6, మే 2025, మంగళవారం

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పై నివేదిక కోరిన డి ఆర్ సి సమావేశం

ఆస్పత్రి పనితీరుపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి 

ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడం లేదని ఆవేదన 


చిత్తూరు, మే 6 (ఆంధ్రప్రభ బ్యూరో): చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఆసుపత్రి పనితీరు, ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం అమలు  సంబంధించి సమగ్ర నివేదికను అందజేయాలని డి సి హెచ్ ఎస్ ను జిల్లా సమీక్షా కమిటీ సమావేశం కోరింది. అపోలో యాజమాన్యం తొలుత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలేదని సమావేశం అభిప్రాయపడింది. మంగళవారం జిల్లా సచివాలయంలో జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జిల్లా  సమీక్ష కమిటీ  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పని తీరు పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరైన చికిత్స అందక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు దుర్గ మృతి చెందడాన్ని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంగా వర్ణించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్సలు జరగడంలేదని, తొలుత రాష్ట్ర ప్రభుత్వంతో  కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అవసరమైన పరికరాలను సమకూర్చలేదని తెలిపారు. దేనికి తోడు ఆసుపత్రి వైద్యులు కేసులను రెఫర్ చేస్తున్నారని, సరైన చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో అపోలో యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పరికరాలను అమర్చారా ? వైద్యం చేస్తున్నారా ? అన్న విషయమై ఒక నివేదికను అందజేయాల్సిందిగా కోరారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించకపోతే ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒక ప్రముఖ నాయకుని కుమార్తెకే అలా జరిగితే, సామాన్య ప్రజల మాట ఏమిటంటే ఎమ్మెల్యే నిలతిశారు. గంగాధర నెల్లూరు నుండి చిత్తూరు వైపుగా తిరుపతికి వెళ్ళే భారీ వాహనాలు కట్టమంచి చెరువు వైపుగా వెళితే చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉండవని, ఈ రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. పూతలపట్టు ఎం ఎల్ ఏ కె.మురళీమోహన్ మాట్లాడుతూ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. చిత్తూరు మామిడి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మామిడి పంటకు సంబంధించి పండించే సమయంలో వాతావరణ పరిస్థితుల నుండి అంతర్జాతీయ మార్కెటింగ్ విధానం వరకు అభివృద్ధి చెందేలా పరిశోధనా కేంద్రం చిత్తూరు జిల్లాకు అవసరం అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం లో ప్రతి కుటుంబం మామిడి పంట పై ఆధార పడి జీవిస్తున్నారని, మామిడికి గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవలన్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పల్ప్ అందజేసేలా కృషి చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులకు మామిడి పండ్ల జ్యూస్ అందించేలా చర్యలు తీసుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. యాదమరి, తవణంపల్లి మండలాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులకు సూచించారు.  ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలను సమర్థవంతంగా నిర్వహించి భూగర్భ నీటి మట్టం పుష్కలంగా ఉండేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో అత్యధిక ప్రమాదాలు జరిగే సామాజిక ఆరోగ్య కేంద్రం పి. కొత్త కోట వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం  కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని, ఈ శాఖ పరిధిలో ఉన్న పి హెచ్ సి, సి హెచ్ సి ప్రతి ఆసుపత్రి వారీగా ఇన్ పేషెంట్ ల వివరాలు, ఓ పి వివరాలు సమగ్రం గా చర్చించి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం అయ్యేలా వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ నరేగా, ఎం పి ల్యాడ్స్ నిధులతో అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల పై దృష్టి పెట్టాలన్నారు.  వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువులు, సప్లయ్ ఛానల్ లలో మరమ్మత్తులు, పూడిక తీత పనులు చేపట్టాలని కోరారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ కింద వైద్య ఆరోగ్య శాఖకు మంజూరైన నిధులతో సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయనని కోరారు. జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల భవన నిర్మాణ పరిస్థితులు, సిబ్బంది వివరాలు, కేటాయించిన నిధులు వాటి వినియోగం సంబంధించిన సమగ్ర సమాచారం అందించాలని డి ఎం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు. తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను జెడ్పి సిఈఓ ను ఆదేశించారు. మామిడి దిగుబడి జిల్లాలో అధికంగా ఉన్నందున ప్రొసెసింగ్ కంపెనీల వారి వద్ద ఉన్న పల్ప్ ఎగుమతి విషయమై సంబంధిత శాఖతో చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ దాదాపు 70 వేల హెక్టార్లలో మామిడి పంట ఉందని, ఒక హెక్టారుకు 3 నుండి 3.5 టన్నుల పంట దిగుబడి వస్తుందన్నారు. దీని ప్రకారం 5.5 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మామిడి గిట్టుబాటు ధర ప్రస్తుతం ఒక టన్నుకు రూ.25 వేల వరకు ఉందన్నారు. మామిడి రైతులకు ఫుడ్ ప్రొసెసింగ్   యూనిట్ల నుండి ప్రోత్సాహకాలు అందేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. జిల్లాలో మామిడి దిగుబడి అధికంగా ఉన్నందున పల్ప్ ను టిటిడి ద్వారా భక్తులకు అందజేసేలా అందరి ప్రజా ప్రతినిధుల సహకారంతో టిటిడి వారికి లేఖ పంపి వారు సూచించే నాణ్యతా ప్రమాణాలు, ధరలు సంబంధిత అంశాల పై చర్చించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీలో ప్రజా ప్రతినిధులు మామిడి రైతులను కూడా భాగస్వామ్యం చేసేందుకు టిటిడి ద్వారా కమిటీ నియామకానికి చొరవ చూపాలని కోరారు. జిల్లాలో ఈ నెల 4 వ తేదిన కురిసిన వర్షానికి జరిగిన పంట నష్టం నకు  సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల ద్వారా సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపాలిటీ లలో మరియు పంచాయతీలలో కేటాయించిన నిధులను అధిక భాగం తాగునీటి సమస్య పరిష్కారానికి కేటాయించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జెడ్పి సిఈఓ, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు రానున్న నెల రోజుల్లో త్రాగు నీరు, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వైద్య నిపుణుల సంఖ్య పెరగవలసి ఉన్నదన్నారు. పారా మెడికల్ సిబ్బంది 160 మంది వరకు ఉన్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్స్ తగ్గాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అత్యవసర వైద్య సేవల కొరకు సిఎంసి, స్విమ్స్ ఆసుపత్రులకు వెళ్ళనవసరం లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలని అపోలో యాజమాన్యం కు సూచించామన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో చేపట్టాల్సిన మౌలిక వసతులు, మౌలిక వసతులకు సంబంధించి డి సి హెచ్ ఎస్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. కాణిపాకం ప్రముఖ పుణ్య క్షేత్రం అయినందున ఈ ప్రాంతం లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ బి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి,  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు ఉద్యమ స్ధాయిలో చర్యలు చేపట్టాలని కోరారు. చిత్తూరు జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. మామిడి రైతుల సమస్యలకు పరిష్కారం చూపడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా జిల్లా యంత్రాంగంతో కలసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పి జి ఆర్ ఎస్ లో అందే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కృషి చేయాల్సి ఉందన్నారు. మండలాలలో వి ఆర్ ఏ లు, సర్వేయర్లు చిత్తశుద్ధి తో పని చేసి, మ్యుటేషన్, వెబ్ ల్యాండింగ్ వంటి సమస్యల పరిష్కారం చూపాలని రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. డ్వామా అధికారులు భూ గర్భ జల మట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి విధ్యాదరి,  డి ఎఫ్ ఓ భరణి, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డి ఆర్ ఓ మోహన్ కుమార్,  జిల్లా పరిషత్, ఆర్ డబ్ల్యూ ఎస్, పిఆర్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, హార్టికల్చర్, డ్వామా, పరిశ్రమలు, ఐసిడిఎస్, ఇరిగేషన్ శాఖలఅధికారులు పాల్గొన్నారు. 

పో రై గంగ 1 డిఆర్ సి సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి రాం ప్రసాద్ రెడ్డి
గంగ 2 జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 
గంగ 3 చిత్తూరు ఎంపి ప్రసాదరావు 
గంగ 4 చిత్తూరు ఎంఎల్ఏ జగన్మోహన్ నాయుడు
గంగ 5 పూతలపట్టు  ఎంఎల్ఏ మురళీమోహన్
గంగ 6 సమావేశానికి హాజరైన జిల్లా అధికారులు 
 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *