18, జూన్ 2025, బుధవారం

రోజుకో మలుపు తిరుగుతున్న జీడి నెల్లూరు రాజకీయం

నియోజకవర్గ పరిశీలకుల నియామకంలో పైచేయి సాధించిన  ఎమ్మెల్యే

రెండు రోజులకు ముందు ప్రకటించిన ఎన్నికల పరిశీలకులలో మార్పులు 

కమ్మ నేతలను తప్పించి, బీసీ నేతలకు స్థానం 

నియోజకవర్గ పరిశీలకుడిగా బొమ్మి సురేంద్ర నియామకం

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ రాజకీయాలు రోజుకో మరుపు తిరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించడానికి గత రెండు రోజుల కిందట ముగ్గురు నియోజకవర్గ పరిశీలకులను, ఆరు మంది మండల పరిశీలకులను అధిష్టానం నియమించింది. అయితే ఈ నియామకం పట్ల స్థానిక శాసనసభ్యులు థామస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. పరిశీలకుల నియామకంలో తమ ప్రత్యర్థి వర్గం పైచేయి సాధించిందని ఆవేదన చెందారని తెలిసింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో నియోజకవర్గ పరిశీలకులలో ఉన్న ఇద్దరి కమ్మ నేతలను తప్పించారు. ఆస్థానంలో ఇద్దరు బీసీ నేతలను నియమించారు. నియోజకవర్గ పరిశీలకుడిగా ఉండిన జయప్రకాష్ నాయుడు తప్పించి, ఆయన స్థానంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర ను నియమించారు. దీంతో ఎన్నికల పరిశీలకుల నియామకంలో స్థానిక ఎమ్మెల్యే థామస్ పైచేయి సాధించినట్లు అయ్యింది. అయన కోరిక మేరకు పరిశీలకులను అధిష్టానం మార్పు చేసింది.

 సంస్థాగత ఎన్నికలను పర్యవేక్షించడానికి  టిడిపి అధిష్టానం జిల్లా వ్యాప్తంగా ముగ్గురు నియోజక  పరిశీలకులు, మండలానికి ఒక పరిశీలకుడిని నియమించింది. ఇందులో భాగంగా గత శనివారం, అప్పటి వరకు ఉన్న సాధారణ పరిశీలకుడు రవి ప్రకాష్ తో పాటు, రాష్ట్ర కార్యదర్శి జె రమణా రెడ్డి ( జమ్మలమడుగు), మాజీ ఎమ్మెల్సీ ఎస్సీవీ నాయుడు( శ్రీకాళహస్తి) ని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. అలాగే ఆరు మండలాలకు ఆరుగురు ఎన్నికల పరిశీలకులను ప్రకటించారు. అయితే నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ నియోజక పరిశీలకుల నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండా పరిశీలకులను వేయడం ఏమిటని నిలదీశారు. దీనితో బుధవారం నియోజక వర్గం సాధారణ పరిశీలకునిగా రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర యాదవ్ ( బిసి) ని నియమించారు. ఎన్నికల పరిశీలకులలో ఎస్సీవీ నాయుడును తొలగించి ఆయన స్థానంలో శ్రీకాళహస్తికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువా రెడ్డి ( బిసి)ని నియమించారు. రమణా రెడ్డిని కొనసాగించారు. పాత కమిటీలో ఉన్న ఇద్దరు కమ్మ సామాజిక వర్గం నాయకులను తొలగించి బిసి నేతలకు అవకాశం కల్పించడం గమనార్హం. పాత కమిటీలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు అనుకూల నేతలు ఉన్నారని ఎమ్మెల్యే వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన ఎమ్మెల్యేని కాదని, తన వర్గం వారిని మండల కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనితో అధిస్థానం దిగి వచ్చి ఇద్దరిని మార్చారని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. అయితే ఎన్నికలలో పరిశీలకుల ప్రభావం ఏమీ ఉండదని, వారు కార్యకర్తల అభిప్రాయం సేకరించి అధిష్టాన వర్గానికి నివేదిక పంపుతారని అంటున్నారు. అధిష్టానం తమ దగ్గర ఉన్న సమాచారం, ఐ వి ఆర్ ఎస్ సర్వేలను విశ్లేషించి మండల అధ్యక్షుడు ఇతర కమిటీ సభ్యులను నియమిస్తారని తెలిసింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా ముగ్గురిని పరిశీలకులుగా వేశారు. నియోజక వర్గంలో ఉన్న ఆరు మండలాలలో సామాజిక న్యాయం జరిగేలా మూడు చోట్ల ఎస్సీ, బీసీలకు అవకాశం కల్పిస్తారని తెలిసింది. రెండు మండలాల్లో కమ్మ సామాజిక వర్గానికి, కనీసం ఒక మండలంలో అయినా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో పాలసముద్రం, జి డి నెల్లూరు, వెదురుకుప్పం మండలాల్లో రెండు చోట్ల ఎస్సీలకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలలో ఒకటి  బిసిలకు దక్కే అవకాశం ఉంది. వెదురుకుప్పం, పెనుమూరులో ఒక స్థానంలో రెడ్డిని మండల అధ్యక్షుని చేస్తారని అంటున్నారు. పాలసముద్రం, ఎస్ ఆర్ పురం, పెనుమూరు మండలాలలో రెండు చోట్ల కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఉంటుందని సమాచారం. కాగా మండల కమిటీ పరిశీలకులుగా మొదట ప్రకటించిన వారే కొనసాగుతారు. జి డి నెల్లూరు మండల కన్వీనర్ గా బంగారు పాల్యం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు  ఎన్ పి జయప్రకాశ్, కె నగరం పరిశీలకునిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, పాలసముద్రం పరిశీలకునిగా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ ఉంటారు. పెనుమూరు మండల పరిశీలకునిగా పార్లమెంటు ఉపాధ్యక్షుడు గంజి మాధవయ్య, ఎస్ ఆర్ పురం పరిశీలకురాలిగా చుడా చైర్ పర్సన్ కటారి హేమలత, వెదురుకుప్పం మండల పరిశీలకునిగా కాణిపాకం ఆలయ మాజీ చైర్మన్ ఎం సురేంద్రబాబు కొనసాగుతారు. వీరి పర్యవేక్షణలో గ్రామ, క్లస్టర్, మండల పార్టీ ఎన్నికలను నిర్వహిస్తారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *