రాయలసేమకు టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి ?
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈ పర్యాయం రాయలసీమ జిల్లాలను వరించే పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమలో బలమైన వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికి దక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రాయలసీమ జిల్లాలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదు. అందులోన రెడ్డి సామాజిక వర్గానికి ఆ పదవి ఇప్పటివరకు దూరంగానే ఉంది. రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లాలకు ఈ పర్యాయం టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కవచ్చని భావిస్తున్నారు. ఈనెల ఆఖరిలో కడప జిల్లాలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు అనంతరం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. కావున రాష్ట్ర అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికి దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ అధినేత ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయల సీమ జిల్లాలపై దృష్టి సారించారు. వైసిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడప నుంచే సమర శంఖం పూరించ బోతున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో మహానాడు నిర్వహించనున్నారు. నభూతో నభవిష్యతి అన్న రీతిలో 10 లక్షల కార్యకర్తలు పాల్గొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు దగ్గర ఉండి ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక్కడ మహానాడు ఏర్పాటు వెనక చంద్రబాబు రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు. సామాజిక, రాజకీయ అంచనాలతో ఆలోచిస్తున్నారని జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకుడు ఒకరు చెప్పారు. ఉమ్మడి రాయలసీమ నాలుగు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డిది అనంతపురం జిల్లా. రెండుసార్లు ( మూడేళ్ళు) ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన 1977 లో రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు సార్లు ( రెండేళ్లు) ముఖ్యమంత్రిగా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 నుంచి 2009 వరకు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009 లో ముఖ్య మంత్రి అయిన కొద్ది నెలలకే ప్రమాదంలో మరణించారు. కాగా చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్ మంత్రిగా మూడేళ్లు ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2019 నుంచి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ( తొమ్మిది ఏళ్ళు) ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన, బిజెపితో కలసి కూటమిగా పోటీ చేసి భారీ మెజారిటీ సాధించారు. ఆయన నాలుగవ సారి ముఖ్య మంత్రి అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్య మంత్రిగా ఉన్నారు. 2029లో కూడా కూటమి గెలవాలంటే జగన్ ప్రాబల్యం పెరగకుండా జాగ్రత్త పడాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీని కోసం సీమ జిల్లాల్లో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మహానాడు వేదికగా సీమ అభివృద్ధి ప్రణాళికలను ప్రకటించనున్నారు. దీనితో పాటు రాయల సీమకు చెందిన కీలక నేతకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రోశయ్య ఏడాది కాలం ముఖ్యమంత్రిగా ఉండి రాజీనామా చేశారు. ఆ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డిని నిలువరించడానికి అదే సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యంత్రిగా నియమించారు. అదే విధంగా సీమలో జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి రెడ్డి నేతకు పార్టీ రాష్ట్ర సారధ్యం అప్పగిస్తే మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్టు సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఈ నేపధ్యంలో మాజీ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన తండ్రి అమరనాథ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. అలాగే పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమరనాథ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. గతంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షునిగా, టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తండ్రి రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యే, లోక్ సభ సభ్యుడుగా ఉన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఆయన తండ్రి విజయభాస్కర్ రెడ్డి మచ్చలేని ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి, కడపకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి టెక్ రవి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలకు పార్టీలో కీలక పదవులు ఇస్తారని భావిస్తున్నారు.

