17, జూన్ 2025, మంగళవారం

మామిడి మద్దతు ధర విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

పరిశ్రమలు రూ. 6 చెల్లించాలని నిర్ణయం 
ర్యాంపులు, మండిలలో కమీషన్ 50 పైసల తగ్గింపు 
మామిడి ధరలను అమలు చేయడానికి టాస్క్ ఫోర్సు ఏర్పాటు 
రైతుల కోసం కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు  


చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ. 
మామిడి గుజ్జు పరిశ్రమలు చెల్లించాల్సిన మద్దతు ధర మీద ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గతంలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఎనిమిది రూపాయలు రైతులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ధరను చెల్లించడానికి గుజ్జు పరిశ్రమలు ముందుకు రాలేదు. తమకు ఆ ధర గిట్టుబాటు కాదు అంటూ పలు పరిశ్రమలు మామిడిని తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో మరో మారు జిల్లా యంత్రాంగం మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపింది. తదుపరి ధర నిర్ణయించే వరకు మామిడి గుజ్జ పరిశ్రమలు రైతులకు కిలో 6 రూపాయల వంతున చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాదరి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే ర్యాంపులు, మండీలు ఇదివరకు తీసుకుంటున్న కమిషన్ లో 50 పైసలు తక్కువగా తీసుకోవాలని కూడా వారికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 

చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి జిల్లాలో మామిడి మద్దతు ధర విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాలుగా మామిడి పరిశ్రమలు తయారుచేసిన గుజ్జు ఎగుమతులు ఆగిపోవడంతో, ఈ సంవత్సరం మామిడికాయలు తీసుకోవడానికి గుజ్జు పరిశ్రమలు ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి మద్దతు ధరను ప్రకటించింది. పరిశ్రమలు ఎనిమిది రూపాయలకు రైతులకు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు రూపాయలు సబ్సిడీగా అందజేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం కిలో మామిడికి 12 రూపాయల వంతున మామిడి రైతులకు మద్దతు ధరను ప్రకటించింది. అయితే ఎనిమిది రూపాయల ధరను చెల్లించడానికి జిల్లాలోని పరిశ్రమలు ముందుకు రాలేదు. ధర నిర్ణయంలో జరిగిన ఆలస్యం కారణంగా మామిడి క్రషింగ్ నెల రోజుల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో జిల్లాలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో గత రెండు మూడు రోజులుగా పనిచేస్తున్నాయి. తోతాపురి రకం మామిడిని తీసుకుంటున్నాయి. దీంతో పక్వానికి వచ్చిన మామిడిని కోసి రైతులు పరిశ్రమలకు సరఫరా చేయడానికి పోటీలు పడుతున్నారు. ఒక్కసారిగా రైతులు మామిడికాయలను కోసి పరిశ్రమల వద్దకు తేవడంతో వాటిని అన్లోడ్ చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది. ఈలోపు కాయలు ట్రాక్టర్లలోనే మాగిపోతున్నాయి. దీంతో పరిశ్రమలు రైతులకు పర్మిట్లను మంజూరు చేయాలని నిర్ణయించాయి. ఫ్యాక్టరీలు తమ క్రషింగ్ సామర్ధ్యాన్ని బట్టి రోజుకు 30 నుంచి 90 వరకు పరిమిట్లను జారీ చేస్తున్నాయి. అయితే పర్మిట్ల జారీ తన పారదర్శకంగా జరగడం లేదని జిల్లాలో మామిడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. చిత్తూరుకు సమీపంలోని ఆర్ఎంఎం, బంగారుపాలెం మండలంలోని సన్ గోల్డ్, తవణంపల్లి మండలంలోని ఎఫ్ త్రీ, గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ ఫ్యాక్టరీల వద్ద రైతులు ఆందోళనలకు దిగారు. పక్వానికి వచ్చిన మామిడికాయలను తీసుకోవాలని ఫ్యాక్టరీ యజమానుల మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. అయితే సామర్థ్యానికి మించి తాము తీసుకోవడం జరగదని ఫ్యాక్టరీ యజమానులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పలుచోట్ల రైతులకు పరిశ్రమల యజమానులకు వాదాపవాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీల ఎదుట పర్మిట్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడి పరిశ్రమలు రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను ఐదు రూపాయలకు తగ్గించాయి. కొన్ని ఫ్యాక్టరీలు 6 రూపాయలుగా నిర్ణయించారు. అయితే ర్యాంపులు, మామిడి మండీలలో కిలో మామిడి మూడున్నర రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. రైతులు మద్దతు ధర గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాయలు పక్వానికి వచ్చి, మాగి కిందపడి పోతున్నాయి. కావున మామిడికాయలను సరఫరా చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో మంగళవారం తవణంపల్లి మండలంలోని ఫ్యాక్టరీలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాదరి పరిశీలించారు. అక్కడి పరిశ్రమల యజమానులతో, రైతులతో మాట్లాడారు. అనంతరం చిత్తూరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమలు చెల్లించాల్సి మామిడి మద్దతు ధరను ఆరు రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. అంతకన్నా తక్కువకు ఎవరైనా మామిడిని కొనుగోలు చేస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే ర్యాంపులు, మామిడి మండీలలో కూడా ఆరు రూపాయలు మద్దతు ధర అమలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మద్దతు ధరల కచ్చితంగా అమలు చేయడానికి టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. రెండు రోజుల కిందట చిత్తూరు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు మామిడి రైతులకు మద్దతు ధర మీద వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పరిశ్రమలు రైతులకు ఎనిమిది రూపాయలు ఇవ్వకుంటే ఫ్యాక్టరీ యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి వెళ్లిన రెండు రోజులలోనే చిత్తూరు జిల్లాలో మామిడి మద్దతు ధర రెండు రూపాయలు తగ్గింది. మామిడి పరిశ్రమలు  ఆరు రూపాయలు చెల్లిస్తే చాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీంతో తమకు గిట్టుబాటు ధర వస్తుందన్న రైతుల ఆశల మీద చన్నీళ్లు చల్లినట్లు అయింది. పరిశ్రమలు 6 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. దీంతో రైతుకు పది రూపాయల వంతెన గిట్టుబాటు అవుతుంది. మామిడి మద్దతు ధర నుంచి ప్రభుత్వ వెనక్కి తగ్గడంతో ప్రతిపక్ష వైసిపి, వామపక్ష నేతలు, మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎనిమిది రూపాయల మద్దతు ధరలు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

పో రై గంగ 1 బంగారుపాలెం మండలం సన్ గోల్డ్ వద్ద రైతుల నిరసన (ఫైల్ ఫోటో) 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *