2, మే 2025, శుక్రవారం

పెనుమూరు మండల కేంద్రంలో అనర్హులకు ఇళ్ల పట్టాలు

 85 మందికి పెట్టాలు ఇవ్వగా, అందులో 10 మంది మాత్రమే అర్హులు 

అనర్హుల మీద చర్యలు తీసుకోమన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

ఒకటిన్నర సెంటు పట్టా ఇస్తే, ఆరు సెంట్లు ఆక్రమించుకున్న ఘనులు

పట్టా కూడా  లేకుండా ఆక్రమించుకున్న మరికొందరు

లబ్ధిదారులలో ప్రజాప్రతినిధులు కూడా

విలువైన ప్రభుత్వ భూమిని పంచిపెట్టిన అవినీతి అధికారులు


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) 

పెనుమూరు మండల కేంద్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. 85 మందికి ఇళ్ల పట్టాలి ఇవ్వగా అందులో 75 మంది అనర్హులుగా రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. పదిమంది మాత్రమే అర్హులుగా నిర్ధారించారు. మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇతరులకు ఇవ్వకూడదని, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని నిబంధనలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ఆ నిబంధనలను తుంగల్లో తొక్కారు. మండల కార్యాలయానికి పార్లంగు దూరంలోనే అనర్హులకు ఇళ్ల పట్టాలను అందజేసి, వారు భారీగా లబ్ధి పొందారు. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం. అనర్హులకు అందజేసిన ఇళ్ల పట్టాలను రద్దు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా, మండల అధికారులు వాటిని ఖాతర్ చేయలేదు. పదిమంది కోర్టుకు వెళ్లి స్టేటస్కో తెచ్చుకోవడంతో అదే సాకుగా రెవెన్యూ అధికారులు ఎవరిమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


పెనుమూరు తహసిల్దార్ కార్యాలయానికి పక్కనే సర్వే నంబర్ 430లో ఉన్న ఆ భూమి ఎకరం భూమి ధర 10 కోట్ల రూపాయలు పలుకుతుందని అంచనా. అటువంటి భూమిని అధికారుల ఒత్తిడికి అమ్యాన్యాలకు ఆశపడి రెవెన్యూ అధికారులు అనర్హులకు పప్పులు బెల్లాల వలె పంచిపెట్టారు. అప్పట్లో ప్రభుత్వం ఒకటిన్నర సెంట్లు పట్టా ఇవ్వగా కొందరు ఆరు సెంట్లు కూడా ఆక్రమించుకున్న ఘనులు ఉన్నారు. పంచాయతీలలో మూడు అంతస్తులకు మించి కట్టడానికి అనుమతి లేకున్నా, ఆరు అంతస్తులు భవనాలు కట్టిన వారు కూడా ఉన్నారు. డూప్లెక్స్ భవనాల కట్టిన ధనికులు కూడా ఉన్నారు. అనర్హులకు, ఇవ్వకూడని స్థలంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్ల పట్టాలు అందజేసిన రెవెన్యూ అధికారుల మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమంగా పట్టాలు పొందిన వారిని కూడా అధికారులు పెద్ద మనసుతో మన్నించారు. అక్రమంగా పట్టాలు పొందిన వారు దర్జాగా వాటిని అనుభవిస్తున్నారు పక్కన మరి కొంత స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు కలుగజేసుకోకపోవడంతో మరింత మంది పట్టాలు లేకుండా ఆ భూములను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటున్నారు.
పెనుమూరులో అక్రమ పట్టాలు, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కొందరు నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్నారు. ఇందులో కొందరు అక్రమంగా పట్టాలు పొందగా, కొందరు ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నారు. పంచాయతీ అధికారులు కళ్ళుమూసుకున్నారు. విద్యుత్ శాఖ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పెనుమూరు గ్రామ సర్వే నెంబర్ 430లో ఉన్న దాదాపు ఎ. 20.20 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఎ 7.50 సెంట్లలో 85 మంది ఇళ్ళు కట్టుకున్నారు. 2022లో అప్పటి తహసీల్దారు చాలా మందికి అనర్హులకు ఒకటిన్నర సెంటు లెక్కన పట్టాలు ఇచ్చారు. అయితే ఒక్కొక్కరు ఐదారు సెంట్ల స్థలం ఆక్రమించుకుని ఇళ్ళు కట్టుకున్నారు. కొందరు డూప్లెక్స్ ఇళ్లు కట్టుకోగా ఒకరిద్దరు ఐదు అంతస్తుల ఇళ్ళు నిర్మించుకున్నారు. మండల కేంద్రం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో పట్టాలు ఇవ్వ కూడదని నిబంధన ఉన్నప్పటికీ అధికారులు మండల కార్యాలయానికి పార్లాంగు దూరంలో పట్టాలు ఇచ్చారు. ఇళ్లు లేని పేదవారికి ఇవ్వాల్సిన పట్టాలను కోటీశ్వరులు కూడా ఇచ్చారు. పంచాయతీ అధికారుల అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అప్పటిలో దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో 2024 ఫిబ్రవరిలో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అప్పటి తహసీల్దారు కళావతి విచారణ చేసి 85 మందిలో కేవలం పది మంది అర్హులు ఉన్నారని రిపోర్టు ఇచ్చారు. మిగిలిన వారిలో 49 మంది అనర్హులు ఉండగా, 26 మంది ఆక్రమించుకున్నారని తెలిపారు. దీనితో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తొలగించమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. అయితే 10 మంది హై కోర్టులో స్టేటస్ కో తెచ్చుకున్నారు. కొందరు రెవెన్యూ కోర్టున ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. కలెక్టర్ కార్యాలయం అప్పటిలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తూ పంపిన వివరాలు శుక్రవారం చేరాయి. ఇన్ని అవకతవకలకు పాల్పడిన తహసీల్దారు, ఆర్ఐ, విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ శాఖ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విశేషం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెనుమూరు భూ కబ్జాలపై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ ముఖ్య మంత్రికి ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు కంటి తుడుపు చర్యగా ప్రభుత్వానికి వివరాలు పంపి చేతులు దులుపుకున్నట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, ఆక్రమణ దారుల కొమ్ము కాసిన రెవెన్యూ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెనుమూరు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులను పరిరక్షించాలని సుధాకర్ రెడ్డి, ప్రజలు కోరారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ విషయంలో దృష్టిని సారించాలని కోరుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పట్టాలు అందజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించకుంటే ఎంతో విలువైన మిగిలిన భూమి కూడా ఆక్రమణకు గురవుతుందని ఆందోళన చెందుతున్నారు. పట్టాలి ఇచ్చిన అధికారుల మీద, పట్టాలు పొందిన అనర్హుల మీద చర్యలు తీసుకోకుంటే జిల్లా అధికారులు, చట్టం మీదే నమ్మకం పోతుందని అంటున్నారు. 

పో రై గంగ 3 పెనుమూరులో అనర్హులు నిర్మిస్తున్న ఇండ్లు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *