9, జూన్ 2025, సోమవారం

కోవర్టు, కప్పదాటు రాజకీయాలకు బ్రేక్

టిడిపిలోకి వచ్చే వారిపై ఆంక్షలు
అధిష్టానం అనుమతితోనే కొత్తవారిని తీసుకోవాలి 
ఈ మేరకు అధిష్టానం ఆదేశాలు

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

చిత్తూరు జిల్లాలో కప్పదాటు, కోవర్టు రాజకీయాలకు బ్రేక్ పడింది. పనుల కోసం టిడిపిలో చేరాలి అనుకునే అవకాశ వాదులకు నిరాశ ఎదురయ్యింది. ఇప్పటికే టిడిపిలో చేరిన వారికి కళ్ళెం వేసేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారితో సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి, కొత్తగా వచ్చిన వారికి పొంతన కుదరడం లేదు. కొన్నిచోట్ల కొత్తగా పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలే చక్రం తిప్పుతున్నారు. వారి వల్ల తొలి నుంచి పార్టీలో ఉన్నవారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందువల్ల పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని పలువురు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో పార్టీలో కొత్తగా నేర్చుకునే వారి విషయమై ఆచితూచి అడుగులు వేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

 ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ చేసి పార్టీ అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే చేయించుకోవాలని అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు.
దీనితో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ నేతలకు సర్కులర్ జారీ చేశారు.
ఇతర పార్టీల వారిని పార్టీలోకి తీసుకునే ముందు పార్టీ కేంద్ర కార్యాలయం అనుమతి తీసుకోవాలని  పేర్కొన్నారు. పార్టీలో చేరే వారి గురించి పూర్తిగా విచారించి, కేంద్ర కార్యాలయం అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని హోదాల్లో ఉన్న నేతలు ఈ ఆదేశాలను పాటించాలని  కోరారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. తప్పులు చేసి వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలి పోవద్దని హితవు చెప్పారు. ప్రతి ఒక్కరూ పనితీరు మెరుగు పరుచు కోవాలని ఆదేశించారు. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని తెలిపారు. ఎమ్మెల్యేలు అందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. జూన్ 12 నుంచి ప్రజలలోకి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కోరారు. ఈ నేపధ్యంలో ఇతర పార్టీల నుంచి టిడిపిలో చేరాలనుకునే వారికి గేట్లు మూసేసినట్టు అయ్యింది. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులు, కాంట్రాక్టర్లు టీడీపీలో చేరిపోయారు. దీనితో సీనియర్ టిడిపి కార్యకర్తలకు కొత్తగా చేరిన వారికి వైరం కొనసాగుతున్నది. గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో వైసిపి నుంచి వచ్చిన వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని కొందరు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వైసిపి నేతల పంచన పనిచేసిన వారు ఎన్నికల ముందు పార్టీలో చేరి అక్రమ వ్యాపారాలకు తెరతీసారని అంటున్నారు. ఇప్పటికీ వీరు వైసిపికి చెందిన ఒక అగ్రనేత కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ వైసిపి నేత చెన్నైకి వెళితే వీరే దక్కర ఉండి అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి నిత్యం గంగాధర నెల్లూరు, పాలసముద్రం మండలాల నుంచి 500 వాహనాలలో ఇసుక, గ్రావెల్, గ్రానైట్ చెన్నైకి తరలి పోతున్నాయని అంటున్నారు. ఈ అక్రమాల వెనుక వైసిపి నుంచి వచ్చిన కోవర్టుల హస్తం ఉందని కొందరు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. అయితే వీరు కొందరు పాత కార్యకర్తలను మచ్చిక చేసుకుని నిజమైన కార్యకర్తలపై సోషియల్ మీడియాలో అభాండాలు వేస్తున్నారు. ఇలాంటి వారికి తొట్టి గ్యాంగ్, 90 ఎంఎల్ బ్యాచ్ అంటూ పేర్లు పెట్టారు. చిత్తూరులో కొందరు కార్పొరేటర్లు చేరారు. పుంగనూరు పాత వారు అడ్డుకోవడంతో కొత్త వారి చేరిక ఆగిపోయింది. కాగా కొంత మంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మండలాలలో అధికారులు ఇప్పటికీ వైసిపి నేతలకే విలువ ఇస్తున్నారని అంటున్నారు. జిల్లా లోని అన్ని మండలాల ఎంపిపి, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్  వైసిపికి చెందిన వారే కావడంతో టిడిపి కార్యకర్తల మాట చెల్లుబాటు కావడం లేదు. జిల్లాలో 95 శాతం పైగా సర్పంచులు వైసిపి వారే కావడంతో గ్రామాలలో వారి పెత్తనమే కొనసాగుతోంది. దీనితో కార్యకర్తల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. కొంత మంది ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని పలువురి కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీనితో చంద్రబాబు నాయుడు వైసిపి వారికి గేట్లు మూసివేశారని, ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేసారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *