27, మే 2025, మంగళవారం

సిద్ధం అవుతున్న నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు

ఎమ్మెల్యే చైర్మన్‌గా అమలు పర్యవేక్షణ

జిల్లా స్థాయిలో చైర్మన్‌గా ఇన్‌చార్జ్‌ మంత్రి

ఇకపై ఏటా 15 శాతం వృద్ధి రేటు లక్ష్యం

పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు

ఐదేళ్లలో ప్రతి కుటుంబానికీ సొంతిల్లు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 

  కుప్పం విజన్ డాక్యుమెంట్ మోడల్ గా చిత్తూరు  జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నియోజకవర్గాల వారీగా స్వల్ప, దీర్ఘ కాళిక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా రానున్న నాలుగు యేళ్ల కాలంలో 2029 వరకు ఒక విజన్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. జిల్లాలోని ప్రతి శాఖ ఈ లక్ష్యసాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించవలసి ఉంటుంది. వ్యవసాయ, ఉధ్యానవన, మత్స్య రంగాల్లో ప్రస్తుత విస్తరణ, దిగుబడులు, రానున్న రోజుల్లో అంతరసాగు విధానం, ఆదాయం పెంపు, ప్రకృతిసాగు విస్తీర్ణ పెంపు, తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరుస్తున్నారు. పాల ఉత్పత్తి పెంపుదలకు అవసరమైన అంశాలను ప్రణాళికలో చేరుస్తున్నారు. పారిశ్రామిక, పర్యాటక రంగ, ఫుడ్ ప్రోసెసింగు యూనిట్ల స్ధాపన వంటి అంశాలను ప్రణాళికలో జోడిస్తున్నారు. 2047 నాటికి  తలసరి ఆదాయంను 15 శాతంకు  ఎలా పెంచాలి తదితర అంశాలు పొందుపరచి విజన్ డాక్యుమెంటును రూపొందిస్తున్నారు.


 స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా రానున్న ఐదేళ్లకు నియోజకవర్గ స్థాయి విజన్‌ అమలు ప్రణాళికలు రూపకల్పన జరుగుతోంది. నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తుతం ఏ దశలో ఉంది? భవిష్యత్తులో ఎంత అభివృద్ధి జరగాలనే లక్ష్యాలను స్వర్ణాంధ్ర-2047లో నిర్దేశిస్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియోజకవర్గానికి, నియోజకవర్గానికి  కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ జిల్లాస్థాయిలో విజన్‌ ప్లాన్‌ లక్ష్యాలు చేరుకోనే విధంగా ముఖ్య ప్రణాళిక అధికారి ఈ విజన్ రూపకల్పనకు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్‌ ప్రణాళికలు తయారయ్యాయి. వాటిని మోడల్ గా తీసుకోని  ప్రతి నియోజకవర్గానికీ అక్కడి అవసరాలు, భౌగోళిక, సామాజిక అంశాల ఆధారంగా విజన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నారు. విజన్ ప్లాన్ అమలుకు నియోజకవర్గ పర్యవేక్షణకు నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉంటారు. ఒక స్పెషల్‌ ఆఫీసర్‌, ఐదుగురు సచివాలయాల ఉద్యోగులు, ఒక యువ ప్రొఫెషనల్‌ అందులో ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. ప్రతి మూడు నెలలకు విజన్ ప్లాన్ పురోగతిని సమీక్షిస్తారు. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్లాన్‌లు ఆవిష్కరిస్తారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆవిష్కరిస్తారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనకు పది సూత్రాలు ప్రతిపాదిస్తున్నారు. పేదరిక రహిత జిల్లా, జనాభా నిర్వహణ, నైపుణ్య శిక్షణ-ఉపాధి, నీటి భద్రత, వ్యవసాయంలో టెక్నాలజీ తదితర అంశాల ఇందులో ప్రధానంగా ఉంటాయి. వీటి అమలు కోసం జిల్లా, నియోజకవర్గంతో పాటు మండలం, మున్సిపాలిటీ స్థాయిల్లోనూ విజన్‌ ప్లాన్‌ అమలుచేస్తారు. అనంతరం పంచాయతీలు, వార్డులకు స్థానికంగా ప్లాన్‌లు రూపొందిస్తారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి కుటుంబానికీ సొంతిల్లు ఉండటం ఈ విజన్ ప్లాన్ లక్ష్యం. సొంత ఇల్లు లేనివారికి  పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తారు. ఒకప్పుడు ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు దాటితే రేషన్‌ బియ్యం ఐదుగురికే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు జనాభా పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ప్రభుత్వం కుటుంబంలో ఎంత మంది ఉన్నా పరిమితి లేకుండా బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎక్కువ మంది సభ్యులుండే కుటుంబాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. తాగునీటి నిటి సమస్య పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర – 2047 విజన్ లో భాగంగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా 2024 నుండి 2028-29 వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను మే 31 లోపు సిద్ధం చేస్తున్నారు. ప్రణాళికలు సిద్ధం చేయడంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది తోడ్పాటు తీసుకుంటున్నారు. లక్ష్యాల సాధనకు స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ ప్రణాళికలను అమలు చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అప్పగించారు. జిల్లా, మున్సిపల్,  గ్రామ స్థాయి కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందిస్తారు.  ప్రజల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడంతో పాటు, ఎమ్మెల్యేలు పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. రాయలసీమను భవిష్యత్తులో ఉద్యానవన, సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టులకు కేంద్రంగా అభివృద్ధి చేయడానికి నిర్దిష్ట ప్రణాళికలు అమలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఒక సంవత్సరం అవుతుంది మిగిలిన నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ ప్రణాళిక ఆధారంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించి తొలుత ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తారు. కనీస అవసరాలు తీరిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి, ఉపాధి తదితర అంశాల మీద దృష్టిని కేంద్రీకరించినున్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో అప్పుడు తలెత్తే అవసరాలు కనుగుణంగా ఈ డాక్యుమెంట్లో మార్పులు చేర్పులు చేయనున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *