జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన చిత్తూరు జిల్లా పోలీసులు
1761 వాహనాలు తనిఖీ చేసి, 101 ఎం వి కేసులను నమోదు
సరైన పత్రాలు లేకుండా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోనికి
55 లాడ్జిలలో 325 గదుల తనిఖీలు, 9 బస్టాండ్ లు, 4 రైల్వేస్టేషన్ ల తనిఖీ
314 మంది అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులు
చిత్తూరు, మే 9 (ఆంధ్రప్రభ బ్యూరో) : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గురువారం రాత్రి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లా అంతటా ముమ్మరంగా వాహనాల తనిఖీలు, లాడ్జీల తనిఖీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల గుర్తింపునకు ఈ స్పెషల్ డ్రైవ్ ను జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వహించింది.జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు స్వయంగా స్పెషల్ డ్రైవ్ లో పాల్గొని పట్టణములోని రైల్వే స్టేషన్, బస్టాండ్ లను తనిఖీ చేశారు.
ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లా అంతటా 1761 వాహనాలు తనిఖీ చేసి 101 ఎం వి కేసులను నమోదు చేసి 27,295 రూపాయలను జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడిపిన నలుగురు, బహిరంగ మద్యపానం సేవించిన ఐదుగురుపై మొత్తం 9 మంది పై కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకుండా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. చౌడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 100 టెట్రా ప్యాకెట్లు విలువ రూ. 3500, ఒక ద్విచక్రవాహనం స్వాదీనం చేసుకున్నారు. పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలో సరైన బిల్లులు లేకుండా 10,000 లీటర్లు రవాణా చేస్తున్న ఒక డీజిల్ ట్యాంకర్ ను స్వాదీనం చేసుకున్నారు. జిల్లా అంతటా 55 లాడ్జిలలో 325 గదులను తనిఖీలు చేసారు. 9 బస్టాండ్ లు, 4 రైల్వేస్టేషన్ లను తనిఖీ చేశారు. 314 మంది అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి, ప్రశ్నించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో, ఏవైనా అనూహ్య ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, స్థలాలపై తనిఖీలు చేయడం ద్వారా ప్రజలలో భద్రతా భావన పెంచడమే మా లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రజల భద్రతను మెరుగుపరిచేలా, నేరాల నియంత్రణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా ఈ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల తమ పరిధిలో ఉన్న అనుమానిత ప్రాంతాలలో సోదాలు నిర్వహించామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రధానంగా వాహనాల తనిఖీలు, లాడ్జీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, శివారు ప్రాంతాల్లో పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహించారని వివరించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీ చేసి, వారి గుర్తింపు వివరాలను నమోదు చేశామని, వాహనాలు, బైక్‌లు, కార్లు, ఆటోలు మొదలైన వాటిని ఆపి పరిశీలించామని పేర్కొన్నారు. లాడ్జీలలో నిర్ధారణ లేకుండా బస చేస్తున్న అతిథులు, రిజిస్ట్రేషన్ లేకుండా గదులు కేటాయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఎస్పీ మణికంఠ చందోలు విజ్ఞప్తి చేశారు.
పో రై గంగ 1 తనిఖీలు చేస్తున్న జిల్లా ఎస్పి మణికంఠ చందోలు

