ర్యాంపులలో కిలో మామిడి రెండు రూపాయలే !
భవిష్యత్తులో ధర పెరగవచ్చని ఆశ
ఫ్యాక్టరీకి కాయలు తోలితే అన్లోడ్ కు 3 నుండి 4 రోజులు
ట్రాక్టర్లలో పండు మాగి పోతున్న కాయలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 42 ర్యాంపు యజమానులు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు. వీరు రైతుల వద్ద మామిడి కాయలను కొనుగోలు చేయడానికి అనుమతి పొందారు. వీరికి మామిడిని సరఫరా చేసే రైతులకు సబ్సిడీ నమోదు చేసుకోవడానికి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తమ సిబ్బందిని కూడా కేటాయించారు. రెండు షిఫ్టులుగా ఈ సిబ్బంది ర్యాంపులకు మామిడికాయలను సరఫరా చేసే రైతుల వివరాలను నమోదు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. దీంతో రైతులకు నాలుగు రూపాయల సబ్సిడీ వస్తుంది. ర్యాంపులు రెండు రూపాయలను చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ నాలుగు రూపాయలు కలుపుకుంటే రైతుకు కిలో మామిడి కిలోకు 6 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. రెండు మూడు రోజుల్లో ర్యాంపులలో ధరలు పెరగవచ్చనని రైతులు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మామిడి కొనుగోలు వ్యాపారస్తులు ఇప్పుడిప్పుడే చిత్తూరు జిల్లాకు చేరుకుంటున్నారు. కావున రానున్న వారం రోజుల్లో ర్యాంపులలో కూడా ధరలు బాగా పెరగవచ్చనే ఊహాగానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం బంగారు పాలెం మండలంలో మామిడికాయలు కొనుగోలు చేయడానికి పదిమంది, తవణంపల్లి మండలంలో 6 మంది, సోమల మండలంలో ఇద్దరు, పులిచర్ల మండలంలో 9 మంది, రొంపిచర్లలో ఇద్దరు, పలమనేరులో ఒకరు, గంగాధర నెల్లూరులో నలుగురు, ఎస్సార్ పురంలో ముగ్గురు, చిత్తూరు మున్సిపాలిటీలో ముగ్గురు, చిత్తూరు రూరల్ లో ఒకరు, పెనుమూరులో ఒకరు ర్యాంపులకు అనుమతి పొందారు. ర్యాంపులలో రెండు నుంచి రెండున్నర రూపాయలు మాత్రమే ఇస్తుండడంతో రైతులు ర్యాంపులకు కాయలతో ఉండడానికి ఇష్టపడడం లేదు. అయితే జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమలు కూడా ఇప్పటివరకు తమ ధరను ప్రకటించలేదు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కిలోకు ఆరు రూపాయలు తగ్గకుండా ఇవ్వాల్సిందిగా అన్ని గుజ్జు పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏ పరిశ్రమ కూడా తాము జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తామని, ఆరు రూపాయల ధర ఇస్తామని ప్రకటించలేదు. అయితే నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు మామిడి గుజ్జు పరిశ్రమలు చెల్లించవచ్చని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అందుకని మామిడి గుజ్జు పరిశ్రమలకు కాయలను సరఫరా చేయడానికి రైతులు బారులు తీరుతున్నారు. ఒక్కొక్క ఫ్యాక్టరీ వద్ద సుమారుగా 400 నుంచి 500 వరకు ట్రాక్టర్లు వేచి ఉన్నాయి. ఒక ట్రాక్టర్ అన్లోడ్ చేయడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. దీంతో తీసుకెళ్లిన కాయలు సగం పండు మాగి, కుళ్ళి పనికిరాకుండా పోతున్నాయి. అయినా రైతులు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో గుజ్జు పరిశ్రమలకు కాయలను సరఫరా చేయడానికి ఇష్టపడుతున్నారు. జిల్లాలో 28 గుజ్జు ఫ్యాక్టరీలు ప్రారంభం కాగా ఇప్పటికే నాలుగు ఐదు ఫ్యాక్టరీలు తాము కాయలు కొనలేమని చేతులెత్తేశారు. ఇక కాయలు తీసుకొని రావద్దని నోటీసు బోర్డులో తెలియజేశారు. మరికొన్ని ఫ్యాక్టరీలలో కాయలు తీసుకోవడానికి ఛాంబర్ లు ఖాళీగా లేదని, వారంలో రెండు రోజులపాటు సెలవులను ప్రకటిస్తున్నాయి. ఆ రోజులలో ఫ్యాక్టరీ వద్దకు మామిడికాయలను తీసుకొని రావద్దని కోరుతున్నాయి. అయినా కూడా రైతులు మామిడికాయలను కోసి తీసుకెళుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఫ్యాక్టరీ యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్ల కాయలు అన్లోడ్ చేయడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఇందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కువ రోజులు ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు వేసి ఉండటంతో బాడుగ కూడా ఆ రోజులకు అదనంగా ట్రాక్టర్ యజమానులు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు అదనపు బాడిగ రూపంలో కూడా ఆర్థిక భారం పడుతుంది. అసలే గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకు కాయలు కోయడానికి కూలీలకు, ట్రాక్టర్ బాడుగులకు మరింతగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇప్పుడు సరఫరా చేస్తున్న మామిడికాయలకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. అలాగే ప్రభుత్వం రైతులకు ప్రకటించిన సబ్సిడీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. ఫ్యాక్టరీకి సరఫరా చేసిన మామిడికి ఎంత రేటు ఇస్తారో తెలియదు. అలాగే ఫ్యాక్టరీలు, ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు మామిడికాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు.
పో రై గంగ 1 మామిడి
పో రై గంగ 1 మామిడి

