బిసి, ఎస్సి కార్పోరేషన్ల రాయితీ రుణాలకు బ్రేక్
రుణాలను నిలుపుదల చస్తూ ప్రభుత్వ ఆదేశాలు
రుణాల మంజూరుపై వెల్లువెత్తిన విమర్శలు
ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి రాయితీ రుణాలు
భారీగా దళారుల రంగప్రవేశం
రాజకీయ సిఫార్సు లేనివారికి రుణాలలో మొండి చేయి
సామాన్యులకు దరిచేరిని రాయితీ రుణాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రాయితీ మీద మంజూరు చేయాలనుకున్న రుణాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. రాయితీ రుణాల మంజూరుపైన విమర్శలు వెల్లువెత్తాయి. శాసనసభ్యులు చెప్పిన వారికి మాత్రమే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఏర్పడింది. రుణాల మంజూరును ప్రజాప్రతినిధులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరెవరికి రుణాలు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు జాబితాలు అందజేశారు. రాయితీ రుణాలు ఇప్పిస్తామని మధ్యలో దళారులు కూడా రంగ ప్రవేశం చేశారు. దీంతో సామాన్య ప్రజలకు రాయితీ రుణాలు అందని ద్రాక్షగా మిగిలాయి. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల ఆధారంగా రాయితీ రుణాలను తాత్కాలికంగా నిలబదలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎస్సీలకు రాయితీ రుణాలను ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు ఈ సబ్సిడీ పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా బీసీ, ఎస్సి కార్పొరేషన్ రుణాలు దక్కించుకొని తాము జీవితంలో స్థిరపడవచ్చని ఆశపడ్డారు. దీంతో బీసీ కార్పొరేషన్ రుణాలకు భారీగా దరఖాస్తుల రావడంతో దరఖాస్తుదారులలో రాజకీయ నాయకులను ఆశ్రయించారు. కొందరు ఎలాగైనా రుణాన్ని సాధించాలని మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ రాయితీ రుణాలను జిల్లా అధికారులు నియోజకవర్గ, మండల వారీగా విభజించారు. ఆ జాబితాను ఆయా శాసనసభ్యులకు అందజేశారు. దీంతో శాసనసభ్యులు ప్రతిపాదించిన వారికి రుణాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆశావాహులు పలువురు శాసనసభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరికొందరు మండల స్థాయిలోని కూటమికి నేతల సహాయ సహకారాలను తీసుకొని శాసనసభ్యులను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదునుగా మండల స్థాయిలో కూటమి నేతలు దరఖాస్తుదారులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. లోను ఇప్పిస్తా, ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. అయితే ఇందులో కొంత ఖర్చవుతుందని, పది శాతం వరకు భరించాల్సి ఉంటుందని షరతు పెడుతున్నారు. ఇదే అదునుగా కొంతమంది బీసీ నాయకులు కూడా దళారుల అవతారం ఎత్తుతున్నారు. కొంత మంది కులసంఘ నాయకులతో కలిసి దరఖాస్తుదారులకు వల విసురుతున్నారు. వీరు తమకు బీసీ కార్పొరేషన్ అధికారులు, శాసనసభ్యులు బాగా తెలుసనీ, వారితో చెప్పి రాయితీ రుణాలను ఇప్పిస్తామని దరఖాస్తుదారులను ఆశపెట్టారు. కొందరు లబ్దిదారుల నుంచి ముందుగానే డబ్బులను కూడా వసూలు చేస్తున్నారు. గతంలో ఎంబీసీ కార్పొరేషన్ తరపున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేసింది. ఇందులో కూడా కొంతమంది దళారులు రంగ ప్రవేశం చేసి, తామే డబ్బులు మంజూరు చేపిమ్చమని, ఒక్కొక్క లబ్ధిదారుల దగ్గర 3000 నుంచి 5000 రూపాయల వరకు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇదేవిధంగా ప్రస్తుతం బీసీ రాయితీ రుణాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మధ్య దళారీలు రంగ ప్రవేశం చేశారు. ఏదో ఒకటి విధంగా దరఖాస్తుదారులను మభ్యపెట్టి తమ గడుపుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే బీసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరణ పూర్తి అయ్యింది. బిసి రాయితీ రుణాలకు మండల, మునిసిపాలిటి స్థాయిలో అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తులు భారీగా రావడంతో జిల్లా అధికారుల నుండి ఎంపిక బాధ్యతలను సంబంధిత ఎమ్మెల్యేలకు తీసుకున్నారు. మండల, నియోజకవర్గ వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను విభజించారు. ఈ మేరకు జాబితాలను సంబంధిత ఎమ్మెల్యేలు మండల అధికారులకు, మున్సిపాలిటీలకు అందచేశారు. ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి మాత్రమే సబ్సిడీ రుణాలు అందచేయాలని మండల, మున్సిపాలిటీ అధికారులు కూడా బ్యాంకులను ఆదేశించారు. ఈ మేరకు జాబితాలను కూడా అందచేశారు. జిల్లాకు 2800 యూనిట్లు మాత్రమే బీసీ రుణాలు మంజూరయ్యాయి. అవి కూడా బీసీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ల కింద ఈ పథకాలకు మంజూరు చేశారు. ఈ పథకాల విలువ 61.25 కోట్ల రూపాయల కాగా, ఇందులో ప్రభుత్వం 30.62 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందజేస్తుంది. చిత్తూరు జిల్లాలో ఎస్సిల ఆర్థికాభివృద్ధికి 27.43 కోట్ల రూపాయలతో వార్షిక ప్రణాళికను రూపొందించారు. ఇందులో కార్పొరేషన్ సబ్సిడీగా 12.52 కోట్ల రూపాయలను అందజేస్తుంది. బ్యాంకర్లు రుణాల కింద మరో 13.53 కోట్లను సమకూర్చుతాయి. లబ్దిదారులు తమ వాటాగా 1.37 కోట్ల రూపాయలు చెల్లించాల్చి ఉంటుంది. ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 786 మంది ఎస్సీలు లబ్ధి పొందనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా సబ్సిడీ వస్తుండటంతో దరఖాస్తుదారులు కూడా భారీగా ఆశలు పెంచుకున్నారు. బిసి కార్పోరేషన్ ద్వారా స్లాబ్ 1 లో రెండు లక్షల రూపాయల వరకు, స్లాబ్ 2 లో 3 లక్షల రూపాయల వరకు, స్లాబ్ 3 లో 5 లక్షల రూపాయల వరకు, స్లాబ్ 4 లో ఎనిమిది లక్షల నుంచి 25 లక్షలు వరకు సబ్సిడీ వస్తుంది. జిల్లాలో బీసీల ఆర్థికాభివృద్ధికి 38.41 కోట్ల రూపాయలతో ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని 2020 మంది బీసీలు లబ్ధి పొందనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా 19.20 కోట్ల రూపాయలను అందచేస్తుంది. ఇలా జిల్లా స్థాయిలో బిసి, ఎస్సి రాయితీ రుణాల కోసం పలువురు ఆశలు పెట్టుకున్నారు. రుణాలు పొంది జీవితంలో స్థిరపడాలని లబ్దిదారులు ఆశపడ్డారు. ఇదే అదనుగా దరఖాస్తుదారుల నుండి కమీషన్లు దండుకొని లబ్ది పొందాలని కొందరు బిసి నేతలు, కూటమి నేతలు ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం ఉన్నవిధానంలో రాయితీ రుణాలను మంజూరు చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని భావించింది. ఇలా చేయడం వల్ల సామాన్య లబ్ధిదారులకు రుణాలు అందే పరిస్థితి లేదని అంచనాకు ప్రభుత్వాధికారులు అంచనాకు వచ్చారు. రాయితీ రుణాలను రాజకీయ నాయకుల సిఫార్సులతో కూటమి నేతలు పంచుకునే పరిస్థితి ఏర్పడిందని భావించారు. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. క్షేత్రస్థాయిలో జరిగిన, జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వం రాయితీ రుణాలను తత్కాలికంగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కొత్త నిబంధనలను జారీ చేసి, తదుపరి బిసి ఎస్సి రుణాలను అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

