జీడి నెల్లూరు టిడిపి ఎన్నికలపై వర్ల రామయ్యకు ఫిర్యాదుల వెల్లువ
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని వర్ల రామయ్య హామీ
చిత్తూరు, మే 26 (ఆంధ్రప్రభ బ్యూరో) : గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో మండల కమిటీల ఏర్పాటు వ్యవహారంపై పలువురు నేతలు రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మన్ వర్ల రామయ్యకు ఫిర్యాదులు చేసారు. కడప వెళుతూ తిరుపతిలో బస చేసిన ఆయనతో ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం పలువురు కలిసి పలు ఆరోపణలు చేసినట్టు తెలిసింది. ఆరోపణలతో కూడా ఫిర్యాదులు లిఖితపూర్వకంగా అందచేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ పార్టీ నియమావళికి విరుద్ధంగా కమిటీల ఏర్పాటుకు పూనుకున్నారని ఆరోపణలు చేశారు. ఇందులో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, ఎమ్మెల్యే తమ్ముడు నీది, పెనుమూరు, పాలసముద్రం, ఎస్ ఆర్ పురం మండలాలకు చెందిన పలువురు ఉన్నారు. ఇప్పటి వరకు నియోజక వర్గంలో ఎన్నికల కోసం ఒక సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. పార్టీ పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడు నియోజక వర్గానికి ఒక సారి కూడా రాలేదన్నారు. అయితే వైసిపి నుంచి వచ్చిన ముగ్గురు నేతల సలహాలతో ఏక పక్షంగా ఆరు మండలాల అధ్యక్షుల జాబితా రూపొందించి అధిష్టానం ఆమోదానికి పంపే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇందులో మూడు సార్లకంటే ఎక్కువ పర్యాయాలు పదవిలో ఉన్న వారు ముగ్గురు ఉన్నారని తెలిపారు. పెనుమూరు మండల అధ్యక్షుడు పి రుద్రయ్య నాయుడు ఎనిమిది సార్లు పదవిలో ఉన్నారని ఆధారాలు సమర్పించారు. ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామితో లాలూచీ పడి పార్టీకి ద్రోహం చేశారని తెలిపారు. ఆయన చాలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేసారు. పెనుమూరు మండలానికి చెందిన సుబ్రమణ్యం నాయుడు, రామకృష్ణ నాయుడు, రమణయ్య నాయుడు, తులసి నాయుడు తదితరులు రుద్రయ్యపై ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. పాలసముద్రం మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు నాలుగు సార్లు, కార్వేటినగరం మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్ మూడు సార్లు పదవిలో ఉన్నప్పటికీ తిరిగి నియమించే ప్రయత్నం చేస్తున్నారు. నియోజక వర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 60 వేల మంది ఉన్నప్పటికీ ఒక మండలం కూడా కేటాయించక పోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యే థామస్ ను ముగ్గురు వ్యక్తులు తప్పుదారి పట్టిస్తున్నారని కొందరు ఆరోపించారు. కొందరి వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మండల అధ్యక్షుడుగా నియమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆ ముగ్గురు ఇసుక అక్రమ రవాణా, ఉద్యోగుల బదిలీలలో భారీ ఎత్తున ముడుపులు తీసుకుంటున్నట్టు చిట్టిబాబు నాయుడు ఆరోపణలు చేసారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన బెట్టి వైసిపి నుంచి వచ్చిన అవకాశ వాదులకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల్లో తీవమైన నిరసన వ్యక్తం కావడంతో తాత్కాలికంగా అధ్యక్షుల ప్రకటన వాయిదా వేశారని చెప్పారు. పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడు మీద కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అయితే ఎన్నికల పారదర్శకంగా నిర్వహిస్తామని రామయ్య హామీ ఇచ్చారని కొందరు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగనందున మహానాడు తరువాత జూన్ నెల మొదటి వారంలో మండలాల వారిగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మెజారిటీ కార్యకర్తల అభీష్టం మేరకు కమిటీల ఎన్నిక జరుగుతుందని చెప్పారు. అధ్యక్షుల ఎన్నిక ధృవీకరించే ముందు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేస్తామని హామీ ఇచ్చారని తెలిసింది.
పో రై గంగ 3 వర్ల రామయ్యకు ఫిర్యాదు చేస్తున్న రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు
గంగ 4 పెనుమూరుకు చెందిన టిడిపి నాయకుల ఫిర్యాదు

