23, మే 2025, శుక్రవారం

ఎదురులేని రోజా.. తిరుగులేని స్వామి

పుంగనూరు విలినంతో మారనున్న సమీకరణాలు

జిల్లా రాజకీయాల మీద తగ్గనున్న పెద్దిరెడ్డి ప్రాభల్యం

పట్టు సాధించనున్న రోజా, నారాయణస్వామి 

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పనిచేశారు. ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణస్వామి, అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా మంత్రివర్గంలో ఉన్నారు. అయితే జిల్లాలో చక్రం చెప్పింది మాత్రం పెద్ద మంత్రి హోదాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మిగిలిన ఇద్దరు మంత్రులు జిల్లా రాజకీయాలలో అంతగా పాలు పంచుకోలేదు. జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్ల పంపకం నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీ వరకు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచింది. ఏడాదికి ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంత్రులుగా పనిచేసిన నారాయణస్వామికి తిరిగే టిక్కెట్లు లభించలేదు. రోజాకు నియోజకవర్గంలో అసమ్మతి సెగ ఎక్కువ కావడంతో మరో నియోజకవర్గానికి మారుస్తారన్న ఊహాగానాల మధ్య ఆఖరి నిమిషంలో నగరి టికెట్ ను తిరిగి ఖరారు చేశారు. జిల్లా రాజకీయాలలో రామచంద్రారెడ్డి తనదైన ముద్ర వేసి మిగిలిన ఇద్దరు మంత్రుల ప్రమేయం నామమాత్రంగా చేశారు. చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాల్లోకి కలపడంతో జిల్లాలో ఆర్కే రోజా, నారాయణ స్వాములకు జిల్లా రాజకీయాల మీద పట్టు దొరుకుతుందని, కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



పుంగనూరు నియోజక వర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయాలనీ మంత్రివర్గం నిర్ణయించడం చిత్తూరు జిల్లాలోని  కొందరు వైసిపి నేతల్లో సంతోషం కలిగిస్తోంది. దీని వల్ల మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఉండదని సంబరపడుతున్నారని తెలిసింది. ఇక జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆర్ కె రోజా కు ఎదురు లేదని, మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామికి తిరుగు ఉండదని వారి వర్గీయులు అంటున్నారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రభుత్వంతో పాటు పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. నారాయణ స్వామి ఉప ముఖ్య మంత్రి అయినప్పటికీ పెద్దిరెడ్డికి ఎదురు చెప్పలేని స్థితి ఉండేది. రోజా అయితే అణిగి మణిగి ఉండాల్సి వచ్చింది. అయినా ఆయన వారిపై అణచి వేత ధోరణి ప్రదర్శించారని చర్చ నడిచింది. వారి వ్యతిరేకులను ప్రేరేపించి ఇద్దరిని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సినీ రంగంలో నటిగా రాణిస్తున్న రోజాను టిడిపి అధినేత చంద్రబాబు పార్టీలో చేర్చుకుని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్ష పదవి ఇచ్చారు. 2004 ఎన్నికల్లో ఆమె నగరి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ చెంగా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009లో గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు నగరి టికెట్టు ఇచ్చి, ఆమెను చంద్రగిరిలో పోటీ చేయించారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ కుమారి చేతిలో ఓడి పోయారు. టిడిపిలోని ఒక వర్గం మోసం చేయడం వల్ల తాను ఓడిపోయానని రోజా మనస్థాపం చెంది టిడిపికి గుడ్ బై చెప్పారు. తరువాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత వై ఎస్ జగన్ ఏర్పాటు చేసిన  వైసిపిలో చేరారు. 2014 లో ఆ పార్టీ టికెట్టుపై  నగరిలో పోటీచేసి టిడిపి అభ్యర్ధి గాలి ముద్దు కృష్ణమ నాయుడుపై విజయం సాధించారు. 2019లో తిరిగి అక్కడే పోటీ చేసి టిడిపి అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ పై గెలుపు సాధించారు. జగన్ ఆశీస్సులతో ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా చేశారు. రెండున్నరేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో క్రీడా శాఖ మంత్రి అయ్యారు. అయితే ఆ సమయంలో మాజీ మంత్రి చెంగా రెడ్డి అన్న కుమారుడు చక్రపాణి రెడ్డి, శాంతి మరి కొందరు ఆమెపై తిరుగుబాటు చేశారు.  పెద్దిరెడ్డి మద్దతు ఉన్నందున వీరు రెచ్చి పోతున్నారని అప్పటిలో ఆమె ఆరోపించారు. ఆఖరికి వర్గ పోరువల్ల 2024 ఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు. మాజీ ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి పెద్దిరెడ్డి రామచంద్రా సమకాలికులు. 1981లో రెడ్డివారి చెంగా రెడ్డి ఆశీస్సులతో నారాయణ స్వామి కార్వేటినగరం సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమితి అధ్యక్షునిగా పోటీ చేసి కెలవాతి  రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. తరువాత 1989 నుంచి రామచంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు. నారాయణ స్వామి 2004లో సత్యవేడులో కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేసి టిడిపి అభ్యర్ధి డాక్టర్ ఎన్ శివప్రసాద్ పై విజయం సాధించారు. 2009లో అక్కడే పోటీ చేసి టిడిపి అభ్యర్ధి హేమలత చేతిలో ఓడిపోయారు.  2014 ఎన్నికల్లో జి డి నెల్లూరు నియోజక వర్గంలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్ధి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మపై విజయం సాధించారు. 2019 అక్కడే పోటీ చేసి టిడిపి అభ్యర్ధి డాక్టర్ హరికృష్ణపై గెలిచారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఐదేళ్లు ఉప ముఖ్య మంత్రిగా పనిచేశారు. అయితే అప్పటి ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి వర్గం నారాయణ స్వామికి టికెట్టు ఇవ్వకుండా అడ్డు పడింది. వీరి వెనుక పెద్దిరెడ్డి రామచంద్రా హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆయన జోక్యం చేసుకుని తన అనుచరుడు రాజేష్ కు జి డి నెల్లూరు ఇచ్చి, నారాయణ స్వామికి తిపటి లోక్ సభ ఇచ్చేలా జగన్ వద్ద పావులు కదిపారు. నారాయణ స్వామి ససేమిరా సమ్మతించక పోవడంతో ఆఖరికి జి డి నెల్లూరులో ఆయన కూతురు కృపాలక్ష్మీకి టికెట్టు ఇచ్చారు. రాజేష్ కు సత్యవేడు స్థానం కేటాయించారు. అయితే ఇద్దరూ ఓడిపోయారు.  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుట్ర వల్లే నగరి, జి డి నెల్లూరు లో పార్టీ ఓటమి పాలయ్యిందని ఆరోపణలు వినిపించాయి. ఇటీవల జగన్,  రోజా, నారాయణ స్వామి ఇద్దరికి వైసిపి రాజకీయ వ్యవహారాల ( పొలిట్ బ్యూరో ) కమిటీలో చోటు కల్పించారు. అయినా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాటే చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అన్నమయ్య జిల్లాలో కలిస్తే  చిత్తూరులో ఆయన  ఆయన ప్రాబల్యం తగ్గే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి ప్రమేయం తగ్గడంతో మాజీ మంత్రులు ఆర్కే రోజా, నారాయణ స్వాములు జిల్లాలో రాజకీయాలలో కీలకంగా వ్యవహరించనున్నారు. జిల్లాలోని రాజకీయ సమీకరణలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇప్పటినుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

పో రై గంగ 1 రోజా
గంగ 2 నారాయణస్వామి 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *