రచ్చ రచ్చగా జీడీ నెల్లూరు టిడిపి రాజకీయాలు
పోలీస్ స్టేషన్ కు చేరిన లంచాల బాగోతం
వాట్సాప్ గ్రూపులో పెట్టిన ఉద్యోగిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
లంచం తీసుకున్న వ్యవహారమై కేసు నమోదు చేయాలని మరో వర్గం డిమాండ్
రాష్ట్ర హోం మంత్రికి చేరిన లంచాల పంచాయతీ
కేసు నమోదులో న్యాయ సలహా కోరిన పోలీసులు
రెండు మూడు రోజుల్లో కేసు నమోదుకు అవకాశాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టీడీపీలో లంచాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. నియోజకవర్గ అవినీతి వ్యవహారం వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ కు చేరింది. తాను లంచం తీసుకున్నామన్న విషయాన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్ గ్రూపులో పెట్టారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఒక నాయకుడు వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే వాట్సప్ లో ఉన్న సమాచారం ప్రకారం లంచం తీసుకున్న వారిని విచారించి, వారి మీద మీద కేసును నమోదు చేయాలని మరికొందరు పోలీసు ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర హోం శాఖ మంత్రి వరకు వెళ్లింది. దీంతో కేసుల నమోదు వ్యవహారం వాయిదా పడింది. పోలీసులు న్యాయ సలహా కోరనున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ విషయం మీద పోలీసులు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. లంచాల వ్యవహారం బహిరంగంగా వాట్సాప్ గ్రూపులలో పెట్టడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన నాయకునితో స్థానిక ఎమ్మెల్యే సమావేశం కావడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. మరోవైపు మండల కమిటీల ఏర్పాటు రోజురోజుకు ఆలస్యం అవుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా, తీయడంలేదని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 30 ఏళ్ల తర్వాత ఇక్కడ టిడిపి ఎమ్మెల్యేగా డాక్టర్ వి ఎం థామస్ విజయం సాధించారు. ఆయన మాజీ ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి కుమార్తె వైసిపి అభ్యర్ధి కృపా లక్ష్మి పై 26 వేల మెజారిటీ సాధించారు. నియోజక వర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అయితే కొంత మంది ఆయన పేరు చెప్పుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆమేరకు ఆడియో వీడియోలను ఆధారంగా చేసుకుని అధిస్థానం వర్గానికి ఫిర్యాదులు చేస్తున్నారు. వైసిపి నుంచి వచ్చిన ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పి పనులు చేయిస్తామని కొందరి వద్ద లంచాలు వసూలు చేసినట్టు ఆధారాలు సేకరించి అధిష్టాన వర్గానికి పంపారు. అందులో ఒక నాయకుడు మాట్లాడిన ఆడియోను ఒక వ్యక్తి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. దీనిపై ఆ నాయకుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఎస్సై విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ బందోబస్తులో ఉన్నందున వచ్చిన తరువాత విచారిస్తానని చెప్పినట్టు తెలిసింది. అయితే లంచం తీసుకునే వారి రహస్యాలు బయట పెడితే కేసులు పెట్టడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తులపై కేసులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దీనిపై కొందరు సిఎం చంద్రబాబు, హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసినట్టు టిడిపి రాష్ట్ర నాయకుడు ఒకరు ధృవీకరించారు. కాగా పాలసముద్రం మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నట్టు కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం తహసీల్దారు అరుణ కుమారి బాలకృష్ణాసపురం, రామకృష్ణా పురం రెవెన్యూ గ్రామాలలో పర్యటించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నియోజక వర్గంలో ఉన్న మామిడి కాయల గుజ్జు పరిశ్రమల టోకెన్లు ఇవ్వడంలో కొందరు అధికార పార్టీ నాయకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు అందాయి. దీనితో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నియోజక వర్గంలో పర్యటించి టోకెన్ ల పంపిణీపై ఆరాతీశారు. కాగా నియోజక వర్షంలో టిడిపి మండల కమిటీల ఎన్నికల ప్రక్రియ ఇంత వరకు ప్రారంభం కాలేదు. రెండు రోజుల క్రితం నియోజక వర్గానికి ఇద్దరు కొత్త పరిశీలకులను వేశారు. గతంలో సాధారణ పరిశీలకుడిగా ఉన్న రవి ప్రకాష్ ను తప్పించి రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర యాదవ్ ను నియమించారు. అలాగే ఎన్నికల పరిశీలకుడిగా ఇటీవల నియమించిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును తొలగించి రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువా రెడ్డిని పెట్టారు. మరొక ఎన్నికల పరిశీలకుడు జె రమణా రెడ్డిని, ఆరుగురు మండల పరిశీలకులను కొనసాగించారు. అయితే ఇప్పటి వరకు పరిశీలకులకు ఎమ్మెల్యే అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఈ నేపధ్యంలో కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది. కాగా నియోజక వర్గంలోని వెదురుకుప్పం, పెనుమూరు, పాలసముద్రం మార్గాలలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

