజనులు అప్పు తీసుకున్నా వడ్డీ కింద ఏడాదికి 24శాతం మించి తీసుకుంటే కేసులు నమోదు చేయవచ్చని 1917లో చట్టం చేశారు. కానీ వ్యాపారులు అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా 1979లో వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఈ కార్పొరేషన్ నిధులు సక్రమంగా అందక గిరిజనులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికీ రహదారి సదుపాయాలు లేని గిరిజన గ్రామాలకు విద్య, వైద్యమే కాదు రక్షిత తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారు. గిరిజన తండాలలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా వెళ్లడం లేదు. చదవుకున్న స్థానిక యువతకు నెలకు కొంత మొత్తం చెల్లించి వాలంటీర్లుగా పెట్టుకుంటున్నారు. మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటున్నాయి. అక్కడకు గిరిజన బాలలందరూ వెళ్లలేని దుస్థితి. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 2014 -2019 లో టీడీపీ సబ్‌ప్లాన్ నిధులను అందించింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ఈ నిధులను వేరే విధంగా మళ్లించింది. దీంతో గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. గిరిజనులు మేకలు, గొర్రెల కొనుగోలుకు రూ.10వేల వరకు అందించిన సహాయాన్ని సైతం వైసీపీ ఆపేసింది. దీంతో గిరిజన గ్రామాల ప్రగతి ఆగిపోయింది. వారు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని గ్రామాలలో తాగడానికి నీటి సౌకర్యం కూడా లేదు. బావుల నుంచి నీటిని తోడుకొని వాడుకుంటున్నారు. విద్యుత్ అంటే తెలియని గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు వారికి అందడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించి గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు నిమిత్తం చిత్తూరు జిల్లాలో 20 గిరిజన గ్రామాలను ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన గ్రామాలలో మూడు రోజులపాటు ఐఏఎస్ అధికారులు గిరిజనులతో కలిసిమెలిసి జీవనం చేయనున్నారు. వారితోనే నిద్రించి వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించనున్నారు. దీనిమీద ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి చిత్తూరు జిల్లాలో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయనుంది.
ఫొ రై గంగ 1. గుడిపాల మండలం చిత్తపార పంచాయతీ రాయల్ చెను ఎస్ టి కాలనీలోని యానాదులు
గంగ 2 పెనుమూరు మండలం సామిరెడ్డి పల్లి ఎస్టీ కాలనీ వాసులు
గంగ 3 చిత్తూరు మండలం మాపాక్షి పంచాయతీ, జివి కాలనీలోని నక్కల తెగ

