మామిడి మద్దతు ధర కోసం రైతుల డిమాండ్
ఆచితూచి అడుగులు వేస్తున్న జిల్లా యంత్రాంగం
నిశితంగా పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
3వ తేదిన మద్దతు ధరపై సమావేశం
భారీగా పడిపోయిన ఖాదర్, పులేరా ధరలు
ఆందోళనలో మామిడి రైతులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
తోతాపురి మామిడి మద్దతు ధర కోసం చిత్తూరు జిల్లాలోని రైతులు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆచితూచి అడుగులు వేస్తోంది. మామిడి మద్దతు ధర విషయమై ఇప్పటికే రెండు పర్యాయాలు మామిడి రైతులతో జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్టికల్చర్ డైరెక్టర్ శ్రీనివాసన్ కూడా పాల్గొన్నారు. గత సంవత్సరం మామిడి పల్ప్ నిల్వల కారణంగా ఈ సంవత్సరం మామిడిని ప్రాసెసింగ్ చేయడానికి మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో మామిడి మద్దతు ధర మీద ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ విషయమై జూన్ మూడో తారీఖున సమావేశం ఏర్పాటు చేసి మామిడి మద్దతు ధరను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో తోతాపురి రకం మామిడి క్రషింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సంవత్సరం ఆలస్యంగా మామిడి సీజన్ ప్రారంభం అయ్యింది. వాతావరణ అనుకూలించకపోవడంతో నెలన్నర ఆలస్యంగా మామిడి క్రషింగ్ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవంగా జిల్లాలో ఈపాటికి మామిడి క్రషింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పంట ఆలస్యం కావడంతో ఈ సంవత్సరం ఇంకా క్రషింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఖాదర్, పులేరా రకాల క్రషింగ్ జరుగుతుంది. అది కూడా మూడు నాలుగు ఫ్యాక్టరీలు మాత్రమే మామిడిని తీసుకుంటున్నాయి. జిల్లాలో 38 వరకు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మామిడి మద్దతు ధర నిర్ణయం కాకపోవడంతో ఫ్యాక్టరీలు ఇంకా ప్రారంభం కాలేదు. చిత్తూరు జిల్లాలో లక్ష 50 వేల ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ సంవత్సరం పంట గణనీయంగా తగ్గింది. సుమారుగా నాలుగు లక్షల టన్నుల మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం తోతాపురి రకం మామిడి 15 నుంచి 20 రూపాయలు పలికింది. ఈ సంవత్సరం కూడా అదే ధరను ఇవ్వాలని మామిడి రైతులు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుంభనంగా వ్యవహరిస్తుంది. మద్దతు ధర ఖరారు విషయంలో జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీల అసోసియేషన్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మామిడి గుజ్జు నిల్వలు ఇంకా రెండు లక్షల టన్నులు జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ సంవత్సరం మామిడి క్రషింగ్ కు జ్యూస్ ఫ్యాక్టరీలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. వారం రోజుల కిందట కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మామిడి రైతుల, మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులతో పాటు చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ప్రసాదరావు, శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మద్దతు ధర విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మామిడి ధరలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఖాదర్ రకం 30 రూపాయలతో ప్రారంభమై ప్రస్తుతం 20 రూపాయల దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. పులేరా రకం తొలుత 14తో ప్రారంభమైంది. ప్రస్తుతం ఐదు రూపాయలు పలుకుతున్నట్లు సమాచారం. పులేరా రకాన్ని తీసుకోవడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడం లేదు. దీంతో పలువురు రైతులు వాటిని ఉచితంగా గ్రామస్తులకు పంచిపెడుతున్నారు. ఇదే విధంగా తోతాపురి ధర కూడా ఎక్కడ తగ్గుతుందోనని అందోళన రైతులలో వ్యక్తం అవుతుంది. ఇందుకు రైతులు సంఘటితం అవుతున్నారు. బుధవారం కొంతమంది రైతుల బృందం జిల్లా కలెక్టర్ ని కలిసి మద్దతు ధర విషయమై చర్చించారు. రెండు మూడు రోజుల్లో మద్దతు ధర ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. గురువారం మరో బృందం చిత్తూర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి, వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మామిడి మద్దతు ధర 15 నుంచి 20 రూపాయలుగా నిర్ణయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర మీద కసరత్తును ముమ్మరం చేసింది. జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఫ్యాక్టరీ యజమానుల మీద వత్తిడి తెస్తున్నారు. తమ తమ వద్ద ఇప్పటికే మామిడి పల్ప్ నిల్వలు ఉన్నాయని, కావున మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం లేదని తెలియజేస్తున్నారు. గతంలో చేసిన పల్ప్ అమ్ముడుపోకుండా, మళ్లీ పల్ప్ చేయడం కారణంగా భారీగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తాము వ్యాపారస్తుల దగ్గర ఆర్డర్స్ తీసుకొని వారికి మామిడి పల్ప్ చేసి అమ్ముతున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వ్యాపారస్తులు ఎవరు తమను సంప్రదించలేదని, మామిడి పల్ప్ తయారుచేసి తాము ఏమి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మామిడి పల్ప్ తయారు చేసిన రెండు సంవత్సరాల లోపు వినియోగించకపోతే తర్వాత ఉపయోగానికి పనికిరాదని తెలియజేస్తున్నారు. గత సంవత్సరం నిల్వలు పేరుకుపోయినా, బ్యాంకులు తాము తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, సరైన ఫలితం లేదని చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం సహకరించకపోవడంతో తాము కూడా ఏమి చేయాలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. టీటీడీ దేవస్థానానికి అలాగే పాఠశాల విద్యార్థులకు మామిడి జూస్ సరఫరా చేయడం వల్ల కొంతవరకు మామిడి పల్ప్ నిల్వలు తగ్గే అవకాశం ఉన్నాయని, ఫలితంగా తాము క్రషింగ్ చేయడానికి మార్గం సుగమం అవుతుందని వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇప్పటివరకు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా జిల్లాలో మామిడి పల్ప్ నిల్వలు అలాగే ఉన్నాయి. మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు తిరిగి మామిడిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఆలస్యం అయ్యే కొద్ది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో మామిడికాయల సైజులు బాగా వచ్చింది. కోతకు సిద్ధమవుతున్నాయి. ఆలస్యం చేస్తే రైతులకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదముంది.
పో రై గంగ 1 మామిడి కాయలు

