జీడి నెల్లూరు మండల పార్టీ అధ్యక్షుల నియామకపు ప్రకటన నేడే
ఎస్ ఆర్ పురం వేదికగా జాబితాలను ప్రకటించిన ఎమ్మెల్యే
పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మండల పార్టీ అధ్యక్షులు ఎంపిక
అధిష్టానానికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
నేడు చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయనున్న ఒక వర్గం
రెడ్డి, మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో అసంతృప్తి
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా గంగాధర నెల్లూరు మండల పార్టీ అధ్యక్షులు నియామకపు ప్రక్రియ ఆదివారం జరగనుంది. ఇందుకు ఎస్ఆర్ పురం మండల పార్టీ కార్యాలయం వేదిక కానుంది. నియోజకవర్గంలో ఒక వర్గాన్ని అనుసరిస్తున్న నియంత్రత్వ వైఖరికి నిరసనగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు కేంద్ర పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారు. కుప్పంలో గృహప్రవేశం నిమిత్తం వచ్చిన ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడానికి పలువురు సిద్ధమయ్యారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం 3 పర్యాయాలు లేక ఆరు సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారిని తిరిగి ఆ పదవులలో నియమించకూడదు. ఈ మేరకు పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే, ఆ నిబంధనలకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ముగ్గరిని తిరిగి మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరిని మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగించడానికి భారీగా డబ్బులు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా పలువురు రాష్ట్ర పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు.
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపి మండల కమిటీ అధ్యక్షుల ఎంపిక జరిగినట్టు తెలిసింది. ఆదివారం శ్రీరంగరాజపురం మండలంలో లాంచనంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో మండల పార్టీ అధ్యక్షుల నియామకపు ప్రకటన చేస్తారని సమాచారం. అయితే పార్టీ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎమ్మెల్యే థామస్ పేర్లు ప్రకటిస్తే సహించేది లేదని ఒక వర్గం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన స్వంత ఇంటి గృహ ప్రవేశానికి కుప్పం వస్తున్న టిడిపి అధినేత చంద్రబాబును కలసి ఆదివారం ఫిర్యాదు చేయడానికి కొందరు సిద్ధం అవుతున్నారు. మహానాడు తరువాత సమావేశాలు పెట్టి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని అధిస్థానం సూచించింది. అయితే ఒక వర్గం నేతలు పట్టు బట్టి అధ్యక్షుల జాబితా సిద్ధం చేసి ప్రకటించాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారు. దీనితో ఎమ్మెల్యే థామస్ జాబితా తయారు చేసి పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడుకు పంపినట్టు తెలిసింది. పాలసముద్రం, వెదురుకుప్పం మినహా మిగిలిన నాలుగు చోట్ల పాత వారిని కొనసాగిస్తున్నారు. ఇందులో ముగ్గురు కమ్మ, ఇద్దరు ఎస్సీ, ఒక బిసి నేతకు అవకాశం కల్పిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన బెట్టారు. ఎమ్మెల్యే నిర్ణయించిన జాబితాలో కార్వేటినగరం మండల అధ్యక్షునిగా చెంగల్రాయ యాదవ్ ( బిసి), ఎస్.ఆర్ పురం అధ్యక్షునిగా జయశంకర్ నాయుడు ( కమ్మ), పెనుమూరు అధ్యక్షునిగా రుద్రయ్య నాయుడు ( కమ్మ), జి డి నెల్లూరు అధ్యక్షునిగా స్వామిదాసు కొనసాగుతారు. పాలసముద్రం అధ్యక్షునిగా ఉన్న రాజేంద్ర (ఎస్సీ)ను తొలగించి శివయ్య నాయుడు ( కమ్మ) కు అవకాశం కల్పిస్తున్నారు. వెదురుకుప్పం అధ్యక్షునిగా ఉన్న లోకనాథ రెడ్డిని తప్పించి మోహన్ మురళి ( ఎస్సీ) ని నియమిస్తున్నారు. అయితే సమావేశం ఏర్పాటు చేయకుండా జాబితా రూపొందిస్తే తాను సంతకం పెట్టలేనని నియోజకవర్గ పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడు చెప్పారని తెలిసింది. దీనితో ఆదివారం ఎస్ ఆర్ పురంలో ముఖ్య నేతలతో నామమాత్రపు సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా ముందుగా కార్యకర్తలకు తెలపకుండా ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనవద్దని ఆరు మండలాలకు చెందిన పలువురు పరిశీలకున్ని కోరినట్టు తెలిసింది. అలాగే కొంత మంది అధిష్టాన వర్గానికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మన్ వర్ల రామయ్యకు ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్ర నాయకుడు ఒకరు వివరణ ఇస్తూ ఎమ్మెల్యే ఏక పక్షంగా చేసే నిర్ణయాలు చెల్లవని చెప్పారు. ఎం ఎల్ ఏ జాబితా పంపినా చంద్రబాబు ఆమోదించారని తెలిపారు. పైగా మూడు సార్లు పదవిలో ఉన్న వారికి తిరిగి అదే పదవి ఇవ్వరాదని పొలిట్ బ్యూరో నిర్ణయించిందని గుర్తు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీనిపై చాలా స్పష్టంగా ఉన్నారని అన్నారు. ఈ నేపధ్యంలో మూడు సార్లు అధ్యక్షునిగా ఉన్న కార్వేటినగరం అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, నాలుగు సార్లు ఉన్న ఎస్ ఆర్ పురం అధిక్షుడు జయశంకర్ నాయుడు, ఎనిమిది సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన రుద్రయ్య నాయుడు నియామకం చెల్లదని చెప్పారు. కాగా నియోజక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి, మాదిగ సామజిక వర్గానికి ఒక మండలం కూడా కేటాయించక పోవడం పట్ల ఆ వర్గాల కార్యకర్తలు రగిలి పోతున్నారు. తమ వర్గానికి అన్యాయం చేస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వెదురుకుప్పం మండల నేతలు చెప్పారు. అతి తక్కువ జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి మూడు మండలాలు కేటాయించి, పార్టీకి వెన్నెముక లాంటి బిసిలకు ఒక మండలం ఇవ్వడం అన్యాయం అని పలువురు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసిపి నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ అక్రమ నియామకాలకు మూలం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక మండల అధ్యక్షుడు తిరిగి కొనసాగడం కోసం ఎమ్మెల్యే కోటరీకి 15 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరొక మండల ఆశావహుడిని ఐదు లక్షలు అడిగారని తెలిసింది. ఆయన కాదనడంతో మరొక నేతకు అవకాశం కల్పించారని అంటున్నారు. ఒక మండల ఆశావహుడిని భారీ మొత్తంలో అడిగారని తెలిసింది. ఇద్దరు మండల నాయకులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా వారికి పదవులు కట్టి పెట్టే ప్రయత్నం జరుగుతోంది. మార్చి ఒకటవ తేదీన జి డి నెల్లూరులో చంద్రబాబు ప్రశంసలు అందుకున్న రాజేంద్రను తొలగించారు. పక్కన పెట్టనున్న రుద్రయ్య నాయుడుకు పట్టం కడుతున్నారు. ఈ నేపధ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుని మహానాడు తరువాత ఎన్నికలు నిర్వహిస్తుందని ఒక కీలక నాయకుడు చెప్పారు. మొత్తం మీద గంగాధర నెల్లూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక రసవత్తరంగా మారింది. ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
*అధిష్టానం ఓకే అంటేనే ....*
గంగాధర నెల్లూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షుల ప్రకటన ఆదివారం జరుగుతుందన్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు రవి ప్రకాష్ నాయుడు తెలిపారు. ఆయన ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. పార్టీ అధిష్టానం మహానాడు తర్వాత మండల పార్టీ అధ్యక్షులు నియామకం జరపాలని భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యాలయం నుండి అనుమతి వస్తే తాను పరిశీలకుడి హోదాలో ఆదివారం జరిగే సమావేశానికి హాజరవుతానని తెలిపారు. అధిష్టానం అనుమతించకపోతే తాను సమావేశానికి హాజరుకానని రవి ప్రకాష్ నాయుడు స్పష్టం చేశారు.

