రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాలలో భారీగా మార్పులు చేర్పులు
ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలు
మళ్లీ పుత్తూరు, వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గాలు
కొత్తగా తిరుపతి రూరల్ నియోజకవర్గం
తిరుపతి పార్లమెంట్ మహిళలకు దక్కే అవకాశం
ఓపెన్ క్యాటగిరిలోకి చిత్తూరు పార్లమెంట్
చంద్రగిరి, తిరుపతి, పలమనేరు, మదనపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గం మహిళలకు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ
గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో వాటిని 14కు కుదించారు. పుత్తూరు, వాయల్పాడు నియోజకవర్గాలు రద్దయ్యాయి. కొత్తగా పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. తొలుత చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఓపెన్ క్యాటగిరిలో ఉండగా దానిని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనాభా లెక్కల సేకరణ అనంతరం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది, ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 కు పెరగనున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో రెండు నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నందున జిల్లాలో 5 లేక 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం పుత్తూరు, వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి పురుడు పోసుకునే అవకాశం ఉంది. అలాగే తిరుపతి మునిసిపాలిటీ ఒక నియోజకవర్గంగా ఆవిర్భవించే అవకాశం ఉంది. కొత్తగా తిరుపతి రూరల్ నియోజకవర్గం రావచ్చను. అలాగే చిత్తూరు మున్సిపాలిటీ, గుడిపాల మండలాలను కలిపి చిత్తూరు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. రానున్న కాలంలో చిత్తూరు కార్పొరేషన్ మాత్రమే ఒక నియోజకవర్గంగా రూపుదిద్దుకోనుంది. గుడిపాల మండలం నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణలో పూతలపట్టు లేక గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుత్తూరు, వాయల్పాడు, తిరుపతి రూరల్ తో పాటు మరో రెండు లేక మూడు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. అలాగే పక్కన ఉన్న తిరుపతి నియోజకవర్గంను ఎస్సీలకు రిజర్వు చేశారు. పక్కపక్కనే రెండు పార్లమెంటు నియోజక వర్గాలను రిజర్వు చేయడం నిబంధనలకు వ్యతిరేకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కావున రానున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో చిత్తూరు పార్లమెంటు ఓపెన్ క్యాటగిరిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కారణంగా తిరుపతి పార్లమెంటును మహిళలకు రిజర్వ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల్లో కూడా మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. కావున జిల్లాలో ఎక్కువ మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గాలను మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, పలమనేరు, మదనపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గం మహిళలకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా రానున్న జమిలి ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పరంగా, రిజర్వేషన్ల పరంగా భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కొందరు పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు తిరిగి పోటీ చేసే అవకాశం రాకపోవచ్చును. తెరమీదకి కొత్త నాయకులు, కొత్త సమీకరణాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ మార్పులు కారణంగా జిల్లాలో రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. పోటీ చేయడానికి కొంతమంది నాయకులకు అవకాశం లేకుండా పోగా, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో జిల్లాలో కొత్త రాజకీయ నాయకులు తెరమీదకి వస్తారు. మహిళా రిజర్వేషన్ కారణంగా జిల్లాలో ఐదారు మంది మహిళలు ఈ పర్యాయం పార్లమెంట్, అసెంబ్లీ లలో అడుగు పెట్టనున్నారు.

