21, జూన్ 2025, శనివారం

రూ. 591 కోట్ల రూపాయలతో జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం పనులు

 ఆరు నియోజకవర్గాలలో వేగంగా జరుగుతున్న పనులు 

మార్చి నెలాఖరుకు పూర్తికానున్న పథకం పనులు 

గృహ అవసరాలకు, వ్యవసాయానికి వేరువేరుగా విద్యుత్తు లైన్లు

ఇళ్లకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా

ఆంధ్రప్రభ బ్యూరోతో ట్రాన్స్ కో ఎస్ సి ఇస్మాయిల్ అహ్మద్


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం (ఆర్డిఎస్ఎస్) కింద చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వడానికి 591 కోట్ల రూపాయలతో జిల్లాలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని ట్రాన్స్ కో చిత్తూరు జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ ఎస్.కె ఇస్మాయిల్ అహ్మద్ వెల్లడించారు. శనివారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ ఈ పథకం కింద ఇప్పటివరకు 108 కోట్ల రూపాయలను వ్యయం చేయడం జరిగిందని, 2026 మార్చి నెల ఆఖరిలోపు జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం కింద పనులు పూర్తి కావాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో గృహ వినియోగానికి, వ్యవసాయ వినియోగానికి ప్రత్యేకంగా విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వివరించారు. ఈ పథకానికి 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని, 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పథకం పూర్తి అయితే గృహ వినియోగదారులకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు.

పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం అనేది భారత ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన ఒక పథకంగా తెలిపారు. దీని లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాను అందించడంగా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా, విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆర్థికంగా మరింత స్థిరంగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ప్రసారం, పంపిణీ  నష్టాలను తగ్గించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటం ప్రధాన ఉద్దేశాలుగా పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా  స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ఆధునిక పంపిణీ నెట్‌వర్క్‌ల నిర్మాణం, నష్టాలను తగ్గించడానికి అవసరమైన ఇతర పనులు ఉంటాయని వివరించారు. మానవ నైపుణ్యాల నవీకరణలో భాగంగా సిబ్బందికి శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి,  ప్రక్రియలను మెరుగుపరచడం వంటివి ఉంటాయని తెలిపారు. పథకం కింద వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయబడతాయనీ, ఇవి విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి, బిల్లింగ్ ప్రక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఫీడర్లను వేరు చేయడం, ఏరియల్ బంచ్ కేబుల్స్, ఇతర చర్యల ద్వారా నష్టాలను తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. అన్ని ప్రాంతాలలో 24 గంటలూ విద్యుత్ సరఫరా అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. విద్యుత్ పంపిణీ రంగాన్ని మెరుగుపరచడం, సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సరసమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం కింద పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తుందన్నారు.  వాటి కార్యాచరణ సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు. ఈ పథకం కింద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం ద్వారా డిస్కామ్‌లు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ఆదాయ-వ్యయ అంతరాన్ని తగ్గించడం ద్వారా డిస్కామ్‌ల దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యాన్ని నిర్ధారించడం జరుగుతుందని వివరించారు. మారుమూల ప్రాంతాల వినియోగదారులతో సహా అందరు వినియోగదారులకు సరసమైన ధరలకు అధిక నాణ్యత విద్యుత్ సరఫరాను చేయవచ్చన్నారు. ఈ పథకం కింద చిత్తూరు నియోజకవర్గానికి 44 కోట్ల రూపాయలు, గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 115 కోట్లు, నగరి నియోజకవర్గానికి 144 కోట్లు, పలమనేరు నియోజకవర్గానికి 77 కోట్లు, పుంగనూరు నియోజకవర్గానికి 178 కోట్లు, పూతలపట్టు నియోజకవర్గానికి 37 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది అన్నారు. మొత్తం పథకం విలువ 591 కోట్ల రూపాయలు కాగా ఇప్పటివరకు 108 కోట్ల రూపాయలను వ్యయం చేశామని వివరించారు. ఈ పథకం కింద ప్రతి గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. నూరు సర్వీసులకు ఒక 100 కేవి ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేస్తామని, 11 కేవీ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 224 సబ్ స్టేషన్ లో ఉండగా పట్టణ ప్రాంతంలోని సబ్ స్టేషన్ లో మినహా 190 సబ్ స్టేషన్లలో ఈ పథకం కింద 427 ఫీడర్లలో ఈ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ పథకం కింద కొత్తగా 288 వంద కేవి సబ్ స్టేషన్లు, 381 63 కే.వి సబ్ స్టేషన్లు, 516 25 కే.వి సబ్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు అవుతాయని వివరించారు. ఇందుకోసం కొత్తగా 30 వేల పోల్స్ ను  తెప్పించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా వచ్చే సంవత్సరం మార్చి చివరి నాటికి చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని పూర్తిచేసి గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని ట్రాన్స్ కో సూపరిండెంట్ ఇంజనీర్ ఇస్మాయిల్ అహ్మద్ స్పష్టం చేశారు.

పో రై గంగ 3 ట్రాన్స్ కో  ఎస్ సి ఇస్మాయిల్ అహ్మద్

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *