చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రాజకీయ ప్రాబల్యానికి బ్రేక్
పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం
ఈ మేరకు మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లా రాజకీయాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల ప్రాబల్యానికి బ్రేక్ పడింది. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాల్లో కాకుండా చిత్తూరు జిల్లాలో చేర్చారు. ఒక పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడు పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరులో కలపడం పట్ల అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే రాజకీయ ప్రాబల్యం కారణంగా మంత్రిగా ఉండిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో తన ప్రాబల్యాన్ని కొనసాగించడానికి పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలిపారు. ఫలితంగా రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో తన ప్రభావాన్ని కొనసాగించారు. అలాగే పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి హవా కూడా రెండు జిల్లాల్లో నడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయమై దృష్టిని సారించింది. పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ప్రాబల్యానికి బ్రేక్ పడినట్లు అయింది. ఒకరకంగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ శకం ముగిసింది.
మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజక వర్గం చిత్తూరు నుంచి తొలగించి అన్నమయ్య జిల్లాలో కలుపనున్నారు. ఆమేరకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల్లో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తారు. చిత్తూరు జిల్లాలో తలనొప్పిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని పక్కన పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని టిడిపి నేతలు అంటున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజక పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉన్నందు వల్ల ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిద్దరికి చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని పరిశీలకులు భావిస్తున్నారు. 2022 ఎప్రిల్ నెలలో రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసారు. అయితే అప్పటిలో మంత్రిగా ఉన్న పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరును రాజంపేటలో కలపకుండా చిత్తూరు జిల్లాలో ఉంచేశారు. చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గంలోని చంద్రగిరి నియోజకవర్గాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి జిల్లాలో కలపడానికి కృషి చేసారు. ఆర్ కె రోజా నగరి నియోజక వర్గంలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాలను చిత్తూరు జిల్లాలో ఉంచారు. పుత్తూరు, వడమాల పేట మండలాలను తిరుపతిలో కలిపారు. శాసన సభ్యురాలుగా, మంత్రిగా రెండు జిల్లాల్లో ఆమె ప్రాతినిధ్యం కొనసాగింది. అయితే అప్పటిలో చంద్రగిరిలో పెద్దగా వ్యతిరేకత రాలేదు. పుంగనూరు నియోజక వర్గంలో పలువురు చిత్తూరు దూరం అంటూ ధ్వజం ఎత్తారు. రాయచోటికి బదులు మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పలువురు పుంగనూరు నేతలు చంద్రబాబును కలసి తమ అసౌకర్యాన్ని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లా కిందికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుంగనూరు నియోజకవర్గం మాత్రం చిత్తూరు జిల్లాలో కలపడాన్ని పలువురు వ్యతిరేకించారు. దీంతో పుంగనూరు నియోజకవర్గం కలుపుతూ నాలుగు రోజుల క్రితం రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసి మంత్రివర్గం ముందు ఉంచారు. దీని ప్రకారం ఇప్పటి వరకు పలమనేరు రెవెన్యూ డివిజన్ ఉన్న పుంగనూరు, చౌడేపల్లి, సదుం, సోమల, రొంపిచర్ల మండలాలను మదనపల్లె రెవెన్యూ డివిజన్ లో కలుపుతారు. చిత్తూరు రెవిన్యూ డివిజన్ లో ఉన్న పులిచర్ల మండలాన్ని కూడా అన్నమయ్య జిల్లా కిందికి తీసుకురారన్నారు. దీనితో చిత్తూరు చిన్న జిల్లాగా మారిపోతుంది. కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, జి డి నెల్లూరు, నగరి ఆరు నియోజక వర్గాలు ఉంటాయి. 26 మండలాలు మిగులుతాయి. కుప్పం, పలమనేరు, పూతలపట్టు నియోజక వర్గాల నుంచి ఐదేసి మండలాలు ఉంటాయి. జి డి నెల్లూరుకు చెందిన ఆరు, నగరి నుంచి మూడు, చిత్తూరు నుంచి రెండు మండలాలు ఉంటాయి. కాగా జిల్లాలో ఒక పార్లమెంటు సభ్యుడు, ఆరుగురు ఎమ్మెల్యేలు టిడిపికి చెందిన వారే ఉంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా వైసీపీకి చెందిన శ్రీనివాసన్ ఉన్నారు. కుప్పంకు చెందిన భరత్ వైసిపి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏడాది తరువాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి చక్రం తిప్పవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నమయ్య జిల్లాకు వెళ్లడంతో చిత్తూరు జిల్లాలో వైసిపి బలం, ప్రాబల్యం తగ్గుతుందని భావిస్తున్నారు. మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్ కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు ఎం. జ్ఞానేంద్ర రెడ్డి ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రా లోటును భర్తీ చేయలేరని వైసీపీ నేతలు అంటున్నారు. పుంగనూరు నియోజక వర్గం మొత్తం అన్నమయ్య జిల్లాలో కలవడంతో చిత్తూరు జిల్లా పరిమాణం తగ్గింది. దీంతో నగరి నియోజకవర్గంలోని మిగిలిన మండలాలను కూడా చిత్తూరు జిల్లా పరిధిలోకి తీసుకుని వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగరి నయోజకవర్గంలో కొన్ని మండలాలు తిరుపతి జిల్లాకు మరికొన్ని మండలాలు చిత్తూరు జిల్లాకు వస్తాయి. ఒక నియోజకవర్గం రెండు జిల్లాలలో ఉండడం కారణంగా ఒకే జిల్లాకు పరిమితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

